విభజన కుట్రకు సాక్షులం కాలేం | We can not be Witness to Division conspiracy, says YS Vijayamma | Sakshi
Sakshi News home page

విభజన కుట్రకు సాక్షులం కాలేం

Published Sat, Jan 18 2014 1:15 AM | Last Updated on Sat, Jun 2 2018 2:30 PM

అసెంబ్లీలో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ - Sakshi

అసెంబ్లీలో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ

* అసెంబ్లీలో విజయమ్మ స్పష్టీకరణ
* సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్
 
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రమనే నినాదం ముసుగులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న విభజన కుట్రలో తాము ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనలేమని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టంచేశారు. ‘‘విభజన బిల్లుకు సభ అనుకూలమా? వ్యతిరేకమా? అని నిగ్గు తేల్చే విధంగా శాసనసభలో ఓటింగ్ పెట్టాలి. కానీ మేం ఎన్ని విధాలుగా అడిగినా సమాధానాలు లభించనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’’ అని ఆమె ప్రకటించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సమైక్య నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

శుక్రవారం ఉదయం 9 గంటలు సభ ప్రారంభమైన వెంటనే.. బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుపడుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడింది. రెండోసారి 10.30 గంటలకు మొదలయినప్పుడు కూడా సభలో ఇదే దృశ్యం పునరావృతమైంది. వైఎస్సార్ సీపీ సభాపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ మనోహర్ చెప్పడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాంతించి తమ స్థానాల్లో కూర్చున్నారు. నిరసన వ్యక్తం చేయడానికి విజయమ్మకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...

* ఎన్నిసార్లు సీఎంకు విన్నవించినా, బీఏసీలో మా పార్టీ విధానం చెప్పినా.. దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ ముందుకు సాగుతోంది. బిల్లు ఉద్దేశాలు, కారణాలు చెప్పకుండా, ఆర్థికపరమైన సమాచారం ఇవ్వకుండా బిల్లును సభకు పంపించారు.
* విభజన బిల్లును తిరస్కరించడానికి సభలో ఓటింగ్ నిర్వహిస్తారా? నిర్వహించరా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలి. సభానేతగా ముఖ్యమంత్రి అయినా స్పష్టత ఇవ్వాలి.

ఓటింగ్ ఉంటే ఎలా ఉంటుంది? క్లాజుల వారీ లేదా షెడ్యూళ్ల వారిగానో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి.
ఎలాంటి స్పష్టత లేకుండా బిల్లు మీద ఎందుకు చర్చ జరగాలి? ఈ విషయాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంది?

‘విభజన వద్దు. అడ్డుకుందాం...’ అనేది మా పార్టీ విధానం. ఈమేరకు అఫిడవిట్ల రూపంలో రాష్ట్రపతికి చెప్పాం. 164 నిబంధన కింద మా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పిటిషన్ల రూపంలో సమర్పించాం. బిల్లులోని అన్ని క్లాజులను తొలగించాలని సవరణ ప్రతిపాదనలు ఇచ్చాం.

* విభజన ఎలా జరగాలన్న చర్చలో భాగస్వాములం కాదల్చుకోలేదు.
* సమైక్యం ముసుగులో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి చేస్తున్న విభజన కుట్రలో ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనబోం. అదే సమయంలో.. రాష్ట్రపతి అడిగిన మేరకు మా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం.

* రాష్ట్ర విభజన 10 కోట్ల మందికి సంబంధించిన అంశం. కాంగ్రెస్ ఇంటి విధానం కాదు. వారి (కాంగ్రెస్) స్వార్థం కోసం తెలుగుజాతిని బలిపెట్టద్దని కోరుతున్నాను.

* సమైక్యంలోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. 1972లో ఇందిరాగాంధీ కూడా చెప్పారు. 60 సంవత్సరాలుగా కలిసున్న రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలి? 2,700 సంవత్సరాలు కలిసున్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలి? బ్రిటిష్, నిజాం కాలంలో విడిపోవాలనుకోలేదు. ఇప్పుడెందుకు విడిపోవాలి?

* విభజనకు శాసనసభ అనుకూలమా?వ్యతిరేకమా? అని చెప్పడానికి ఓటింగ్ నిర్వహించాలి. మా అభిప్రాయం చెప్పమన్నప్పుడు మా ఎమ్మెల్యేలు వచ్చి చెప్తారు. సమైక్యం మా విధానం, నినాదం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement