ఇదీ బాబు మాట...!
ఎమ్మెల్యేలుగా పార్టీ గుర్తుపై గెలిచిన వారికి రహస్య ఓటింగ్ ఎందుకు? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున గెలిచారో ఆ మెజారిటీ మేరకు దామాషా పద్ధతిన ఎమ్మెల్సీలు ఇవ్వాలి. అలా చేస్తేనే బేరసారాలు ఆగిపోతాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా పద్ధతిలో నిర్వహించేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ను కోరబోతున్నాం.
ఓటుకు నోటు వ్యవహారం బయటపడిన తర్వాత ఈ నెల 4వ తేదీ అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో జరిగిన జన్మభూమి మావూరు కార్యక్రమంలో ప్రసంగిస్తూ చంద్రబాబు అన్న మాటలివి.
ప్రతిపక్షం ఏమంది...!!
ప్రజా ప్రతినిధుల సంఖ్యను బట్టి దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తే రాజకీయ బేరసారాలు ఆగిపోతాయన్న మాటకు చంద్రబాబునాయుడు కట్టుబడి ఉండాలి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బలం ఉన్న చోటే ఆయా పార్టీలు పోటీచేద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు చంద్రబాబు ముందుకు రావాలి. టీడీపీకి బలం ఉన్న చోటే పోటీ చేస్తే మంచిది.
చంద్రబాబు మాటలపై జూన్ 5వ తేదీన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో అన్న మాటలు.
చంద్రబాబు చేసిందేమిటి...!!!
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అయిదు కోట్ల రూపాయలు ఆశ చూపి అందులో రేవంతర్‌రెడ్డి 50 లక్షలిస్తుండగా అడ్డంగా దొరికిన వ్యవహారం బయటపడిన తర్వాత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నైతిక విలువలపై ఉద్బోధిస్తూ చంద్రబాబు చేసిందేమిటని ఒకసారి పరిశీలిస్తే... ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బలం లేకపోయినా, లేదని స్పష్టంగా తెలిసినా... కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలిపారు. బలం లేకపోయినా పోటీకి నిలపడమంటే ఏమనుకోవాలి? నైతిక విలువలకు కట్టుబడి పోటీకి పెట్టారనుకోవాలా? లేకపోతే... చంద్రబాబు చెప్పేదానికి, చేసే దానికీ పొంతన ఉండదన్న అభిప్రాయం నిజమేనని ఇక్కడ అర్థం కావడం లేదా!