పోలవరం శరవేగం | CM YS Jagan Action Plan On Polavaram Project Works is designed to be complete within the deadline | Sakshi
Sakshi News home page

పోలవరం శరవేగం

Published Thu, Jun 25 2020 3:06 AM | Last Updated on Thu, Jun 25 2020 12:39 PM

CM YS Jagan Action Plan On Polavaram Project Works is designed to be complete within the deadline - Sakshi

అది పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు చకచకా సాగిపోతున్నాయి. పనులు పర్యవేక్షిస్తున్న ఎస్‌ఈ నాగిరెడ్డిని ‘సాక్షి’ ప్రతినిధి పలకరించారు. స్పిల్‌ వేలో రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల చొప్పున కాంక్రీట్‌ పనులు చేస్తున్నామని, మే, 2021 నాటికి 48 గేట్లను బిగించి, స్పిల్‌వేను పూర్తి చేస్తామని చెప్పారు. ‘వరదలు తగ్గాగానే.. నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీని భర్తీ చేసి.. నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను జూలై, 2021 నాటికి పూర్తి చేస్తాం. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించి.. 2021, డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తాం’ అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, పకడ్బందీ ప్రణాళిక, అకుంఠిత దీక్షకు పోలవరం ప్రాజెక్టు పనులు అద్దం పడుతున్నాయి. దశాబ్దాల స్వప్నం శరవేగంగా చేరువవుతోంది. ఇంజనీరింగ్‌ అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఉరకలెత్తే గోదారమ్మకు బ్రేకులేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. 

ఎలాంటి హడావుడి లేకుండా, ప్రచారార్భాటాలకు దూరంగా.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులు చకచకా సాగుతున్నాయి. కరోనా భయపెడుతున్న వేళ సైతం కట్టుదిట్టమైన చర్యలతో రికార్డు స్థాయిలో పనులు పరుగులు పెడుతున్నాయి.

(రామగోపాలరెడ్డి ఆలమూరు) 
పోలవరం ప్రాజెక్టు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి 

గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట వద్ద ప్రాజెక్టును నిర్మించాలనే ప్రతిపాదన 1941లో బ్రిటీష్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలుగు నేల సుభిక్షమవుతుందని రాష్ట్ర ప్రజలు కలలుగన్నారు. కానీ.. ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే దిశగా 2004 వరకూ ఏ ముఖ్యమంత్రీ సాహసించలేదు. 2004లో దివంగత సీఎం వైఎస్సార్‌ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. కానీ.. వైఎస్సార్‌ హఠాన్మరణంతో పోలవరం పనులు మందగించాయి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని గత ప్రభుత్వం అందిపుచ్చుకుని, ప్రాజెక్టును పూర్తి చేసి.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో విఫలమైంది. కమీషన్ల కోసం జీవధార పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది. జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖాజనాకు రూ.838.51 కోట్లను ఆదా చేశారు.
టీడీపీ సర్కారు ఐదేళ్లలో రోజుకు సగటున 131.59 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించినప్పటి నుంచి రోజుకు సగటున 3,000 క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తోంది. 

ప్రణాళికాయుతంగా పనులు
► టీడీపీ సర్కార్‌ ప్రణాళిక లోపం.. అవగాహన రాహిత్యం, చిత్తశుద్ధి లేమి పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారాయి. పనులు గందరగోళంగా మారాయి. ఈ పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టును డిసెంబర్, 2021లోగా పూర్తి చేయడానికి సీఎం  జగన్‌ కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్‌ ప్లాన్‌) రచించారు. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. ఈ ప్రణాళిక అమలును సీఎం జగన్, మంత్రి అనిల్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండటం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిజైన్లకు సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) నుంచి ఆమోదం తెచ్చారు. దాంతో పనులు చేపట్టడానికి మార్గం సుగమమైంది.

కరోనా కోరలు చాస్తున్నా నిర్విఘ్నంగా పనులు 
► గత సీజన్‌లో వరదలు తగ్గాక.. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ మధ్యలో నిలిచిన నీటిని డీవాటరింగ్‌ చేసి నవంబర్‌లో పనులు ప్రారంభించారు.
► కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం లాక్‌ డౌన్‌ విధించింది. దాంతో కార్మికులు బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వారి ఊళ్లకు వెళ్లారు. సొంతూళ్లకు చేరుకున్న రెండు వేల మందికిపైగా కార్మికుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టు సంస్థ మేఘా (మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌) భరోసా కల్పించి.. ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ స్పిల్‌ వేలో వెయ్యి క్యూబిక్‌ మీటర్లు.. స్పిల్‌ చానల్‌లో రెండు వేల క్యూబిక్‌ మీటర్ల పరిమాణంలో కాంక్రీట్‌ పనులు రోజూ చేస్తున్నారు. బుధవారం వరకూ 2.77 లక్షల క్యూబిక్‌ మీటర్ల (స్పిల్‌ వేలో 1.29, స్పిల్‌ చానల్‌లో 0.98 లక్షల) పనులు చేశారు. స్పిల్‌ వేలో 2.62 లక్షలు, స్పిల్‌ చానల్‌లో 6.98 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేస్తే స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పూర్తవుతాయి. ఈ పనులు 2021 మే నాటికి పూర్తవుతాయి.
► గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టగానే ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన 35.82 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను నవంబర్‌లో ప్రారంభించి.. 2021 జూలై నాటికి పూర్తి చేసేలా చేపడతారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో మిగిలిన 22.09 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను 2021 జూలై నాటికి పూర్తి చేస్తారు. గోదావరి డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా నవంబర్‌ నుంచే మళ్లిస్తారు. 
► ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ప్రధాన డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ పనులను ప్రారంభించి.. 117.69 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తారు. ఆలోగా కాలువలకు జలాశయంతో అనుసంధానం చేసే పనుల (కనెక్టివిటీస్‌)ను పూర్తి చేసి.. 2022 జూన్‌లో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించింది.

ఇది మీకు తెలుసా? 
ప్రస్తుతం ప్రపంచంలో గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను విడుదల చేసే సామర్థ్యంతో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను చైనా నిర్మించింది. రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రాగన్‌’ను తలదన్నేలా అత్యధికంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను నిర్మిస్తోంది. గోదావరి నదికి అడ్డంగా మూడు కొండల మధ్యన ఇసుక తిన్నెలపై 2,454 మీటర్ల పొడవున ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ ఇదే.

పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీపై కుడి, ఎడమ కాలువల కింద 7.2 లక్షల ఎకరాలు.. గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు వెరసి 38.70 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. ప్రపంచంలో గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది.


వరదలు వచ్చినా పనులు కొనసాగించేలా ప్రణాళిక
► గోదావరి నదికి ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తేనే స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు వరద జలాలు చేరుతాయి. జూలై ఆఖరుకు ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ పనులను కొనసాగించనున్నారు. 
► స్పిల్‌ వే పియర్స్‌ 52 మీటర్లకు పూర్తి చేసి.. వాటికి గడ్డర్లు బిగించి.. వాటిపై స్పిల్‌ వే బ్రిడ్జి స్లాబ్‌ను వేసే పనులు చేపట్టి.. నవంబర్‌ నాటికి వాటిని పూర్తి చేస్తారు. నవంబర్‌ తర్వాత స్పిల్‌ వే బ్రిడ్జి మీదుగా వెళ్లి ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1, గ్యాప్‌–3 పనులు చేపడతారు. నవంబర్‌లో డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభించి.. 2021 డిసెంబర్‌కు పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు.

నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి 
► టీడీపీ సర్కార్‌ నిర్వాకం వల్ల గతేడాది 41.15 మీటర్ల కాంటూర్‌కు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలూ.. వరద ముప్పును ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూలై నాటికి 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 15,444 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సర్కార్‌ నిర్ణయించింది.
► పునరావాసం కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. 45.72 మీటర్ల పరిధిలో కాంటూర్‌ 82 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. సహాయ, పునరావాసం పనులకే రూ.30 వేల కోట్లకుపైగా సర్కార్‌ వ్యయం చేస్తోంది. 

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నాం 
– మంత్రి అనిల్‌
పోలవరం ప్రాజెక్టుకు మహానేత వైఎస్సార్‌ నడుం బిగించారు. విభజన నేపథ్యంలో వంద శాతం ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. టీడీపీ సర్కార్‌ కమీషన్‌ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంది.  జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరం పనుల్లో రూ.838.51 కోట్లు ఆదా చేశాం. 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించి, ఆ దిశగా చర్యలు చేపట్టాం. 2022 జూన్‌ నాటికి ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా వైఎస్సార్‌ ప్రారంభించిన పోలవరాన్ని ఆయన తనయుడు సీఎం  జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

పొక్లెయిన్‌తో టన్నుల కొద్దీ మట్టిని తవ్వి.. టిప్పర్లలోకి పొసి.. తరలిస్తున్నారు. మరో వైపు ఇసుక, కంకర పోస్తూ రోలర్‌తో తొక్కించి.. గట్టిపరిచి.. వాటిపై రెడీ మిక్సర్లతో తెచ్చిన కాంక్రీట్‌ను పోసి.. స్పిల్‌ వేలో బ్లాక్‌లు వేస్తున్నారు. ఒక్కో బ్లాక్‌లో వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేస్తామని.. రోజుకు 20 బ్లాక్‌ల పనులు చేస్తున్నామని స్పిల్‌ చానల్‌ పనులు పర్యవేక్షిస్తున్న డీఈ శ్రీనివాసరావు చెప్పారు. స్పిల్‌ చానల్‌ను మార్చి, 2021 నాటికి పూర్తి చేస్తామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement