నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని తలపెట్టారు. పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్‌రెడ్డిని ఇందుకోసం ఒప్పించి 2007 జూన్ 7న శంకుస్థాపన చేశారు. 10,670 ఎకరాలను కేటాయించారు. విమానాశ్రయానికి మూడువేల ఎకరాలు కేటాయించారు. రూ.20వేల కోట్లతో పది బిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంటును ప్రతిపాదించారు.
నేడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి...
కేంద్ర ప్రభుత్వం నిర్మించకపోతే అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే తమ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తుందని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. జూలై 8న జమ్మలమడుగులో జరిగిన రైతు సభలో డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ కేబినెట్ ఇందుకు ఆమోద ముద్ర వేసింది.
సాక్షి, జమ్మలమడుగు: పుష్కరకాలం తర్వాత జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వచ్చేనెలలో పునాది రాయి పడనుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబరు 26న శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె– పెద్దదండ్లూరు పంచాయతీల మధ్య కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి జిల్లా ప్రజలు హర్షాతిరేకం వ్యక్తంచేస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంబవరం పంచాయతీలో చిటిమిటి చింతలలో శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఆయన మరణానంతరం పాలకులెవరూ దీని గురించి పట్టించుకోలేదు. టీడీపీ ఎన్నికల ముందు కంటితుడుపుగా శంకుస్థాపన చేసి గాలికొదిలేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైఎస్సార్ మాదిరిగా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బలంగా అడుగులు వేస్తున్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
విభజన హామీ విస్మరణ
రాష్ట్ర విభజన సందర్భంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం గాని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గాని ఈ హామీని పూర్తిగా విస్మరించాయి. మైలవరం మండలం కంబాలదిన్నెలో ఎన్నికల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కుబడిగా శంకుస్థాపన చేతులు దులుపుకొన్నారు. కనీసం భూమిని కూడా కేటాయంచలేదు. ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించలేదు.
అన్ని సానుకూలంగా: కర్మాగారానికి సున్నపురాళ్లు–పెద్దదండ్లూరు మధ్య ప్రాంతం అనువైనదని ప్రభుత్వం భావించింది. ఇక్కడ దాదాపు 90శాతంపైగా ప్రభుత్వ భూములున్నాయి.డీకేటీ భూములు కూడా ఉన్నాయి. సమీపంలోనే ఆర్టీపీ పీ ఉంది. దక్షిణ కాలువతో పాటు ఆర్టీపీపీ పైప్‌లైన్, సమీపంలోనే రైల్వే లైన్ కూడా ఉన్నా యి. ఫలితంగా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. స్టీల్‌ప్లాంటుకు ప్రభుత్వం 3200 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే ఏపీ హైగ్రేడ్ స్టీల్‌కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సీఎండీగా పనిచేసి రిటైరైన మధుసూధన్‌రెడ్డిని ఈ సంస్థ అధికారిగా నియమించింది. రెండు రోజుల్లో భూమిని సర్వే చేసి డిసెంబరు 26న శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నారు.
ఉక్కు భూముల పరిశీలన
జమ్మలమడుగు రూరల్: స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే డాక్టర్‌మూలే సుధీర్‌రెడ్డిలు గురువారం పరిశీలించారు. మండల పరిధిలోని సుగుమంచిపల్లె–పెద్దదండ్లూరు గ్రామాల మధ్య 3200 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసందే. ఈనేపథ్యంలో జిల్లా అధికారులు, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు భూములను పరిశీలించారు. సున్నపురాళ్లపల్లె నుంచి కన్యతీర్థం సమీప ప్రాంతం నుంచి కోసినేపల్లి రహదారి వరకు గల భూములను పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా రెండుమూడు చోట్ల భూములను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండటంతో పాటు సమీపంలో ధర్మల్ పవర్ ప్రాజెక్టు, రైల్వే ట్రాక్ , నీటి వసతులు ఉన్నందున సున్నపురాళ్లపల్లి– పెద్దదండ్లూరు పంచాయతీల మధ్య ఏర్పాటుకు అంగీకరించిందన్నారు.
ఇక్కడి పనులను ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ జూలైలో జరిగిన రైతు సభలో డిసెబర్ 26వతేదిన స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రికి జమ్మలమడుగువాసులపై ఎనలేని ప్రేమ ఉందన్నారు. స్టీల్‌ఫ్లాంట్ నిర్మాణం జరిగితే జమ్మలమడుగుతో పాటు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. వారి వెంట ఆర్డీఓ వి,నాగన్న, తహసీల్దార్ మధుసూధన్‌రెడ్డి, సర్వేయర్లు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇతర అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment