
ఆదాయం పెరిగితేనే సాయం
పెన్షనర్లకు సీఎం స్పష్టీకరణ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిస్థాయిలో పెరగలేదని, ఆదాయం పెరిగితేనే పెన్షనర్లకు సహాయం చేసే వెసులుబాటు వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. 70 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పెన్షనర్లు ఇంట్లో కూర్చోకుండా రోజుకు నాలుగైదు గంటలు సమాజసేవ చేయాలని సూచించారు. దీంతో వారికి ఆరోగ్యం, మాససిక ఉల్లాసం లభిస్తాయని చెప్పారు. విజయవాడలోని ఎ–కన్వెన్షన్ హాలులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం 40వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.
ఎన్జీవోలతో పాటు పెన్షనర్లకు కూడా హెల్త్‌కార్డులు జారీ చేశామని, అయితే కార్పొరేట్ ఆస్పత్రులు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నందువల్ల వైద్యంలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా కష్టపడతారని, ఆ అసూయతో అమెరికాలో తెలుగువారిపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వారికి భద్రత కల్పించే విషయంలో అమెరికా ప్రభుత్వంపై కేంద్రం తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని సీఎం కోరారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొణకంచి సోమేశ్వరరావు మాట్లాడుతూ 70 ఏళ్లు దాటినవారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పీఆర్‌సీ సిఫారసు చేసినా అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.