ఆసుపత్రి పాలైన బాధితులకు ఇచ్చే డబ్బు పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి, ఇబ్బందుల్లేకుండా ఆ ఇంటి అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయాలి. ఈ డబ్బును బ్యాంకులు అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ ఇంకంబర్డ్ ఖాతాల్లో వేయాలి. ఈ విషయంపై బ్యాంకర్లతో మాట్లాడాలి. మంగళవారం ఉదయం వలంటీర్ల ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ఇప్పటికే సాయం అందుకున్న వారు కాకుండా మిగతా బాధితులందరికీ మూడు రోజుల్లో ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబాల్లోని చిన్నారులనూ పరిగణనలోకి తీసుకోవాలని, బాధితులకు అందించే సాయాన్ని మహిళల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటన, తీసుకుంటున్న చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, అధికారులతో సమీక్షించారు. మరణించిన వారి కుటుంబాల్లో లీగల్ హెయిర్ పూర్తి అయిన ఎనిమిది మందిలో ఐదుగురికి (సమీక్ష నిర్వహించే సమయానికి) పరిహారం ఇచ్చామని, మిగిలిన వారికి కూడా అందజేస్తామని మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు, మిగతా వారికి పరిహారంపై సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎస్‌ఓపీ మేరకు శానిటేషన్ పనులు
► గ్యాస్ లీక్ ఘటన అనంతరం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రులు, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్ పనులు ప్రారంభమయ్యాయని, సాయంత్రం 4 గంటలకల్లా ముగుస్తాయని చెప్పారు. ఆ తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తామన్నారు.
► బాధితులు చాలా మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని.. ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) ఇచ్చారని, దాని ప్రకారమే శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
► ఆంధ్రా మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల బృందాన్ని ఈ ప్రాంతంలోని వారికి వైద్య సేవలను అందించడానికి నియమిస్తున్నామని విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ సీఎంకు వివరించారు. గ్యాస్ దుర్ఘటన సమయంలో బాధితులను ఆదుకోవడానికి, వారి ప్రాణాలను రక్షించడానికి అధికారులు, పోలీసులు చాలా చక్కగా పనిచేశారని సీఎం ప్రశంసించారు.
సీఎం వైఎస్ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రులు, అధికారులు
కొరియాకు 13 వేల టన్నుల స్టైరీన్
► సీఎం ఆదేశాల మేరకు స్టైరీన్ తరలింపును ప్రారంభించామని కలెక్టర్ వివరించారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందని, ఇది సురక్షిత స్థాయి అని తెలిపారు. ట్యాంకులోని స్టైరీన్ దాదాపు 100 శాతం పాలిమరైజ్ అయ్యిందని వెల్లడించారు.
► ఇదికాకుండా ఇంకో ఐదు ట్యాంకుల్లో 13 వేల టన్నుల స్టైరీన్ ఉందని, దీనిని కొరియాకు తరలిస్తున్నామని చెప్పారు. 8 వేల టన్నులను ఒక వెసల్ ద్వారా తరలిస్తున్నామని, అదృష్టవశాత్తూ మరొక వెసల్ కూడా అందుబాటులో ఉన్నందున.. దీని ద్వారా మిగిలిన 5 వేల టన్నులను తిరిగి కొరియాకు పంపిస్తున్నామని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
► అత్యున్నత స్థాయి బృందం కంపెనీలో నిశిత పరిశీలన చేసిందని, ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు.
రాష్ట్రమంతటా పరిశ్రమల్లో తనిఖీలు
► ఒక్క విశాఖనే కాకుండా రాష్ట్రంలోని మిగతా పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించేలా చూడాలన్నారు. ఇదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపై కూడా ఆలోచించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల అభిప్రాయాలను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్.. విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి, కృష్ణ దాస్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్‌లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10 వేలు ఇస్తామని చెప్పాం. ఆ ప్రకారం అందరికీ ఇవ్వాలి. పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ పది వేల రూపాయల చొప్పున ఇవ్వాలి. అందర్నీ లెక్కలోకి తీసుకోవాలి. శానిటేషన్ కార్యక్రమాలు ముగిశాక, ఈ రాత్రి (సోమవారం)కి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి. మంత్రులంతా ఈ రాత్రి ..ఆ 5 గ్రామాల్లో బస చేయాలి.
డబ్బు బాధితుల ఖాతాల్లో జమ చేసిన తర్వాత వలంటీర్ల ద్వారా వారికి స్లిప్ అందించి.. వారి నుంచి రశీదు తీసుకోవాలి. ఆస్పత్రిపాలైన వారందరికీ వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందించాలి. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్య పరమైన సేవల కోసం
ఓ క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలి.
పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు కొనసాగాలి. ఆర్థిక సహాయం పొందే వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఎవరి పేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదు చేసుకోవాలో వివరాలను అందులో ఉంచాలి. ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం మూడు రోజుల్లో పూర్తి కావాలి.
Comments
Please login to add a commentAdd a comment