ఓటింగ్ పెట్టాలనే సీఎం నోటీసిచ్చారు: బొత్స
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలనేదే సీఎం కిరణ్ ఇచ్చిన తిరస్కార నోటీసు సారాంశమని ఆయన వెల్లడించారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన విభజన బిల్లు తిరస్కార నోటీసును అనుమతించొద్దని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమను సంప్రదించకుండా కిరణ్ నోటీసు ఇచ్చారని, అలాంటప్పుడు అది ప్రభుత్వ నోటీసు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం ఇచ్చిన నోటీసును ఆమోదించాలని సీమాంధ్ర ప్రతినిధులు కోరుతున్నారు. సీఎం అన్నివిధాలా ఆలోచించే తిరస్కార నోటీసుయిచ్చారని వెనకేసుకొస్తున్నారు.