
సాక్షి, అమరావతి: ఉగాది నాటికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక వంటిదని, ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశమంతా ఈ కార్యక్రమంపై మాట్లాడుకుంటోదని, దీన్ని బట్టే మన పాలన ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం కార్యాలయంలో మంగళవారం చేపట్టిన సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం జగన్ పలు కీలక సూచనలను చేశారు. ప్రతి గ్రామంలోనూ పథకాలపై సోషల్ ఆడిట్ జరగాలని ఆదేశించారు.
సమీక్ష సందర్భంగా సీఎం అధికారులతో చర్చిస్తూ.. ‘ప్రతి గ్రామంలోనూ సోషల్ ఆడిట్ చేయాలి. ఇంకా ఎక్కడైనా పొరపాట్లు కారణంగా ఎవరైనా మిగిలిపోతే వారి విజ్ఞప్తులనూ పరిగణలోకి తీసుకోండి. వచ్చే రైతు భరోసాలో వారికి మళ్లీ లబ్ది కలిగే అవకాశం ఉంటుంది. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషిచేయాలి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్యక్రమం ద్వారా దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, వచ్చే నాలుగు నెలల్లో మనం చేయాల్సిన ప్రయత్నాలు ఇంకో ఎత్తు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించండి, లేని పక్షంలో భూమలు కొనుగోలు చేయాలి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపైనే కలెక్టర్లు రాత్రీ పగలు ఆలోచించాలి.
నవంబర్ 20 నుంచి బియ్యం కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ లబ్ధిదారుల ఎంపిక. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20వ వరకూ ఎంపిక. దీనికి సంబంధించి కొత్త కార్డుల జారీ, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ఎంపిక. అలాగే వైయస్సార్ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మ ఒడి, నాయీ బ్రాహన్మణులకు నగదు, వైయస్సార్ కాపు నేస్తం, గ్రామాల్లోని దేవాలయాలు, చర్చిలు, మసీదులు.. సహా ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు. గ్రామ సచివాలయంలో పర్మినెంట్‌గా డిస్ ప్లే బోర్డు ఉండాలి. వివిధ పథకాలకు అర్హులైన వారి జాబితాను అక్కడ ఉంచాలి. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేయాలి? ఎవరికి చేయాలన్న సమాచారాన్ని కూడా దాంట్లో ఉంచాలి. వైఎస్సార్ రైతు పథకానికి నవంబర్ 15న రైతులకు సంబంధించిన కౌలు పూర్తయింది. అలాగే కౌలు రౌతులకు సంబంధించిన గడువును డిసెంబర్ 15 వరకు పెంచుతున్నాం. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వాటిపై అవగహన పెంచుకోడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని పేర్కొన్నారు.