వైఎస్‌ జగన్: ‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం | YS Jagan Launches Jagananna Vidya Deevena - Sakshi
Sakshi News home page

‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం జగన్‌

Published Tue, Apr 28 2020 1:04 PM | Last Updated on Thu, Apr 14 2022 1:28 PM

YS Jagan Launches Jagananna Vidya Deevena - Sakshi

సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థులు తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇంతకు ముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్‌ గుర్తుచేశారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అందజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించారు. 

ఇంకా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘పెద్ద చదువులు చదవగలిగితేనే పేదరికం పోతుందని, అప్పులు పాలు కాకుండా పెద్ద చదువులు చదివితేనే పేదవాళ్ల తలరాతలు మారుతాయని, బతుకులు మారుతాయని నాన్నగారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేది. సీఎం స్థానంలో మనసున్న మహారాజు ఉండేవాడని ఒక భరోసా ఉండేది. ఆయన చనిపోయాక ఈ పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. చాలీచాలని ఫీజులు ఇవ్వడం, ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా ఇవ్వడం చేశారు. ఫీజులు ఎలా ఇవ్వాలన్న ఆలోచన కాకుండా ఎలా కత్తిరించాలి.. అని ఆలోచన చేసి.. చాలీచాలని ఫీజులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్‌ అనే ఒక తండ్రి.. తన ఇంటి ముందు తన కొడుకు ఫొటో పెట్టి, ఫ్లెక్సీ పెట్టి నివాళులు అర్పిస్తున్నాడు. అప్పుడు నేను.. ఏమైందన్నా అని అడిగా. అప్పుడు ఆ తండ్రి బాధపడుతూ చెప్పిన విషయాలు ఎప్పుడూ కూడా నేను మరిచిపోలేను. ‘ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వస్తే.. ఇంజినీరింగ్‌ చదువుతానంటే కాలేజీలో చేర్పించా. కానీ చాలీచాలని ఫీజులు ఇచ్చేవారు, మరోవైపు బోర్డింగ్‌ మెస్‌ ఛార్జీలు కలిపితే లక్ష రూపాయలు దాటే పరిస్థితి. బాలెన్స్‌ ఫీజు ఏం చేస్తావు నాన్నా అని నా కొడుకు అడిగాడు. కొన్ని రోజులుగా అప్పో సప్పోచేసి.. చదవించా. సెలవులకు ఇంటికి రాగానే.. మళ్లీ నా కొడుకు అదే ప్రశ్నలు వేశాడు. ఏదో ఒకటి చేసి చదివిస్తా అన్నాను. కానీ తన చదువు కోసం కొవ్వొత్తిలా తండ్రి, తన కుటుంబం కరిగి పోవడం ఇష్టం లేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి చెప్పాడు. చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదవాడు అప్పులు పాలు అవుతున్నాడు.

ఒక్క పైసా బకాయి లేకుండా చెల్లిస్తున్నాం..
ఆరోజు నేను అనుకున్న కార్యక్రమాన్ని దేవుడి దయతో, అందరి ఆశీర్వాదంతో ఈరోజు చేస్తున్నాం. బోర్డింగ్, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకు వచ్చాం. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే.. ఒక్క చదువులు అన్నది.. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబంలో ఒక్క పిల్లాడైనా మంచి చదువులు చదివితే.. ఆ పిల్లాడికి మంచి జీతం వస్తుంది, మన బతుకుల మారుతాయి. ఈ దిశగానే అడుగులు వేస్తే.. మొట్టమొదటి సారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకూ ఉన్న పూర్తి బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగులో పెట్టకుండా ఇస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 2018–19లో గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లిస్తూ, అలాగే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలకు ఇస్తున్న డబ్బులు అన్నీ కలిపి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నాం.


 

కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాం..
ఈ పథకాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం 2020–21కి సంబంధించి ప్రతి త్రైమాసికం పూర్తైన తర్వాత తల్లుల ఖాతాలోనే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు వేస్తాం. తల్లులు ఫీజులు కట్టడం వల్ల.. కాలేజీలను వారు అడగగలరు. టీచింగ్‌ స్టాఫ్‌ బాగా లేకపోయినా, వసతులు బాగా లేకున్నా ప్రశ్నించే అవకాశం వస్తుంది. ప్రతి 3 నెలలకోసారి డబ్బులు కట్టడానికి వెళ్లడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారు? వారు సక్రమంగా కాలేజీలకు వెళ్తున్నారా? లేదా? అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే వసతి దీవెన అని కూడా ప్రారంభించాం. పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగు కోసం ఏడాదికి రూ.20 వేల వరకూ ఇస్తున్నాం. ఇది కూడా తల్లి అకౌంట్‌లోనే వేస్తున్నాం. దీని వల్ల ఆ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా, తమ పిల్లలను గొప్పగా చదివించగలుగుతారని ఆశిస్తున్నాం.

ఆ డబ్బులను కాలేజ్‌ యాజమాన్యాలు వెనక్కి ఇవ్వాలి..
కరోనా లాంటి కష్టాలు ఉన్నా కూడా.. మా ఇబ్బందుల కన్నా.. మీ ఇబ్బందులు పెద్దవి అని భావిస్తున్నాం. గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్లు తీసుకున్న వారే కాకుండా.. పై తరగతులు చదువుతున్న వారికి కూడా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేస్తున్నాం. స్పెషల్‌ ఫీజులు.. ఇతరత్రా ఫీజులు కూడా ఉండవు. ఎవరైనా తల్లిదండ్రులు.. ఇప్పటికే కాలేజీలకు ఫీజు కట్టి ఉంటే.. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి.. ఆ డబ్బను తల్లిదండ్రులకు వెనక్కి ఇవ్వాలి. తల్లిదండ్రులకు లేఖలు కూడా రాశాం... గ్రామ వాలంటీర్ల ద్వారా అవి చేరుతాయి. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగింది. లేకుంటే 1902 నంబర్‌కు తల్లిదండ్రులు తమ సమస్యను చెప్పవచ్చు. కాలేజీల్లో సదుపాయాలు, మౌలిక వసతులు సరిగ్గా లేవని భావిస్తే 1902 కు తల్లులు కాల్‌ చేయవచ్చు. ఉన్నత విద్యా శాఖలో కాల్‌ సెంటర్‌ ఉంటుంది, సీఎం కార్యాలయం పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఏ సమస్యలున్నా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈ స్థానంలో ఉన్నాడు. మీ పిల్లలను అన్ని రకాలుగా చదివిస్తానని హామీ ఇస్తున్నాను. దేవుడి దయతో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 

చదవండి : మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు రూ. 3 కోట్లు

ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement