రైతులకు క్రెడిట్, డెబిట్‌ కార్డులు | CM Jagan high level review on Rythu bharosa scheme | Sakshi
Sakshi News home page

రైతులకు క్రెడిట్, డెబిట్‌ కార్డులు

Published Tue, Apr 28 2020 3:42 AM | Last Updated on Tue, Apr 28 2020 10:31 AM

CM Jagan high level review on Rythu bharosa scheme - Sakshi

కియోస్క్‌ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రైతులకు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులు అందించడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ–పంట’తో అనుసంధానిస్తూ రైతుల క్రెడిట్‌ కార్డు ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారికి డెబిట్‌ కార్డు ద్వారా అందించాలని సూచించారు. ఈ ఖరీఫ్‌ నాటికి రాష్ట్రంలో రైతులకు 56 లక్షల క్రెడిట్‌ కార్డులు, 56 లక్షల డెబిట్‌ కార్డులను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న కియోస్క్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. కియోస్క్‌ రైతులకు విజ్ఞాన కేంద్రంలా పని చేస్తుందని అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 

రైతులకు మరింత మేలు
► క్రెడిట్, డెబిట్‌ కార్డు వల్ల రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. రైతులెవరికీ తమ డబ్బు చేతికి రాదనే భయం ఉండకూడదు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి కార్డు చూపగానే డబ్బులు రైతుల చేతికిచ్చేలా ఉండాలని సీఎం పేర్కొన్నారు.  
► ఈ క్రాప్‌కు లింక్‌ చేస్తూ క్రెడిట్‌ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు డెబిట్‌ కార్డు ద్వారా రైతులకు అందాలి. కొత్తగా క్రెడిట్‌ కార్డులు ఇవ్వడంతోపాటు కొత్త అకౌంట్లు ఓపెన్‌ చేయాలి.  

ఆర్బీకేలు సిద్ధం.. ప్రత్యేక యాప్‌ 
► రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు కానుండగా ఇప్పటికే 10,592 భవనాలను గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. జూన్‌ 1 కల్లా అన్నీ సిద్ధ్దమవుతాయన్నారు. వీటిపై రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. సేకరణ, మార్కెట్‌ ఇంటెలిజెన్స్, గ్రేడింగ్, ప్యాకింగ్‌ కూడా ఆర్‌బీకేకు లింక్‌ చేసేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.  
► ఆర్‌బీకే యాండ్రాయిడ్‌ యాప్‌ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. యాప్‌లో సర్వీసెస్‌ (కాల్‌సెంటర్‌) కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద పొలం బడి, పశు విజ్ఞాన బడి పేరుతో చేపట్టే కార్యక్రమాల గురించి కూడా అధికారులు వివరించారు.  

ఆక్వాకూ కాల్‌ సెంటర్‌ 
► ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆక్వా రైతులకు కూడా కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి చోటా ఆక్వా టెస్టింగ్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు.  

కిట్లు సిద్ధం కావాలి.. 
► విత్తనాల నాణ్యత, భూసార పరీక్ష కిట్లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విత్తనాలు మంచి నాణ్యతతో ఉండాలని, కాలపరిమితి ముగిసినవి ఎట్టి పరిస్ధితుల్లోనూ విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. నాణ్యమైనవి, సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రైతు నష్టపోకూడదని చెప్పారు నాణ్యత పరీక్ష విధానంపై అధికారుల నుంచి సీఎం వివరాలు సేకరించారు. తయారీదారుల వద్ద కూడా క్వాలిటీ టెస్టింగ్‌ జరగాలని సీఎం ఆదేశించారు. విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా విత్తనాల కంపెనీల నుంచి కొనుగోళ్లు జరగాలన్నారు. ప్రకృతి సేద్యంపై దృష్టి సారించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు.  
 
మెరుగ్గా మార్కెట్‌ యార్డులు 
► మార్కెట్‌ యార్డులను మరింత మెరుగ్గా వినియోగించుకోవడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జనతా బజార్లను మార్కెట్‌ యార్డ్‌లతో అనుసంధానించేలా చూడాలన్నారు.  
► సమావేశంలో వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement