కిరణ్ ప్రసంగాన్ని అడ్డుకున్న టీ-ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో బుధవారం సాయంత్రం గందరగోళం రేగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. విభజన బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని సీఎం ప్రకటింగానే సభలో గందరగోళం మొదలయింది. చరిత్రను వక్రీకరిస్తూన్నారని ఆరోపిస్తూ సీఎం ప్రసంగానికి టీ-ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే సభా నాయకుడి హోదాలో బిల్లును వ్యతిరేకిస్తున్నా లేక వ్యక్తిగతంగా చెప్పారా అనేది స్పష్టం చేయాలని జానారెడ్డి కోరారు. మరోవైపు టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం సమంజసం కాదంటూ స్పీకర్ నాదండ్ల మనోహర్ నచ్చచెప్పినా వారు పట్టువీడలేదు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. జానారెడ్డి మరోసారి కలుగ జేసుకోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. తర్వాత సీఎం ప్రసంగం కొనసాగించారు.