అన్నీ పీలేరుకే..!
Published Wed, Oct 30 2013 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
సాక్షి, చిత్తూరు : తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేయగా, ఇప్పుడు మూడేళ్లుగా సీఎం కుర్చీలో కూర్చున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అదేబాట పట్టారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో నిధులన్నీ పీలేరు నియోజకవర్గానికే తరలిస్తూ జిల్లా అభివృద్ధిని పట్టించుకోవటం లేదు. జిల్లాలో పీలేరు నియోజకవర్గానికి తప్ప మిగిలిన వాటికి నిధులు రావడం లేదు. చాలా చోట్ల మంజూరైన పనులు కూడా నిధుల కొరతతో పెండింగ్ పడుతున్నాయి. కేవలం బీఆర్‌జీఎఫ్ నిధులు, ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులను చిన్న, చిన్న పనులకు వెచ్చిస్తున్నా రు. మరో ఆరు నెలల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అధికారం చివరి దశలో ఉన్న సీఎం పీలేరు నియోజకవర్గానికి అవకాశం ఉన్నంత మేర నిధులు కుమ్మరించి అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నారు.
రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, నీటిసరఫరా, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరిట ఇప్పటికే దాదాపు రూ.200 కోట్లకు పైగా నిధులు ఒక్క పీలేరు నియోజకవర్గంలోనే వెచ్చించారు. ఇటీవలే 126 పంచాయతీ రాజ్ రోడ్లను ఆర్‌అండ్‌బీ రోడ్లుగా మారుస్తూ రూ.88 కోట్లు మంజూరు చేశా రు. అలాగే రూ.90 కోట్లు ఖర్చు చేసి కలికిరి, కలకడ, కేవీపల్లె మండలాలకు నీటి వసతి కల్పించే ఝరికోన తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేశారు. కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ రోడ్ల నిర్మాణానికి మరో రూ.50 కోట్ల వరకు నిధులు వ్యయం చేశా రు. ఇండస్ట్రియల్ పార్కుకోసం రూ.100 కోట్లకు పైగా నిధులు వ్యయం చేసి 12,000 ఎకరాల భూములు కలికిరి-వాల్మీకిపురం మధ్యలో సేకరించారు. ఇక్కడే ఐటీఆర్‌పార్కు(ఐటీ జోన్) ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కలకడ, కలికిరి, వాల్మీకిపురంలో మూడు ఏరియా ఆస్పత్రులు(100 పడకలు) నిర్మాణం ఎంత వరకు వచ్చింది ఏమిటనేది వివరాలు పంపమని ఇటీవలే సీఎం పేషీ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి.
జిల్లాకు నిధులు గుండు సున్నా
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చాలా అభివృద్ధి పనులు నిధులు లేక మూలనపడ్డాయి. ప్రధానంగా వందలాది గ్రామీణ, జిల్లా రహదారులు వర్షాలకు దెబ్బతిని దారుణంగా ఉన్నాయి. రెండు సంవత్సరాలుగా వీటి మరమ్మతులకు గానీ, పునర్ నిర్మాణానికి గానీ నిధుల కేటాయింపులేదు. చిత్తూరు-తిరుపతి మధ్య మూడు రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరు లేదు. కేవలం నేనషనల్ ైెహ వేస్ (కేంద్ర ప్రభుత్వ రహదారుల) శాఖ నిధులతో మాత్రమే అంతర్రాష్ట్ర రహదారుల అభివృద్ధి జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా తాగునీటి కొరత ఉంది. దీనిని నివారించేందుకు ఇంతవరకు చర్యలు లేకపోగా, రూ.5,900 కోట్లతో కండలేరు జలాల పేరిట పథకం ప్రకటించారు. దీనికి రెండవ దశకు మరో రూ.1400 కోట్లు కావాలి. ఈ పథకం ఇంకా టెండర్ల దశలోనే ఉంది. ఎన్నికల్లోపు ఈ పథకం పూర్తి కాదు.
కేవలం ఎన్నికల ప్రచారానికి దీనిని ఉపయోగించుకోవడం కోసం అధికారుల ద్వారా హడావుడి చేయిస్తున్నారు. అదే సమయంలో జిల్లాకు సాగునీరు అందించే గాలేరు-నగరి, హంద్రీ- నీవా ప్రాజెక్టులు చాలా చోట్ల భూసేకరణ స్థాయిలోనే ఉన్నాయి. వీటికి నిధులు విడుదల చేయటంతో పాటు భూసేకరణలో రైతులకు తగిన నష్టపరిహారం ఇప్పించటంలోనూ సీఎం దృష్టి సారించలేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు వైద్యులు, మందుల కొరతతో అల్లాడుతున్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి, తిరుపతి రూయా ఆస్పత్రిలోనూ మందుల కొరత పీడిస్తోంది.
జిల్లావ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాల్లో ఇళ్లకోసం, సాగు భూమికోసం, రేషన్‌కార్డులు, పింఛన్‌ల మంజూరు కోరుతూ పేదలు వేల సంఖ్యలో అర్జీలు సమర్పించారు. వీటి ల్లో చాలా వరకు బుట్టదాఖలు కాగా, మిగిలినవి మండల పరిషత్ కార్యాలయాల్లో అటకెక్కాయి. ముఖ్యంగా కొత్త పింఛన్‌ల మంజూరుకు నిధులు మం జూరు కావటం లేదు. దీంతో అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న వృద్ధులు తమకు పింఛన్ మంజూరు అవుతుందో లేదో తెలియక ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ని సమస్యలు జిల్లాలో ఉన్నప్పటికీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తన సొంత నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేయడానికి వందల కోట్లు కుమ్మరించడం విమర్శలకు దారితీస్తోంది.
Advertisement
Advertisement