
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి అభ్యర్థన మేరకు అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం జగన్ నేడు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.
గత పదినెలలుగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల ఫలితాలను సీఎం జగన్ విడుదల చేశారు. 333 సబ్ ఇన్‌స్పెక్టర్, సివిల్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్, ఏపీఎస్పీ), డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ల ఫలితాలను రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్టు సోమవారం రిలీజ్‌చేసింది. మొత్తం 1,35,414 మంది అభ్యర్థులకు ఈ పోస్టుల కోసం పోటీపడ్డారు. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ పరీక్షలు, పూర్తయ్యాక అందులో అర్హత పొందిన 32,745 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరంతా 149 సబ్ ఇన్‌స్పెక్టర్, 75 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) పోస్టులకు, 75 ఏపీ స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, 10 మంది డిప్యూటీ జైలర్ల, 20 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడ్డారు.
నెల్లూరుకు చెందిన పరుచూరి రమేష్, కడపకు చెందిన షేక్ హూస్సేన్, రవికిషోర్ 255 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. 15,775 మంది మహిళా అభ్యర్థులు పోటీపడగా 61 మంది ఎంపిక అయ్యారు. కృష్ణాజిల్లాకు చెందిన ప్రజ్ఞ 224 మార్కులతో టాపర్‌గా నిలిచారు. ధృవ పత్రాలు వెరిఫికేషన్ పూర్తయ్యాక ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయిన వారికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment