ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన అభిమన్యును ప్రశంసిస్తున్న సీఎం వైఎస్ జగన్
మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 45 వేల పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టల్స్, 148 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. అయినా ఫర్వాలేదని, నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువేనని అమలు చేస్తున్నాం.
యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు. రాక్షసులు, ఉన్మాదులతో. ఇలాంటి అన్యాయమైన పరిస్థితిలో కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే ధ్యేయంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేలా మీ బిడ్డను ఆశీర్వదించాలి.
ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరనే భయంతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ చానళ్లను ఏమనాలో ఒక్కసారి మీరే ఆలోచించాలి.
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయడం కోసం ఇంకా ఫోకస్డ్‌గా అప్రోచ్ కావడానికి కృషి చేస్తుంటే అడ్డుపడుతున్నారు. చివరకు స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డు పడుతున్నారు.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి విజయనగరం: చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబాల పరిస్థితిలో మార్పు లేదన్నారు. పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఈ దిశగా అడుగులు వేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో సోమవారం ఆయన జగనన్న వసతి దీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేదవాడు అప్పుల పాలు కాకుండా ఆ కుటుంబం నుంచి ఓ ఇంజనీర్ లేదా డాక్టర్.. కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లలు బయటకు రావాలి. ఇది జరగాలంటే ఆ పిల్లాడు బడికి వచ్చి పెద్ద చదువులు చదవాలి. మంచి ఉద్యోగాలు చేయాలి. మంచి జీతాలు సంపాదించాలి. అప్పుడే పేదరికమన్నది మన దగ్గర నుంచి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి ఇంత వరకూ రాలేదు’ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఉన్నత విద్య చదివే వారి సంఖ్య పెరగాలి
‘స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రంలో ఇవాల్టికీ 33 శాతం మంది చదువు రాని వారు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చదువు రాని వారి సంఖ్య దేశ సగటు 25 శాతం. అంటే మన రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉంది. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వయసున్న పిల్లలు ఎంత మంది ఇంటర్ తర్వాత కాలేజీల్లో ఎన్‌రోల్ అవుతున్నారని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంలో మనమెప్పుడూ కూడా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలతో పోల్చుకుంటాం. ఎందుకంటే వాళ్లవి, మనవి ఒకే రకమైన ఎకానమీస్ కాబట్టి. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో చూస్తే రష్యాలో 81 శాతం.. బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో కూడా 50 శాతముంటే, మనదేశంలో కేవలం 23 శాతం మాత్రమే ఉంది. అంటే 77 శాతం మంది పిల్లలు ఇంటర్ అయిపోయాక పూర్తిగా చదువులు మానేస్తున్న పరిస్థితి. ఇలాగైతే మన పిల్లలు ఏ రకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు? ఈ పరిస్థితి మార్చాలని, ఆ దిశగా అడుగులు వేస్తూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు ఇక్కడ వసతి దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నా.
విజయనగరం సభలో మాట్లాడుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. సభకు హాజరైన విద్యార్థులు, మహిళలు
ప్రపంచంతో పోటీ పడేందుకే ఇంగ్లిష్ మీడియం
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలన్నీ పూర్తిగా మార్చేందుకు మనబడి నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఇదే విజయనగరం జిల్లాలో ఇప్పటికే స్కూళ్లలో రూపురేఖలు మారుతున్నాయి. మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని స్కూళ్ల రూపు రేఖలు మార్చబోయే కార్యక్రమం ఇది. మధ్యాహ్న భోజనం మెనూలో కూడా పూర్తిగా మార్పులు చేస్తూ.. గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల అదనంగా దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు ఖర్చవుతున్నా కూడా ఏ మాత్రం లెక్క చేయలేదు. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు.. వారు భావితరంతో పోటీ పడాలి. అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి రావాలి. అది జరగాలంటే ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియం వైపు పరుగెత్తాలి. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ పూర్తిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ మొత్తంగా నాలుగేళ్లలో మన పిల్లలు బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్ మీడియంలో రాసే పరిస్థితి కల్పిస్తాం. ఇందులో భాగంగా పిల్లలకు బ్రిడ్జి కోర్సులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నాం. వీటన్నింటితో పాటు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకొస్తున్నాం.
తమకు అండగా ఉన్నందుకు కృతజ్ఞత తెలుపుతూ సభలో ‘థాంక్యూ సీఎం సార్’ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు
ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం
ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు. ఇటువంటి వారిని ఏమనాలో మీరే ఆలోచించాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి? ఏ తçప్పు చేయకపోయినా, ఏదేదో జరిగిపోతున్నట్లు విపరీతమైన రాతలు, విపరీతంగా చూపిస్తున్న టీవీ చానళ్లు. యుద్ధం చేస్తున్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు. ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం కాబట్టి దేవుడి దయతో పాటు మీ అన్నకు, మీ బిడ్డకు మీ ఆశీర్వాదం కావాలి.
ఇది అందరి గురించి ఆలోచించే ప్రభుత్వం
మీ పిల్లలు మీ ఇంటి దీపాలు కావాలి. మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద, మధ్యతరగతి, ఇతర వర్గాల బాగు కోసం కట్టుబడి ఉన్న ప్రభుత్వం మనది. తల్లుల చేతికిచ్చే ప్రతి రూపాయి పిల్లలకు ఉపయోగపడుతుందని నమ్మి అమ్మఒడి, వసతి దీవెన తీసుకొచ్చాం. మనమివ్వబోతున్న ఆసరా, చేయూత, ఉగాది నాటికి ఇవ్వబోతున్న ఇళ్లపట్టాలు.. ఇవన్నీ అక్కచెల్లెమ్మల సాధికారతకు దోహదపడతాయి. దశల వారీగా మద్యాన్ని కూడా నియంత్రిస్తున్న ప్రభుత్వం మనది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స, పి.విశ్వరూప్, సుచరిత, అవంతి, వెలంపల్లి, ఎం.శంకరనారాయణ, వనిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు
ఏడాదికి రెండున్నర లక్షలు కన్నా తక్కువ ఆదాయం ఉన్న ప్రతి పేద విద్యార్థి కుటుంబానికి ఏటా రూ.20 వేల చొప్పున ‘వసతి దీవెన’గా వసతి, భోజన ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది. మీ అన్నగా, మీ బిడ్డగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో రెండో వాయిదా కింద మరో రూ.10 వేలు.. మొత్తంగా ఏటా రూ.20 వేలు పిల్లల తల్లులకు అందిస్తాం. ఐటీఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు వారి తల్లులకు అందజేస్తాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ ఈ సాయం అందిస్తాం. అక్షరాల 11 లక్షల 87 వేల మంది పిల్లలకు ఈ రోజు ఒక బటన్ నొక్కిన వెంటనే ఆ తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ.1,100 కోట్లు నేరుగా పడుతుంది. వసతి దీవెన కింద ఏడాదికి రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నాం. తల్లిదండ్రులు ఆ పిల్లలను చిరునవ్వుతో కాలేజీలకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఏటా మరో రూ.3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అమ్మఒడి ద్వారా 1æ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉండాలని, 42 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ప్రతి తల్లికి రూ.15 వేల చొప్పున రూ.6400 కోట్లు జమ చేశాం. ఈ మూడు పథకాలకు అక్షరాలా రూ.12,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నా.
దేవుడిలా వరాలిస్తున్న సీఎం
జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సీహెచ్ అభిమన్యు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. విజయనగరంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అభిమన్యు మాట్లాడుతూ.. ‘మాట తప్పను.. మడమ తిప్పనని జగనన్న పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను నిజం చేశారు. అమ్మఒడి పథకం తీసుకువచ్చారు. అర్హురాలైన ప్రతి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తల్లులు ఎంతో అదృష్టవంతులు. జగనన్న గోరుముద్ద పథకం.. ఒక అమృతభాండం. ఎంతో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. మన సీఎం జగన్ విష్ణుమూర్తి లాంటి వారు. మనకు ఎన్నో వరాలు కురిపిస్తున్నారు. సీఎం జగన్ ఆకాంక్షలను విద్యార్థులు నెరవేరుస్తారని నేను మాట ఇస్తున్నా. నేను బాగా చదివి ఐఏఎస్ అధికారినవుతాను’ అన్నాడు. అనంతరం అభిమన్యును సీఎం జగన్ దగ్గరకు తీసుకుని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment