నేనేంటో అసెంబ్లీలో చూపిస్తా: సీఎం కిరణ్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టమైన అభిప్రాయాలు తెలపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. అసెంబ్లీ నిర్ణయంపైనే రాష్ట్రపతిగానీ, కేంద్రం గానీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అభిప్రాయం చెప్పకుండా బిల్లు పంపిస్తే వ్యతిరేక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాబట్టి బిల్లుపై ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో స్పష్టం చేయాల్సిన అవసరముందన్నారు.
తన క్యాంపు కార్యాలయంలో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లుపై చర్చ ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పొచ్చని అన్నారు. బిల్లుపై చర్చ జరగకపోతే విభజనను అంగీకరించినట్టేనని చెప్పారు. అసెంబ్లీ భిన్నాభిప్రాయాలు తెలిపిన తర్వాత దేశంలో ఎక్కడా రాష్ట్రాల విభజన జరగలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకే బిల్లును కేంద్రం ఇక్కడకు పంపించిందని వెల్లడించారు.
తన రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచించడం లేదని సీఎం కిరణ్ అన్నారు. సమైక్యవాదం తమ నినాదం కాదు, తమ విధానమన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి రావాలని మిగతా పార్టీలను కోరారు. సీఎంగా తన అధికారాలెంటో తనకు తెలుసునని అన్నారు. బిల్లుపై తానేం చేస్తానో అసెంబ్లీలో చూస్తారని అంటూ ముక్తాయించారు.