
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారు
‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
నవాబుపేట, న్యూస్‌లైన్: ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో కోదండపాణి ఆధ్వర్యంలో సిబ్బంది ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం వీఆర్‌వోలు, సాక్షరభారత్ సిబ్బంది, వివిధ గ్రామాలను చెందిన సర్పంచ్‌లు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
రూ.లక్షలోపు పంట రుణాలన్నీ మాపీ చేస్తామని ఎన్నికల్లో రైతులకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన రైతుల్ని కేసీఆర్ నట్టేట ముంచారని విమర్శించారు. అతివృష్టి , అనావృష్టికి తోడు గిట్టుబాటు ధరలు లేకనే రైతులు తీసుకున్న రుణాలు చెల్లించలేదన్నారు. అలాంటి రైతులకు అండగా నిలవాల్సింది పోయి కొద్దిపాటి రైతులకు రుణ మాపీ చేస్తామనడం భావ్యం కాదన్నారు. ఇది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పేరుమీద ఉన్న రుణాలన్నీ మాపీ చేసిందని గుర్తు చేశారు. రైతులను మోసం చేసిన వారికి గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ పునరాలోచన చేసి రైతులందరికీ రుణ మాపీ చేయాలని డిమాండు చేశారు. లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
మండలాభివృద్ధికి కృషి..
తనను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించిన మండల ప్రజలకు, అధికారులకు కాలె యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు. మండలాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బదిలీపై వెళుతున్న ఎంపీడీ వో కోదండపాణిని ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు ఫలికారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అనంత్‌రెడ్డి, డీఈలు అంజిరెడ్డి, హంసారాం, ఈవోఆర్‌డీ తరుణ్, సీనియర్ అసిస్టెంట్లు శేఖర్, జగన్నాథ్‌రెడ్డి, ఏపీవోలు లక్ష్మీదేవి, రఘు, సర్పంచ్‌లు తిరుపతిరెడ్డి, రాములు, గోపాల్, జంగయ్య, నర్సమ్మ, నాయకులు నాగిరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.