చైనాలో మొదలైన కోవిడ్ వైరస్ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఇప్పటికి 77 దేశాల్లో వ్యాపించి, 3,100 మందిని పొట్టన పెట్టుకుంది. ఒక్క చైనాలోనే 2,943 మంది మరణించారు. ఇరాన్‌లో 77 మంది చనిపోయారు. 90 వేల మందికి పైగా దీని బారిన పడ్డారు. భారత్‌లోనూ ఇది ప్రవేశించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లలో రెండు కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌కు దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో పాటు దేశంలో మరికొందరికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు చేపట్టాయి.
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ నిరోధానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ‘స్పందన’పై మంగళవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఒక కేసు నమోదైందని, రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. ఈ విషయంలో ప్రజలను గందరగోళానికి గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. గల్ఫ్ దేశాల్లో బాగా విస్తరిస్తోందని చెప్పారు. (ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉన్నాం)
ముందుగానే సన్నద్ధమవుదాం..
- రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి.
- జిల్లా ఆసుపత్రుల్లో ఐసొలేషన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
- వైద్య సిబ్బందికి శిక్షణ చాలా ముఖ్యం. వైద్యాధికారులను కలుపుకుని శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించాలి.
- కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. కరోనా వైరస్ ఎలా వస్తుంది.. వస్తే ఏం చేయాలి.. అన్నదానిపై విస్తృతంగా ప్రచారం చేయాలి.
- ప్రతి గ్రామ సచివాలయంలో కరపత్రాలను అతికించాలి.
- బాడీ మాస్క్‌లు, మౌత్ మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలి.
- ఈ మేరకు ఇప్పటి నుంచే ఆర్డర్ ఇస్తే మంచిది. అప్పటికప్పుడు ఆందోళన చెందడం కంటే ముందస్తుగా సన్నద్ధం అవ్వాలి.
మంగళవారం కోవిడ్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సచివాలయం నుంచి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
కరోనా వైరస్‌కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలను కలెక్టర్లకు ఇలా వివరించారు.
- ఇప్పటివరకూ 64 దేశాల్లో వైరస్ వ్యాపించింది.
- కేవలం 5 శాతం కేసుల్లో మాత్రమే ప్రమాదకర పరిస్థితులున్నాయి.
- వయో వృద్ధులు ఎక్కువగా విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
- సార్స్‌ను మనం విజయవంతంగా ఎదుర్కొన్నాం.
- జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలి.
- ఐసొలేషన్ ప్రక్రియ చాలా ముఖ్యం. ఈ కేసులను డీల్ చేయడానికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరం.
- రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలి.
- కరోనా (కోవిడ్) వైరస్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి సారించాలి.
Comments
Please login to add a commentAdd a comment