సీఎం వైఎస్‌ జగన్‌ మరో సంచలన నిర్ణయం | CM YS Jagan Video Conference Over Spandana Program | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ మరో సంచలన నిర్ణయం

Published Wed, Jul 10 2019 2:13 PM | Last Updated on Wed, Jul 10 2019 3:01 PM

CM YS Jagan Video Conference Over Spandana Program - Sakshi

సాక్షి, అమరావతి : అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి  బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యలపై స్పందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

‘డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2014-19 మధ్య కాలంలో 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలి. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లాలి. వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఎక్కడైన సరే రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ  మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కలెక్టర్‌ కచ్చితంగా ఆ కటుంబం దగ్గరకు వెళ్లాలి. ఈ విషయంపై మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు. మనిషే చనిపోయాడు.. మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాద’ని ముఖ్యమంత్రి తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వమని, మానవత్వం ఉన్న ప్రభుత్వం అని​.. ఆ దిశగానే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సానుభూతితో, మానవీయతతో ఉండాలని అధికారులను ఆదేశించారు.

వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి : సీఎం వైఎస్‌ జగన్‌
‘స్పందన’ కార్యక్రమానికి వస్తున్న వినతులు పరిష్కారంలో నాణ్యత ఉండాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు స్పందన కార్యక్రమాన్ని గైర్హాజరు కావద్దని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులకు తప్పకుండా రశీదులు ఇవ్వాలని తెలిపారు. అర్జీదారులకు ఇచ్చే రశీదు మీద కూడా తేదీని రాసివాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు బాగా పని చేస్తున్నారని చెప్పిన ముఖ్యమంత్రి వారిని అభినందించారు. అలాగే వినతుల పరిష్కారంలో లోపాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

‘విజయవాడ సెంట్రల్‌ నుంచి ఒక వినతి వచ్చింది. బినామీ డీలర్‌ రేషాన్‌ షాపు నిర్వహిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అధికారులు సరైన పత్రాలు చూపించలేదని ఆ ఫిర్యాదును తిరస్కరించారు. కానీ ఫిర్యాదుదారు ఎలా పత్రాలు చూపిస్తారనేది అధికారులు ఆలోచించాలి. విచారణ చేపట్టాల్సిన బాధ్యత మనది. విచారణ చేయకుండా ఫిర్యాదును తిరస్కరిస్తే.. ఈ కార్యక్రమం వల్ల ఏం ప్రయోజనం?. అధికారులు మనసుపెట్టి సమస్యలను పరిష్కరించాలి. ఎవరైన బాధపడి మన దగ్గరికి వచ్చారంటే మనం దానిని ఫీల్‌ అయి ఆ వినతిని పరిష్కరించేందుకు కృషి​ చేయాలి. అర్జీదారులకు ఇచ్చే రశీదులో ఎప్పటిలోగా దానిని పరిష్కరిస్తామనేది రాసి కూడా ఇవ్వాలి. మొదటి స్పందన కార్యక్రమానికి 4,400కు పైగా వినతులు వచ్చాయి. వినతుల పరిష్కారం కోసం పటిష్ట యంత్రాంగం ఏర్పాటు చేయాలి. క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టాల’ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

హౌసింగ్‌, రేషన్‌కార్డులపై ఎక్కువ వినతులు..
హౌసింగ్‌, రేషన్‌కార్డులపై అధిక సంఖ్యలో వినతులు వస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దానిపై స్పందించిన ముఖ్యమంత్రి.. వాటిని పరిష్కరించడానికి గ్రామ సచివాలయాలను సమర్ధవంతంగా వాడతామని తెలిపారు. రేషన్‌కార్డు, పెన్షన్‌ ఏది అడిగినా 72 గంటల్లో పరిష్కరించమని చెబుతున్నట్టు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రతి జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకూడని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రామ వాలంటీర్లను సమర్దవంతంగా వాడుకోవాలన్నారు. హాస్టళ్లలో వసతుల మెరుగుదల కోసం ప్రతి జిల్లాకు 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టర్లు తనిఖీలకు వెళ్లేలోపు వాటికి సంబంధించిన నివేదికలు తెప్పించుకోని.. ఆ మేరకు నిధులను ఖర్చు చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు సరైన వసతులు కల్పించాలని.. ప్రతి మండలంలో కూడా స్పందన కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

అవినీతిని మండల స్థాయి నుంచి అరికట్టాలి
అవినీతిని మండల స్థాయి నుంచి అరికట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో కొన్నింటిని ప్రస్తావించిన ముఖ్యమంత్రి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ‘ఇ-సేవలో సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎమ్మార్వో ఆఫీసులో లంచం ఇస్తే కాని పని జరగడం లేదని చెప్తున్నారు. అలాంటి అధికారులను పిలిపించుకుని కలెక్టర్లు కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. నా స్థాయి నుంచి నేను క్లీన్‌ చేయడం మొదలుపెట్టాను. మీ స్థాయిలో మండల స్థాయి అధికారులను మీరు క్లీన్‌ చేయాలి. ఈ అంశంపై వచ్చే రెండు, మూడు నెలల్లో పాజిటివ్‌ రిపోర్ట్‌ కావాలి. 

మండల కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతన్నాయని నిఘా అధికారులు నివేదిక ఇచ్చే పరిస్థితి ఏర్పడాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో.. ఏ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నా డబ్బు లేనిదే పని జరగడం లేదు. దీనిని ఎలా అరికట్టాలో సలహాలు ఇవ్వండి.  నేను బలమైన సంకేతం ఇస్తున్నా.. అయితే దీనివల్ల యాభై శాతం మాత్రమే జరుగుతుంది. మిగిలిన యాభై శాతం పూర్తిచేయాల్సింది కలెక్టర్లు, ఎస్పీలు. మీరు మనసుపెడితే ఇది సాధమేన’ని ముఖ్యమంత్రి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement