
రుణమాఫీపై మాటమార్చిన ప్రభుత్వం
వినాయక్‌నగర్,న్యూస్‌లైన్ : రైతులకు రుణమాఫీ చేస్తామని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ చేస్తానని పొందుపరిచి, అధికారంలోకి రాగానే రుణమాఫీ విషయంలో మాటతప్పి అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని విమర్శిం చారు.
ఆగమేఘాల మీద బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి 2013-14 సంవత్సరంలో తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. రైతుల రుణాలు మాఫీ అయ్యేంత వరకు బీజేపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున రైతులను తీసుకొని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాన్నారు.
మొత్తం రుణాలు మాఫీ చేసే వరకు పోరాడుతామన్నారు. ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని ఆయన కోరారు. సమావేశంలో నగర అధ్యక్షుడు గజం ఎల్లప్ప, బాణాల లక్ష్మారెడ్డి, న్యాలం రాజు, సుంకరి భాస్కర్‌రావు, నారాయణయాదవ్, దేవేందర్, చంద్రభూషన్, సర్పంచ్ గంగాధర్, రోషన్‌గోరా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.