మా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలే పెద్దవి | CM YS Jagan Comments In YSR Matsyakara Bharosa Program | Sakshi
Sakshi News home page

మా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలే పెద్దవి

Published Thu, May 7 2020 3:08 AM | Last Updated on Thu, May 7 2020 3:13 AM

CM YS Jagan Comments In YSR Matsyakara Bharosa Program - Sakshi

బుధవారం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ తదితరులు

ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు కానుంది. మూడేళ్లలో ఈ తొమ్మిదింటి నిర్మాణం పూర్తి చేసి.. ఎన్నికలకు వెళ్తాం. మొన్న పాకిస్థాన్‌ నుంచి, నిన్న గుజరాత్‌ నుంచి చిక్కుకుపోయిన వారిని రప్పించాం. మత్స్యకారులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలు శాశ్వత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనాతో పోరాడుతున్న సమయంలో మా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలే పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 1,09,231 మత్స్యకార కుటుంబాలకు పది వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార సోదరులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

దాదాపు 6 నెలల ముందుగానే..
కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. మనకున్న కష్టాలకన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నాం. 
► గతంలో చేపల వేట నిషేధ సమయంలో చాలీచాలని విధంగా రూ.4 వేలు ఇచ్చేవారు. అది కూడా అందరికీ ఇచ్చే వారు కాదు. ప్రతి మత్స్యకారుడిలో వెలుగులు కనిపించని పరిస్థితి ఉండేది. వారి బతుకులు మారాలని ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. 
► గతేడాది మే 30న అధికారంలోకి వచ్చాం. అప్పటికే  వేట నిషేధ సమయం ముగియడంతో ఆర్థిక సహాయం చేయకపోయినా పర్వాలేదన్న సలహాలు వచ్చాయి. అయినా గతేడాది నవంబర్‌లో మత్స్యకార దినోత్సవం రోజున ‘మత్స్యకార భరోసా’కు శ్రీకారం చుట్టాం. ముమ్మడివరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. 
తమ ఖాతాల్లో రూ.10,000 జమ అయ్యాయంటూ ఫోన్లలో వచ్చిన మెసేజ్‌లు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రకాశం జిల్లా కొత్తపట్నం మత్స్యకారులు 

ఆ డబ్బు ఇప్పటికీ ప్రభుత్వానికి రాలేదు 
► అప్పట్లో నేను అదే (ముమ్మడివరం) నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మత్స్యకారులు వారి బాధలు చెప్పుకున్నారు. గతంలో జీఎస్‌పీసీ డ్రిల్లింగ్‌ వల్ల 13 నెలలు ఉపాధి లేక నష్టపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదని చెప్పారు. వారికిచ్చిన మాట ప్రకారం గత నవంబర్‌లో రూ.70.53 కోట్లు వారికి పరిహారం చెల్లించాం. ఇప్పటికీ ఆ డబ్బు రాలేదు. 
► ఆ డబ్బు కోసం ఎదురు చూడకుండా ఈలోగా మనం చేయాల్సిన మేలు చేశాం. మత్స్యకారులకు మంచి జరగాలన్న ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం.

మొన్న పాకిస్తాన్, నిన్న గుజరాత్‌ నుంచి రప్పించాం
► పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించారని, మన వాళ్లను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో నాకు చెప్పారు. మనం అధికారంలోకి వచ్చాక మన ఎంపీ లతో ఒత్తిడి తీసుకువచ్చి వారిని విడుదల చేయించాం.
► వారు జీవనం కొనసాగించడానికి వీలుగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాం. ఇలా ప్రతి విషయంలో కూడా మత్స్యకారులకు మంచి చేయడానికి ప్రయత్నాలు చేశాం.
► మొన్న కరోనా కారణంగా గుజరాత్‌లో 4,500 మందికి పైగా మత్స్యకారులు చిక్కుకుపోతే, వారి ఇబ్బందులు తెలిసిన వెంటనే స్పందించాం. వారికి తోడుగా ఉండడానికి గుజరాత్‌ సీఎం, కేంద్ర మంత్రులతో మాట్లాడి.. రూ.3 కోట్ల మేర ఖర్చు చేసి, వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చాం. వారందరికీ పరీక్షలు చేసి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశాం.  
► ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటపై ఉండే నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ ఇచ్చే వారు కాదు. ఇచ్చినా అరకొరగా ఇచ్చే వారు. అది కూడా అందరికీ ఇచ్చే వారు కాదు. కరోనా కష్టాలు ఉన్నా కూడా, 
ఇవాళ మనం 1,09,231 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నాం.

డీజిల్‌ సబ్సిడీ
► డీజిల్‌ సబ్సిడీ ఎప్పు డు వస్తుందో తెలియ దని మత్స్యకారులు నా పాద యాత్రలో చెప్పారు. దీంతో డీజిల్‌ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచాం. డీజిల్‌ పట్టుకున్నప్పుడే సబ్సిడీ వచ్చేలా చేశాం.
► మెకనైజ్డ్‌ బోట్‌కు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్‌ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నాం.
► మత్స్యకారుడు వేటకు వెళ్లినప్పుడు జరగరానిది జరిగితే ఇచ్చే పరిహారం రూ.5 లక్షలు సరిపోదని.. రూ.10 లక్షలు ఇస్తున్నాం. దేవుడి దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం.

శాశ్వత చర్యలు
► మత్స్యకారుల జీవితాల్లో శాశ్వతంగా మార్పు రావాలని, గుజరాత్‌ లాంటి ప్రాంతాలకు వలస పోకూడదని.. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మంత్రి మోపిదేవి ఎంతో కృషి చేసి పలు నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 8 మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్లు కట్టబోతున్నాం.
► గుజరాత్‌కు వలస పోవడమన్నది దశాబ్దాలుగా జరుగుతోంది. ఇకపై మత్స్యకారుల జీవితంలో మార్పు రావాలని, శాశ్వతంగా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. 
► గత ప్రభుత్వంలో మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల కోసం కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
► ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, మత్స్యకారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

గంగమ్మ తల్లి తర్వాత మీరే.. 
గత ప్రభుత్వ హయాంలో వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బు అరకొరగా కొందరికే ఇచ్చే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. వైఎస్సార్‌ దూరం అయ్యాక మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ప్రభుత్వం పూర్తిగా మత్స్యకారులను మరిచిపోయింది. ఇప్పుడు అందరికీ సంతృప్తికర స్థాయిలో అన్నీ వస్తున్నాయి. గంగమ్మతల్లి తర్వాత మీరే మాకు దేవుడిలా నిల్చారు.    
– ధనరాజ్, నెల్లూరు జిల్లా 

ఈ రీతిలో ఎవరూ మమ్మల్ని ఆదుకోలేదు
మాకు గతంలో ఎప్పుడూ సరైన సమయానికి సహాయం అందలేదు. మీరు వచ్చాక పార్టీ అని చూడకుండా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. నేను 1977 నాటి తుపాన్‌ను చూశాను. అప్పటి నుంచి చేపల వేటపైనే ఆధారపడ్డాను. ఏనాడూ ఏ ప్రభుత్వం కూడా ఈ రీతిలో మమ్మల్ని ఆదుకోలేదు. రాజకీయంగా కూడా మా వాళ్లకు గుర్తింపునిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియంను కచ్చితంగా అమలు చేయండి.  
– బలగం వీరరాఘవయ్య, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement