వైఎస్‌ జగన్: కోవిడ్‌ నివారణ చర్యలపై ఉన్నత స్థాయి లో సీఎం సమీక్ష | YS Jagan Review Meeting Corona Control Measures And Screening - Sakshi
Sakshi News home page

అందరి ఆరోగ్యంపై 90 రోజుల్లో స్క్రీనింగ్‌

Published Tue, Jun 23 2020 2:23 AM | Last Updated on Tue, Jun 23 2020 5:53 PM

CM YS Jagan Review Meeting Corona Control Measures And Screening - Sakshi

కోవిడ్‌ నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కోవిడ్‌ పరీక్షలు చేయడంలో హేతుబద్ధత ఉండేలా స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలి. పరీక్షల్లో 50 æశాతం కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో, మిగిలిన 50 శాతం తమకు తాముగా కోవిడ్‌ పరీక్షల కోసం ముందుకు వచ్చే వారికి, కాల్‌ సెంటర్‌ ద్వారా సమాచారం ఇచ్చే వారికి చేయాలి. వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న హైరిస్క్‌ గ్రూపుల వారికి కూడా పరీక్షలు చేయాలి.  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నివారణ తదుపరి చర్యల్లో భాగంగా 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి స్క్రీనింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి, నివారణా చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షల కోసం 104 వాహనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, అనుమానం ఉన్న వారి నుంచి కోవిడ్‌ శాంపిల్‌ తీసుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, వారికి అక్కడే మందులు కూడా ఇవ్వాలన్నారు. ప్రతి నెలలో కనీసం ఒకసారి ప్రతి గ్రామంలో 104 ద్వారా వైద్య సేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. స్క్రీనింగ్, పరీక్షల వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచాలన్నారు. పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో అనుసరిస్తున్న వ్యూహాల గురించి సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.

టెస్టుల సంఖ్య బాగా పెంచాం

  • 60 ఏళ్లు పైబడిన..40 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కోవిడ్‌ పరీక్షల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. మరణాల రేటు తగ్గించేందుకు ఈ వ్యూహాన్ని ఎంపిక చేసుకున్నామని చెప్పారు.  
  • చేస్తున్న పరీక్షల్లో కనీసం 60 శాతం పరీక్షలు వారికే చేస్తున్నామని, ఆ తర్వాత కంటైన్‌మెంట్‌ జోన్లలో, హైరిస్క్‌ ఉన్న గ్రూపుల వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.    
  • బయట నుంచి కార్మికులు రావడం, ట్రక్కుల ద్వారా వేరే ప్రాంతాల నుంచి రావడం వారు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.  
  • రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ విస్తరించిన ప్రాంతాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. రోజుకు 24 వేలకుపైగా టెస్టులు చేస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందన్నారు.  
  • రాష్ట్రంలో 1.42 కోట్ల ఆరోగ్య కార్డులకు గాను 1.20 కోట్ల కార్డుల పంపిణీ పూర్తి చేశామని అధికారులు చెప్పగా, మిగిలిన వాటిని కూడా త్వరగా పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. తర్వాత ప్రతి మనిషి ఆరోగ్య వివరాలను ఆరోగ్యశ్రీ కార్డులో న మోదు చేయాలన్నారు.  
  • పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ప్లాన్‌ చేయాలని, ప్రతి అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లో డాక్టర్, స్టాఫ్‌ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తప్పనిసరిగా ఉండాలని, వార్డుల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌కు అనుసంధానంగా ఉండాలని ఆదేశించారు.   

క్షేత్ర స్థాయిలో బలమైన వ్యవస్థల ద్వారానే కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోగలం. ఇందులో భాగంగా ప్రజల్లో మరింతగా అవగాహన, చైతన్యం కల్పించాలి. రానున్న 90 రోజుల్లోగా ప్రతి ఇంటికీ అవగాహన కల్పించడంతో పాటు స్క్రీనింగ్, పరీక్షలు పూర్తి చేయాలి. 

ప్రతి మండలానికీ ఒక 104 వాహనాన్ని అందించి, కరోనా నిర్ధారణ కోసం శాంపిళ్లు సేకరించే సదుపాయాలను వాహనంలో అమర్చాలి. వీటితో పాటు షుగర్, బీపీ లాంటి పరీక్షలు కూడా చేయాలి. అవసరమనుకున్న వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్‌ చేయాలి.

104 సిబ్బందితో పాటు అదే గ్రామానికి చెందిన ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేయాలి. క్రమం తప్పకుండా ప్రతి నెలా ప్రతి గ్రామానికి 104 వెళ్లి ఈ తరహా సేవలందించాలి. 

వర్షాకాలంలో జ్వరాలు రాకుండా జాగ్రత్తలు 

  • వర్షాకాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి, వైద్య శాఖ సన్నద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌పై ఆరా తీశారు.  
  • మనుషులు, పశువులు, ఆక్వా రంగంలో వినియోగించే ఔషధాలకు డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు.  
  • 104, 108 కొత్త వాహనాలను జులై 1 నాటికి సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.  
  • సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌  నీలంసాహ్ని, డీజీపీ సవాంగ్‌ పాల్గొన్నారు. 
     

భయాందోళన తొలగించాలి

  • ప్రజల్లో కోవిడ్‌ పట్ల భయాందోళనలు (స్టిగ్మా) తొలగించేలా అవగాహన, చైతన్యం కల్పించాలి. ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఇది వరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలి. స్థానికంగానే ఏం చేయాలన్న దానిపై లోకల్‌ ప్రొటోకాల్‌ రూపొందించాలి.
  • వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు దీని గురించి సవివరంగా తెలియజేయాలి. ఏ నంబర్‌కు కాల్‌ చేయాలో చెప్పాలి. కోవిడ్‌ సోకిందన్న అనుమానం వస్తే పాటించాల్సిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌)పై అవగాహన కల్పించాలి. రాష్ట్రంలో ప్రస్తుతం చాలా వరకు పీహెచ్‌సీల్లో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉన్నా, ఈ సదుపాయాన్ని అన్ని పీహెచ్‌సీల్లో ఉండేలా చూడాలి. 
  • కరోనా ఉన్నట్టుగా అనిపిస్తే.. ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో ఒక హోర్డింగ్‌ పెట్టాలి. ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న వివరాలు ఆ హోర్డింగ్‌లో పెట్టాలి.  టెస్టింగ్‌ సదుపాయం, మెడికేషన్‌ అందుబాటులో ఉంచాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement