23 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జనవరి 23 వరకు వేచి చూద్దామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంత నేతలకు చెప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిద్దామని, బిల్లుపై చర్చలో సీవూంధ్ర ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తే కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయులేదని వారికి నచ్చజెప్పారు. చర్చ ముగిసిన తర్వాత బిల్లు రాష్ట్రపతికి, అక్కడి నుంచి కేంద్రానికి, పార్లమెంటుకు చేరుతుందని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని గురువారం తనను కలసిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సీఎం అన్నారు.
మాజీ మంత్రులు జేసీ, పాలడుగు, ఎమ్మెల్యే విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ శివరావుకృష్ణారావు తదితర నేతలు సచివాలయంలో సీఎంను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా విభజన బిల్లు ప్రస్తావనకొచ్చింది. సీమాంధ్ర నేతలంతా చర్చలో పాల్గొనడమే కాకుండా బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పాలని సీఎం సూచించారు. అసెంబ్లీలో ఓటింగ్‌కు తెలంగాణ నేతలు అంగీకరించకపోవచ్చని, అటువంటి అవకాశం ఉండకపోతే పరిస్థితి ఏమిటని సీనియర్ నేతలు సీఎంను అడిగారు. ఏ బిల్లుపైనైనా ఓటింగ్‌కు మెజార్టీ సభ్యులు పట్టుబడితే సభాపతి చేపట్టక తప్పకపోవచ్చని సీఎం పేర్కొన్నారు.
బిల్లుపై కనుక ఓటింగ్‌కు అవకాశం లేదని తేలితే అప్పుడు విభజన వ్యతిరేక తీర్మానాన్ని ప్రతిపాదిద్దామని సీఎం చెప్పినట్టు నేతలు వివరించారు. సభలో పునర్వ్యవస్థీకరణ బిల్లును ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తారో, లేదో? చర్చ సందర్భంగా గైర్హాజరవుతారో అని నేతలు సంశయుం వ్యక్తంచేయగా అలాంటి పరిస్థితి ఉండదని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.