
జిల్లా ప్రజలను సీఎం మోసం చేశారు
ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలను తీవ్రంగా మోసం చేశారని ఎంపీ వైవీ దుయ్యబట్టారు.
ఒంగోలు అర్బన్: ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలను తీవ్రంగా మోసం చేశారని ఎంపీ వైవీ దుయ్యబట్టారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో పూటకో మాట చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప స్పష్టత లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో గతంలో మూడు లక్షల ఇరవై నాలుగువేల మంది పింఛను లబ్ధిదారులుంటే వారిలో 80 వేల మందిని అనర్హులుగా ప్రకటించి పింఛన్లు ఎత్తివేయడం దారుణం కాదా అని నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసిన కారణంగా 70 వేల మందిని అర్హుల జాబితా నుంచి తొలగించడం సిగ్గుచేటన్నారు.
అధికారం చేపట్టిన తర్వాత ఎవరైనా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేయాలి కానీ కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించకూడదని హితవు పలికారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా ఉపయోగ కార్యక్రమాలను స్వాగతిస్తాం కానీ అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాకి కనీసం ఒక కేంద్ర స్థాయి విద్యా సంస్థయినా కేటాయించకపోవడం చూస్తే చంద్రబాబుకి మన జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రి జిల్లాపై శ్రద్ధ చూపాలని, లేకుంటే ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.