Fee Reimbursement in AP: Ys Jagan's Key Statement | తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - Sakshi
Sakshi News home page

తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

Published Wed, Apr 15 2020 3:49 AM | Last Updated on Wed, Apr 15 2020 4:33 PM

CM YS Jaganmohan Reddy Key Statement On Fee Reimbursement - Sakshi

ప్రభుత్వమే పూర్తి ఫీజు మొత్తాన్ని రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నందున కాలేజీల యాజమాన్యాలు ఇంతకు ముందు తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి వారికి ఇచ్చేయాలి. ఈ మేరకు  ఇప్పటికే 191 కాలేజీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.  
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి:  నవరత్న కార్యక్రమాల్లో కీలకమైన ‘జగనన్న విద్యా దీవెన’ పథకానికి (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద విద్యార్థులకు అయ్యే ఫీజుల మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమ చేయించాలని నిర్ణయించింది. కాలేజీలకు ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలకోసారి) ఒకసారి రీయింబర్స్‌మెంట్‌ చేసే ఫీజులను ఇకపై విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా గత ప్రభుత్వ బకాయిలు రూ.1800 కోట్లు సైతం చెల్లించి, ఆ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు లబ్ధి చేకూర్చింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలోని వివరాలు ఇలా ఉన్నాయి.  
 
త్రైమాసికం పూర్తి కాగానే డబ్బు జమ : సీఎం వైఎస్‌ జగన్‌  
► పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నందున ఇక వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఫీజు రీయింబర్స్‌ నిధులను తల్లుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తాం. ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే నేరుగా తల్లి అకౌంట్లో జమ చేయిస్తాం. 
► గతంలో ఇంజనీరింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే చెల్లించేది. ఇది పోగా ఆ కాలేజీలకు నిర్ణయించిన ఫీజులోని మిగతా మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి ఆయా కాలేజీల యాజమాన్యాలు వసూలు చేసేవి. 
► ఇప్పుడు కాలేజీలకు నిర్ణయించిన ఫీజులను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది. 2018–19 బకాయిలను, 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన మూడు త్రైమాసికాల (9 నెలల) ఫీజుల పూర్తి నిధులను ఆయా కాలేజీలకు ప్రభుత్వం విడుదల చేస్తోంది.  
► ప్రస్తుతం ప్రభుత్వమే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన మొత్తాలను ఆయా యాజమాన్యాలు వెనక్కు ఇవ్వకపోవడం నేరం. అలా ఇవ్వని కాలేజీలను బ్లాక్‌ లిస్టులో పెడతాం. 
 
కొత్త విధానం ఎంతో మేలు  
► ప్రభుత్వ నూతన ఫీజు విధానం ఉన్నత విద్యలో ప్రమాణాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని తల్లిదండ్రులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
► ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యార్థులకు కనిష్టంగా 75 శాతం హాజరు ఉండాలనడం మంచిదే. తద్వారా ఇంజనీరింగ్‌ తదితర ఉన్నత విద్యనభ్యసిస్తున్న తమ పిల్లలు ఏ మేరకు తరగతులకు హాజరవుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పిల్లల చదువుల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. 
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయం పట్ల ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 
   
పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది.. 
► వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఇచ్చిన మాట మేరకు.. ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా జగనన్న విద్యా దీవెన పథకాన్ని చేపట్టారు.  
► ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ద్వారా ఆయా కాలేజీలకు అయ్యే వ్యయాలను అనుసరించి విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది.
► ప్రస్తుత (2019–20) విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాల ఫీజు మొత్తాలను ఆయా కాలేజీలకు చెల్లిస్తుండడమే కాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో (2018–19 విద్యా సంవత్సర) బకాయి ఉన్న రూ.1,800 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement