విశాఖపట్నం: ‘విష వాయువు ప్రభావిత గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు.. వారి సంక్షేమం, ఆరోగ్యం విషయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడండి’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ బాధితుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్యాస్ ప్రభావానికి గురైన గ్రామాల్లో పరిస్థితులు, బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో స్టైరీన్ గ్యాస్ తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ గ్యాస్ పీడిత బాధితులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించామని చెప్పారు.
గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు అందించడానికి గ్రామస్తుల ఎన్యుమరేషన్ ప్రస్తుతం జరుగుతోందని, ఇది శనివారం సాయంత్రానికి పూర్తవుతుందని తెలిపారు. ఆ జాబితాలను వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించి సోమవారం నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 18 నాటికి ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అదే రోజు ఉదయం వలంటీర్లు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి లేఖలు అందించే ఏర్పాట్లు చేయాలని, అదే రోజు లబ్ధిదారుల అకౌంట్లలో పరిహారం జమ చేయాలని స్పష్టం చేశారు.
గ్యాస్ తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి
ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి కారణమైన స్టైరీన్ గ్యాస్‌ను పూర్తిగా అక్కడ నుంచి తరలించాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ వినయ్‌చంద్ జిల్లాలో ఉన్న 13 వేల టన్నుల స్టైరీన్‌ను రెండు ఓడల ద్వారా దక్షిణ కొరియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 8 వేల టన్నుల స్టైరీన్‌ను ఒక ఓడలోకి పంప్ చేయించారు. తాజాగా సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో స్టైరీన్ తరలింపు విషయాన్ని మరోసారి ప్రస్తావించడంతో శనివారం ఉదయానికి మిగతా 5 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్‌ను రెండో ఓడలోకి పంప్ చేసి జిల్లా నుంచి తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగాక అధికారులు స్పందించిన తీరు, బాధిత గ్రామాల్లో తీసుకున్న చర్యలు, సత్వర పరిహారం అందేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను సీఎం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment