Debt Waiver and Debt
-
జిల్లా ప్రజలను సీఎం మోసం చేశారు
ఒంగోలు అర్బన్: ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలను తీవ్రంగా మోసం చేశారని ఎంపీ వైవీ దుయ్యబట్టారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో పూటకో మాట చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప స్పష్టత లేదని ధ్వజమెత్తారు. జిల్లాలో గతంలో మూడు లక్షల ఇరవై నాలుగువేల మంది పింఛను లబ్ధిదారులుంటే వారిలో 80 వేల మందిని అనర్హులుగా ప్రకటించి పింఛన్లు ఎత్తివేయడం దారుణం కాదా అని నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసిన కారణంగా 70 వేల మందిని అర్హుల జాబితా నుంచి తొలగించడం సిగ్గుచేటన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఎవరైనా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేయాలి కానీ కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించకూడదని హితవు పలికారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా ఉపయోగ కార్యక్రమాలను స్వాగతిస్తాం కానీ అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాకి కనీసం ఒక కేంద్ర స్థాయి విద్యా సంస్థయినా కేటాయించకపోవడం చూస్తే చంద్రబాబుకి మన జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రి జిల్లాపై శ్రద్ధ చూపాలని, లేకుంటే ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. -
రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక డీసీసీబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ నేడు షరతులు విధించడం సరికాదన్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులకు ఎంతచేసినా తక్కువేనని చెప్పారు. సూర్యాపేట, భువనగిరిలోని సహకార బ్యాంకు భవన నిర్మాణాలను పూర్తి చేయడానికి రిటైర్డ్ ఇంజినీర్‌ను కాంట్రాక్టు పద్ధతిని నియమించనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినప్పటికీ నిర్మాణ బాధ్యతలు నిర్వహించే వారులేక పూర్తి చేయలేదన్నారు. జిల్లాలో గోదాముల నిర్మాణాల కోసం రూ. 2 కోట్లు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. సహకార బ్యాంకు ద్వారా రూ.40 కోట్ల దీర్ఘకాలిక రుణాలను ఇవ్వనున్నామన్నారు. దీర్ఘకాలిక రుణాలను వసూలు చేయడంలో జిల్లా బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వ్యాపారాలు నిర్వహించడానికి ముందుకు వచ్చే సొసైటీలకు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ నెల 12న బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో డెరైక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, చాపల లింగయ్య, గరిణె కోటేశ్వర్రావు, నరేందర్‌రెడ్డి, రమణారెడ్డి, పీర్‌నాయక్, ముత్యంరావు పాల్గొన్నారు. -
రుణమాఫీపై మాటమార్చిన ప్రభుత్వం
వినాయక్‌నగర్,న్యూస్‌లైన్ : రైతులకు రుణమాఫీ చేస్తామని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ చేస్తానని పొందుపరిచి, అధికారంలోకి రాగానే రుణమాఫీ విషయంలో మాటతప్పి అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శిం చారు. ఆగమేఘాల మీద బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి 2013-14 సంవత్సరంలో తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. రైతుల రుణాలు మాఫీ అయ్యేంత వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున రైతులను తీసుకొని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాన్నారు. మొత్తం రుణాలు మాఫీ చేసే వరకు పోరాడుతామన్నారు. ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, బాణాల లక్ష్మారెడ్డి, న్యాలం రాజు, సుంకరి భాస్కర్‌రావు, నారాయణయాదవ్, దేవేందర్, చంద్రభూషన్, సర్పంచ్ గంగాధర్, రోషన్గోరా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పుతారా
ఉద్యమ పార్టీగా ఎన్నో ఆందోళనలు చేసి, ప్రజల ఆకాంక్షకు అద్దంలా నిలిచిన టీఆర్ఎస్.. అధికార పార్టీగా మారిన తర్వాత ఆ ప్రజల నుంచే నిరసనలను ఎదుర్కొంటోంది. పంట రుణాల మాఫీపై నిబంధనలను విధించడాన్ని నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీ అమలులో వెనుకంజ వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా అంతటా నిరసనలు కొనసాగాయి. మంథనిలో టీఆర్ఎస్ నేతలే పార్టీ జెండా గద్దెను కూల్చేయడం గమనార్హం. రుణాల మాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టవద్దని, పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కర్షకులు విజ్ఞప్తి చేశారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ / న్యూస్‌లైన్, నిజాంసాగర్: 2013 ఖరీఫ్, రబీ సీజన్లలో తీసుకున్న పంటరుణాలకే రుణ మాఫీ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఇందూరు రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిబంధనలను సాకుగా చూపి రైతులకు అన్యాయం చేయవద్దని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్మపురి శ్రీనివాస్, పల్లె గంగారెడ్డి, వీజీ గౌడ్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. పంటరుణాల మాఫీపై రైతులు ఆందోళన చెందవద్దని, రుణమాఫీపై ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. కట్టలు తెంచుకున్న కర్షకుల ఆగ్రహం రుణమాఫీలో నిబంధనలు వద్దంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని మంథనిలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ జెండా గద్దెను కూల్చి వేసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రైతులు సమావేశమై ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్‌లో రాస్తారోకో చేయాలని తీర్మానించారు. అన్ని గ్రామాభివృద్ధి కమిటీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ధర్పల్లి, వేల్పూరు మండలం మోతె, జాన్కంపేట్‌లలో సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు. కామారెడ్డి నియోజకవర్గంలో పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. గాంధారి మండలం మాతుసంగెం గ్రామంలో గ్రామస్తులు టీఆర్ఎస్ గద్దెను కూల్చేశారు. సిరికొండ, కమ్మర్‌పల్లిలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఎల్లారెడ్డి, తాడ్వాయి మండలాల్లో ధర్నాకు దిగారు. రెంజల్ మండలంలోని దూపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. నీల, తాడ్‌బిలోలి, రెంజల్ గ్రామాల రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అందరికీ రుణమాఫీ పథకాన్ని వర్తింప చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మోర్తాడ్‌లో పంట రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ తీరుకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా వెంటనే పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భిక్కనూరు, దోమకొండ, లింగంపల్లిలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
దగా... దగా..
కేసీఆర్‌పై విపక్షాల కన్నెర్ర రైతాంగ రుణ మాఫీ హామీపై కేసీఆర్ మాట తప్పారంటూ విపక్షాలు, రైతు సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ‘ఎన్నికలకు ముందేమో.. రైతాంగ రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. తీరా గద్దెనెక్కాక.. కేవలం 2013-14 సంవత్సరానికి మాత్రమే రుణాలను రద్దు చేస్తామంటున్నారు. ఇది పచ్చి దగా. రైతులను ప్రభుత్వం మోసగిస్తోంది’ అని, విపక్షాలు.. రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. హామీ నెరవేర్చాలి వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ కారేపల్లి, న్యూస్‌లైన్: రైతులకు బ్యాంకుల్లో లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చాలని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2013-14 సంవత్సరంలో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామనడం సరికాదని, ఇది కేవలం కంటి తుడుపు మాత్రమేనని అన్నారు. సీఎం ప్రకటనతో రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని అన్నారు. ‘‘వైఎస్సార్ మరణాంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు రైతు వ్యతిరేక విధానాలు అవలవంబించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఈ తరుణంలో.. కేసీఆర్ ప్రకటించిన రుణ మాఫీ పథకంతో కొంతైనా ఉపశమనం కలుగుతుందని రైతులు భావించారు. కానీ, తాజాగా కేసీఆర్ చేసిన అర్థరహిత ప్రకటనలతో రైతుల్లో అయోమయం, ఆందోళన నెలకొంది. రైతులు ఈ ఏడాది పంట రుణాల కోసం బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి కనబడటం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ లోవిత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. బేషరతుగా అమలుచేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ కూసుమంచి, న్యూస్‌లైన్: రైతుల లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ఇచ్చిన హామీని కేసీఆర్ బేషరతుగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. కూసుమంచిలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో కష్ట, నష్టాలతో వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉందన్నారు. తుపానులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, వారు కోలుకునేలా పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామంటూ టీఆర్ఎస్ ఇచ్చిన హామీని రైతాంగం నమ్మింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. కొద్దిమంది రైతుల రుణాలను మాత్రమే మాఫీ చేస్తామంటోంది. ఇది సహేతుకంగా లేదు’’ అన్నారు. ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడాలని, రైతుల లక్ష లోపు రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నందున బ్యాంక్ రుణాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖరీఫ్ ప్రశ్నార్థకం తెలంగాణ రైతు సంఘం రాష్ర్ట నాయకుడు జమ్ముల జితేందర్ రెడ్డి ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: రైతాంగ రుణ మాఫీపై షరతులు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ పునఃసమీక్షించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు జమ్ముల జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సంఘం సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయంపై దశాబ్ద కాలంగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో రైతాంగం అప్పుల్లో కూరుకుపోయిందని, వాటిని చెల్లించలేని దయనీయ స్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఒకవైపు బ్యాంకు రుణాలు, మరోవైపు ప్రైవేట్ అప్పులు దొరకని గడ్డు పరిస్థితుల్లో అనేకమంది రైతులు బంగారాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వమేమో.. బంగారంపై రుణాలు, పాత అప్పులు, 2013 సంవత్సరానికి ముందున్న రుణాల మాఫీ ఉండదని చెప్పడం దారుణం’’ అని అన్నారు. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా రద్దు చేయాలని, విత్తనాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తమ సంఘం ఆందోళన చేపడుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంక్షలు సరికాదు నాగులవంచ (చింతకాని), న్యూస్‌లైన్: రైతుల లక్ష రూపాయల లోపు బ్యాంక్ రుణాలను మాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని బేషరతుగా అమలు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండ బాల కోటేశ్వరరావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన నాగులవంచ గ్రామంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... బ్యాంకుల్లో రెతులకున్న లక్ష రూపాయల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆంక్షలు విధించటం సరికాదని అన్నారు. విశ్వాసాన్ని కోల్పోతారు ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: రైతాంగ రుణ మాఫీపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరిస్తే.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రుణ మాఫీ హామీని బేషరతుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారంగా జిల్లాలో కేవలం ఐదు శాతం రుణాలు మాత్రమే రద్దవుతాయని, మిగిలిని వారి పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణ మాఫీ హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. మాట తప్పుతోంది కోయచెలక (ఖమ్మం అర్బన్), న్యూస్‌లైన్: రైతుల రుణ మాఫీపై కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పుతోందని తె లుగు రైతు జిల్లా అధ్యక్షుడు మందడపు సుధాకర్ విమర్శించారు. ఆయన గురువారం కోయచెలకలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రైతులు అప్పులు చెల్లించొద్దు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తుందని ప్రచారం చేసి గద్దెనెక్కిన కేసీఆర్.. ఇపుడు మాట తప్పుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్‌ను నమ్మిన రైతులు ఇన్నాళ్లూ అప్పులు చెల్లించలేదు. ఈ కారణంగా వడ్డీ పెరిగింది. వారి పరిస్థితేమిటి...?’’ అని ప్రశ్నించారు. అన్యాయం చేయొద్దు ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: రైతు రుణ మాఫీని 2013 జూన్ నుంచి 2014 మధ్య కాలానికి మాత్రమే వర్తింపచేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జీలు అయితం సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, శీలంశెట్టి వీరభద్రం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. రైతులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇచ్చిన హామీపై మాట మార్చడం తగదని పేర్కొన్నారు. కాలపరిమితి, షరతులు లేకుండా రైతు రుణ మాఫీ హామీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దారుణంగా మోసగించింది ఖమ్మం వైరా రోడ్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చీరావడంతోనే రుణ మాఫీపై ఎన్నికల హామీని తుంగలో తొక్కి రైతులను దారుణంగా మోసగించిందని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా చైర్మన్ మొక్క శేఖర్ గౌడ్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రైతుల అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని, రైతులెవ్వరూ బ్యాంక్ అప్పులు చెల్లించొద్దని చెప్పిన కేసీఆర్.. తీరా ఇప్పుడు అనేక రకాల షరతులతో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతుల రుణ మాఫీ హామీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాలపరిమితి వద్దు ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: రైతాంగ రుణ మాఫీపై కాలపరిమితి విధించవద్దని తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి పుల్లయ్య డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘రైతుల రుణ మాఫీపై టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా కాలపరిమితి లేదు. ఇప్పుడు మాత్రం కాలపరిమితి, షరతులు విధిస్తోంది. ఇది సరికాదు’’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తుందని, రుణాలు రద్దవుతాయని రైతులంతా ఇన్నాళ్లూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిపై కేసీఆర్ ఒక్కసారిగా నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
రుణం.. రణం..
కొత్తప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్న రైతాంగం ఇప్పుడు నైరాశ్యంలో పడింది. రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 2013-14 ఏడాదికాలానికి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామనడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. ‘ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య..ఓడ దిగాక బోడ మల్లయ్య’ చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో నాలుగేళ్లుగా పంటలు పండక రెన్యూవల్, బుక్అడ్జస్టుమెంట్లు కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటని విపక్షాలు, రైతుసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. గురువారం జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: కొత్త ప్రభుత్వం వస్తే రుణమాఫీ వస్తుందనుకున్న రైతుల ఆశలు ఇప్పుడు అడియాశలే అయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్..అధికారంలోకి రాగానే మెలిక పెట్టడంపై రైతులు భగ్గుమంటున్నారు. కేవలం గత సంవత్సరం రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రైతులు ఆందోళన కు దిగారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు కూడా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేసి మాట నిలబెట్టుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనలు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి.. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బక్కరైతు బిక్కు బిక్కు నిన్నటి వరకు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న కేసీఆర్ మాట మార్చడంతో సన్నచిన్నకారు రైతులే తీవ్రంగా నష్టపోనున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ భారీగా తోడవడంతో అప్పులు ఏలా తీర్చాలని బక్కరైతులు బిక్కు బిక్కు మంటున్నారు. జిల్లాలో మొత్తం 4.75 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 4,021 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. వీటిలో 3.80 లక్షల మంది రైతులకు చెందిన పంట రుణాలు రూ.2,682 కోట్లు ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టి పాస్బుక్ఆధారంగా తీసుకున్న రుణాలు రూ.486 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు వివిధ కేటగిరీల కింద రైతులు రూ.853 కోట్ల రుణాలు పొందారు. 2013-14లో రూ.2,455 కోట్ల రుణాలను వివిధ కేటగిరీల కింద రైతులు తీసుకున్నారు. పంటరుణాలుగా రూ.1706 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి పాస్‌బుక్ ఆధారంగా రూ.385 కోట్లు, వివిధ కేటగిరీల కింద రూ.364 కోట్ల రుణాలను రైతులు పొందారు. కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేస్తే జిల్లాలోని సుమారు మూడు లక్షల మంది రైతులకు చెందిన రూ.3వేల కోట్లు మాఫీ అవుతాయి. అలాకాకుండా కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ప్రకారం 2013 జూన్ 1వ తేదీ నుంచి 2014 జూన్ వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తే.. జిల్లాలో కేవలం రెండు లక్షల మంది రైతులకు చెందిన రూ. 900 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో రైతుల పంటలు నిలువునా ఎండిపోవడం, నీటిపాలు కావడం చూశాం. కుటుంబం గడవలేని స్థితిలో ఉన్న రైతులు అప్పులు చెల్లించలేదు. కేవలం పెద్ద రైతులు మాత్రమే అప్పులు చెల్లించటం, రెన్యూవల్స్ చేయించటం వంటివి చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం బక్క రైతులకు కాకుండా ధనిక రైతులే అధికంగా లాభం పొందే అవకాశం ఉంది. ఆందోళనల బాటలో అన్నదాతలు.. గద్దెనెక్కక ముందు ఓ మాట..ఆ తర్వాత మరో మాట కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ జిల్లాలోని రైతులు ఆందోళనబాట పడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా రూ. లక్షలోపు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గురువారం జిల్లాలోని ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో రైతు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనకు సిద్ధం కావాలని రైతులకు పిలుపు నిచ్చారు. నిరసన కార్యక్రమాలు ఉధృతం చేసేందుకు శుక్రవారం అన్ని రాజకీయపక్షాల రైతుసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ముంపు మండలాల రైతులపై వీడని సందిగ్ధత.. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో తీసుకున్న నిర్ణయం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతానికి వర్తింస్తుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు సీమాంధ్రలో కలిస్తే అక్కడి తెలుగుదేశం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలి. జిల్లాలోని ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడినప్పటికీ..ఇక్కడి రైతుల రుణాల విషయంలో మాత్రం ఇంత వరకు స్పష్టత రాలేదు. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? సెంటు భూమిలేని వ్యవసాయ కూలీలు చాలామంది భూములు కౌలుకు చేస్తున్నారు. గత ప్రభుత్వం కొంతమంది కౌలు రైతులకు కార్డులు జారీ చేసింది. జిల్లాలో 70 వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. యేటా మే చివరి వారం నుంచి వారికి కూడా సాధారణ రైతుల్లాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ మొదటి వారం పూర్తికావస్తున్నా ఇంతవరకు అటు సాధారణ రైతులు, ఇటు కౌలు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ రుణాలు ఇవ్వలేదు. రుణమాఫీ విషయంలోనే ఇప్పటికీ ఓ స్పష్టతకు రాలేకపోయిన ప్రభుత్వం కొత్త రుణాల విషయాన్ని ఇంకా ఎంతకాలం నాన్చుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం గ్రామాల్లో వాస్తవంగా ఎంతమంది కౌలు రైతులు ఉన్నారనే విషయమై క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సర్వే చేయాలి. కానీ దీనిపై రెవెన్యూ అధికారులు చేసిన ప్రయత్నాలు లేవు. మేనెల రెండోవారంలోపే కౌలు రైతులను గుర్తించాలి. అనంతరం వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. గత ఏడాది పాలేరు నియోజకవర్గంలో రెండువేల మంది కౌలు రైతులను గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులు కూడా మంజూరు చేశారు. వారిలో కేవలం 500 మందికి కూడా బ్యాంక్‌ల్లో రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు కొర్రిలు పెట్టడం సర్వ సాధారణమైంది. ‘ఏ ఆధారం చూసి మీకు అప్పు ఇవ్వాలి? ఈ భూమిపై మీకేం హక్కు ఉంది? తీసుకున్న రుణం ఎలా తీర్చుతావు? కాబట్టి రుణం ఇవ్వడం కుదరదు..’ అంటూ బ్యాంకర్లు కొర్రీలు పెడుతుండటంతో కౌలు రైతులు వ్యవసాయ రుణానికి నోచుకోవడం లేదు. -
కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర
తలమడుగు, న్యూస్‌లైన్ : రుణమాఫీకి ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ రైతులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కేసీఆర్ వైఖరిని వ్యతిరేకిస్తూ రుయ్యాడి, త లమడుగు, సుంకిడి గ్రామాల్లో రైతులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ర్యాలీ, రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా రైతులు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, నర్సింహు లు, తిరుపతిరెడ్డి, రాజన్న తదితరులు మాట్లాడారు. బ్యాంకు రుణాలు చెల్లించొద్దు, అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామ ని ఎన్నికల సమయంలో కేసీఆర్ రైతులను నమ్మించాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక వారం తిరక్కముందే మాట తప్పి ఒక ఏడాది పంటరుణాలకే మాఫీ వర్తిస్తుంద ని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎలాం టి ఆంక్షలు లేకుండా రూ.లక్షలోపు ఉన్న పంటరుణాలన్నిం టినీ మాఫీ చేయాలని, లేనిపక్షంలో రైతులంతా కలిసి ఆందోళనలు చేడతామని హెచ్చరించారు. తెలుగు యువత నాయకుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహులు, నర్సింగ్, లింగల రాజన్న, ఆనంద్, వెంకన్న, ఆశన్న పాల్గొన్నారు. -
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారు
నవాబుపేట, న్యూస్‌లైన్: ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో కోదండపాణి ఆధ్వర్యంలో సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం వీఆర్వోలు, సాక్షరభారత్ సిబ్బంది, వివిధ గ్రామాలను చెందిన సర్పంచ్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాపీ చేస్తామని ఎన్నికల్లో రైతులకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన రైతుల్ని కేసీఆర్ నట్టేట ముంచారని విమర్శించారు. అతివృష్టి , అనావృష్టికి తోడు గిట్టుబాటు ధరలు లేకనే రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి రైతులకు అండగా నిలవాల్సింది పోయి కొద్దిపాటి రైతులకు రుణ మాపీ చేస్తామనడం భావ్యం కాదన్నారు. ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేరుమీద ఉన్న రుణాలన్నీ మాపీ చేసిందని గుర్తు చేశారు. రైతులను మోసం చేసిన వారికి గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ పునరాలోచన చేసి రైతులందరికీ రుణ మాపీ చేయాలని డిమాండు చేశారు. లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. మండలాభివృద్ధికి కృషి.. తనను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించిన మండల ప్రజలకు, అధికారులకు కాలె యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు. మండలాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బదిలీపై వెళుతున్న ఎంపీడీ వో కోదండపాణిని ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు ఫలికారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అనంత్‌రెడ్డి, డీఈలు అంజిరెడ్డి, హంసారాం, ఈవోఆర్డీ తరుణ్, సీనియర్ అసిస్టెంట్లు శేఖర్, జగన్నాథ్‌రెడ్డి, ఏపీవోలు లక్ష్మీదేవి, రఘు, సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, రాములు, గోపాల్, జంగయ్య, నర్సమ్మ, నాయకులు నాగిరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.