ఉదారంగా సాయం.. | CM Jagan Mohan Reddy Begins Aerial Survey Of Kurnool | Sakshi
Sakshi News home page

ఉదారంగా సాయం..

Published Sun, Sep 22 2019 3:41 AM | Last Updated on Sun, Sep 22 2019 3:00 PM

CM Jagan Mohan Reddy Begins Aerial Survey Of Kurnool - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘వరదలతో కుందూ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు నష్టపోయారు. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పశు సంపదకు నష్టం వాటిల్లింది. బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలను, రైతులను ఆదుకునే విషయంలో నిబంధనలను చూడొద్దు. మానవతా దృక్పథంతో ఆలోచించి కాస్త ఉదారంగా పరిహారం అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌తో పాటు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులెవ్వరూ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, అందరి ముఖంలో చిరునవ్వులు చూడాలని చెప్పారు. కలెక్టరేట్‌లో ఒక సెల్‌ ఏర్పాటు చేసి.. ప్రజల ఇబ్బందులను విని, తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

నంద్యాల డివిజన్‌లో ఇటీవల సంభవించిన వరదలతో పలు ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి ఆకస్మికంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే (హెలికాఫ్టర్‌ ద్వారా) ద్వారా పరిశీలించారు. అనంతరం నంద్యాల మునిసిపల్‌ కార్యాలయానికి చేరుకుని వరద ప్రభావంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత వరద ప్రభావం గురించి నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలో డ్యాములన్నీ నిండాయి. పొలాలు కూడా తడవాలని దేవుడు దయతలిచాడు. అందుకే వర్షాలు సమృద్ధిగా కురిశాయి.

ఒక్క అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో సాధారణం కంటే 66 శాతం ఎక్కువగా వర్షం కురిసింది. ఇవన్నీ మంచి పరిణామాలు. అయితే ఎక్కువ వర్షపాతంతో 17 మండలాల్లో కాస్త నష్టం వాటిల్లింది. ఇందులో ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.421 కోట్ల నష్టం జరిగింది. పంచాయతీరాజ్‌లో రూ.103 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా వరదల వల్ల రూ.724 కోట్ల నష్టం వాటిల్లితే.. ఇందులో రోడ్లకు మాత్రమే రూ.524 కోట్ల నష్టం సంభవించింద’ని చెప్పారు.

మానవతా దృక్పథంతో వ్యవహరించండి
వరదలతో నష్టపోయిన రైతులు, సాధారణ ప్రజలకు సాయం చేసే విషయంలో గిరిగీసుకుని ఇంతే ఇస్తామనే ఆలోచన వద్దని ముఖ్యమంత్రి అన్నారు. ఆదుకోవడమే ధ్యేయంగా వ్యవహరించాలని చెప్పారు. ‘వరదల వల్ల ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీలలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. 33 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఈ రైతులందరికీ న్యాయం చేస్తామని చెబుతున్నా. బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవ్వండి. దెబ్బతిన్న ఇళ్లు, పశువులకు గాను రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో గతంతో పోలిస్తే 15 శాతం పెంచి ఇవ్వాలి. గతంలో లాగా వరద వచ్చినపుడు పట్టించుకోరనే మాట వినపడకూడదు. వైఖరి మారాలి. గతంలో 10 కేజీల బియ్యం ఇచ్చేవారు. ఇప్పుడు 25 కేజీలు ఇవ్వండని చెబుతున్నా. అలాగే గతంలో జరగని విధంగా ప్రతి ఇంటికీ రూ.2 వేలు అదనంగా ఇవ్వాలని చెబుతున్నా.

ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే ఉండి అన్ని శాఖలతో సమీక్ష నిర్వహిస్తారు. అందరికీ అవసరమయ్యే సహాయ సహకారాలు అందిస్తారు. ఆయనతో పాటు మరో మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఇక్కడే ఉంటారు. వర్షాలతో కాస్త కష్టం, నష్టం ఎదురైనా మంచి వర్షాలు కురిపించినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కుందూ నదికి వరద వస్తే పరివాహక గ్రామాలకు నష్టం వాటిల్లకుండా ప్రణాళిక రూపొందిస్తాం. నంద్యాల నియోజకవర్గంలోని చామకాలవ గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచించి రక్షణగోడ నిర్మించేందుకు రూ.వంద కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే శిల్పా రవి చెప్పారు. కొన్ని పనులు కూడా చేశారని చెప్పారు. ఈ పనులకు కూడా తిరిగి అంచనాలు రూపొందించి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు.

‘సీమ’ ఎడారి కాకూడదనేదే లక్ష్యం
రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను నింపేందుకు ప్రస్తుతం 90 నుంచి 120 రోజుల పాటు నీళ్లు తీసుకోవాలంటే కష్టమవుతోందని సీఎం అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉండటం లేదని, లభ్యత చాలా తక్కువగా (ఈ ఏడాది కాదు) ఉందని చెప్పారు. ‘గత 40 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కలు పరిశీలిస్తే ఏడాదికి 1,200 టీఎంసీలు వస్తున్నాయని తెలిసింది. కానీ గత పదేళ్ల లెక్కలు తీస్తే అవి కాస్తా 600 టీఎంసీలకే పడిపోయాయి. గత ఐదేళ్లలో చూస్తే 400 టీఎంసీలకే పడిపోయాయని తేలింది. దేవుడి దయతో ఈ ఏడాది ఇబ్బంది లేదు. మామూలుగా రాయలసీమలోని డ్యామ్‌లు, రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపుకోవాలంటే గతంలో లాగా 90 నుంచి 120 రోజుల పాటు నీటిని తెచ్చుకోవాలంటే కుదరదు.

కేవలం 40 – 45 రోజుల్లోనే నింపుకునే పరిస్థితి రావాలి. అందుకే రిజర్వాయర్లకు వెళ్లే ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే ‘సీమ’లోని అన్ని డ్యామ్‌లు, రిజర్వాయర్లు నిండుతాయి. ఆ విధంగా ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

►కలెక్టరేట్‌లో ఒక సెల్‌ ఏర్పాటు చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా.. ఏ అధికారైనా పట్టించుకోకపోయినా ఈ సెల్‌ దృష్టికి తీసుకెళ్లండి. వెంటనే స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తారు. అధికారులంతా కాస్త ఉదారంగా వ్యవహరించండి. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. అందరి ముఖంలో చిరునవ్వు చూడాలి.

►శ్రీశైలం డ్యామ్‌కు 40 ఏళ్ల కిందట 1,200 టీఎంసీలు వస్తే.. గత ఐదేళ్లలో 400 టీఎంసీలకు తగ్గిపోయిన పరిస్థితి. మరోవైపు కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు. అది పూర్తయితే మరో వంద టీఎంసీలు తగ్గిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కృష్ణా ఆయకట్టును బతికించుకోవడానికి, రాయలసీమ ఎడారి కాకుండా రక్షించుకోవడానికి చాలా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రితోనూ చర్చించాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement