చదువే ఆస్తి.. నాదే పూచీ | CM YS Jagan Comments In Jagananna Vidya Deevena Launch | Sakshi
Sakshi News home page

చదువే ఆస్తి.. నాదే పూచీ

Published Wed, Apr 29 2020 3:40 AM | Last Updated on Wed, Apr 29 2020 7:48 AM

CM YS Jagan Comments In Jagananna Vidya Deevena Launch - Sakshi

మంగళవారం ‘జగనన్న విద్యాదీవెన’ పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, చిత్రంలో మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్‌

నేను ఈ రోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి తల్లికీ చెబుతున్నా. మీ పిల్లలను గొప్పగా చదివించండి. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు సీఎం స్థానంలో ఉన్నాడు.. అన్ని రకాలుగా మీ పిల్లలను చదివిస్తాడని హామీ ఇస్తున్నా.    

ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మతో నాలుగు మాటలు పంచుకుంటున్నాను. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువులు అని వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబం నుంచి ఒక్క పిల్లాడన్నా ఇంజనీరో, డాక్టరో లేదా కలెక్టర్‌ అయితేనే పెద్ద జీతాలు వస్తాయి. ఇంటికి కాస్తో కూస్తో డబ్బులు పంపించగలుగుతాడు. అప్పుడే ఆర్థిక స్థితిగతులతో పాటు మన బతుకులు మారతాయి.   

గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్‌ తీసుకున్న వారికే కాకుండా, పై తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాం. కాలేజీలకు కూడా ఒకటే చెప్పాం. ఫీజు అనేది ఒక్కటే. ఫీజు, స్పెషల్‌ ఫీజు అని చెప్పి వేర్వేరుగా తీసుకోవడానికి వీలులేదు. ఏదైనా ప్రభుత్వమే కడుతుంది. స్పెషల్‌ ఫీజులు ఉండవు.

2019–20కి సంబంధించి మనం పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి, పిల్లల కోసం ఫీజులు కట్టి ఉంటే.. కాలేజీ యాజమాన్యాలు తల్లులకు ఆ ఫీజులు వెనక్కు ఇవ్వాలి. ఈ మేరకు వాళ్లకు లేఖలు రాశాం. వలంటీర్ల ద్వారా ఆ లేఖలు అందుతాయి. ఒకవేళ ఎక్కడైనా ఫీజులు తిరిగి వెనక్కు ఇవ్వకపోతే తల్లులకు రాసిన లేఖలో పేర్కొన్న 1902 నంబరుకు ఫోన్‌ చేయండి. ప్రభుత్వమే స్పందించి ఆ మొత్తాన్ని మీకు ఇప్పిస్తుంది.
బీటెక్‌ ఫీజు కట్టలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఎదుట కన్నీరు పెడుతున్న వరమ్మ, గోపాల్‌ (ఫైల్‌) 

సాక్షి, అమరావతి: పేదరికం వల్ల ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని, పిల్లల చదువుల కోసం కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువు ఒక్కటే అని పునరుద్ఘాటించారు. అందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం (జగనన్న విద్యా దీవెన) అమలు చేస్తున్నామని ప్రకటించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాల కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

తొలుత నాన్నగారి ఆలోచన ఇది..
► ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు నాన్న గారి హయాంలో మొట్టమొదటగా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, అంతకు ముందు ఎవ్వరూ చేయని ఆలోచన చేశారు. పేదరికం అన్నది పోవాలంటే కచ్చితంగా కుటుంబం నుంచి పెద్ద చదువులు చదవాలని భావించారు. అప్పులపాలు కాకుండా తమ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లు వంటి పెద్ద చదువులు చదివిస్తేనే పేద వారి తలరాతలు మారతాయని ఆలోచించి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకొచ్చారు.
► రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా ఉండేది. ముఖ్యమంత్రి స్థానంలో ఒక మనసున్న మహారాజు ఉన్నందున తమ బతుకులు, తల రాతలు మారతాయన్న భరోసా ప్రతి ఒక్కరికీ ఉండేది. 
► 2009లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నీరు గారుస్తూ పోయారు. చివరకు ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా.. ఫీజులు ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేయకుండా, ఫీజులు ఎలా కత్తిరించాలి అని ఆలోచించారు. రకరకాల షరతులు పెట్టి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నీరు గార్చారు.   
అప్పుడు వచ్చింది ఈ ఆలోచన
► నిజంగా పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, అందుకు రెండే రెండు కారణాలు. ఒకటి చదువు.. రెండోది ఆ పేదవాడు అనుకోకుండా అనారోగ్యానికి గురవ్వడం. ఈ రెండు కారణాల వల్ల పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ రోజు అనుకున్నాను. ఈ రోజు దేవుడి దయ, అందరి ఆశీర్వాదంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా మరొక అడుగు ముందుకు వేశా.
► ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యా దీవెన) పథకానికి తోడు పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చుల భారం తల్లిదండ్రుల మీద పడకుండా వసతి దీవెన పథకాన్నీ తీసుకొచ్చాం. ఈ పథకాన్ని మొన్న జనవరిలోనే ప్రారంభించాం. ఈ రెండు పథకాలు తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 
రాష్ట్ర చరిత్రలో తొలిసారి
► రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకు ఒక్క రూపాయి బకాయి లేకుండా మొత్తం చెల్లించాం. 2018–19 సంవత్సరానికి అంటే గత ప్రభుత్వం ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో పెట్టిన బకాయిలు.. దాదాపు రూ.1,880 కోట్లు కట్టాము. 
► ఈ సంవత్సరం అంటే 2019–20కు సంబంధించి.. అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు మొత్తం మార్చి 31వ తేదీ వరకు పూర్తిగా గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.4 వేల కోట్లకు పైగా కట్టగలిగాం అని గర్వంగా చెబుతున్నా. 
► కాలేజీ యాజమాన్యాలకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా పూర్తిగా ఫీజులు చెల్లించాం కాబట్టి, ఈ పథకాన్ని ఒక అడుగు ముందుకు తీసుకుపోతున్నాం. వచ్చే జూన్‌లో కాలేజీలు తిరిగి తెరుస్తారు. ఆ కాలేజీల్లో కొత్తగా చేరే వారు చేరుతారు. ఇప్పటికే అడ్మిషన్‌ పొందిన వారు కాలేజీలకు వస్తారు. మళ్లీ కొత్తగా 2020–21 విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఇప్పటి నుంచి ప్రతి త్రైమాసికం (మూడు నెలలు) ఫీజును తల్లి ఖాతాలోనే వేస్తాం. ఆ తల్లులే కాలేజీలకు వెళ్లి ఆ ఫీజులు కట్టేలా కార్యక్రమం చేస్తున్నాం. 


అడిగే హక్కు ఉంటుంది..
► ఎప్పుడైతే తల్లులు ఫీజులు కట్టడం మొదలు పెడతారో అప్పుడు కాలేజీ యాజమాన్యాలను వారు అడగగలుగుతారు. ఆ కాలేజీలో సదుపాయాలు బాగా లేకపోయినా, టీచింగ్‌ స్టాఫ్‌ బాగా లేకపోయినా, ఇంకొకటైనా, ఇంకొకటైనా ఆ తల్లులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. 
► తల్లులు ప్రతి మూడు నెలలకు ఒకసారి వారే నేరుగా వెళ్లి ఫీజులు కడితే, మన పిల్లలు ఎలా చదువుతున్నారు? హాజరు ఉందా? కాలేజీకి వెళ్తున్నారా? లేదా? అనే విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. దీని వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది.  
► కాలేజీలో సౌకర్యాలు లేవు. ఇంప్రూవ్‌మెంట్‌ లేదు. ఆ సదుపాయాలు బాగు పర్చాలి అని ఆ తల్లికి అనిపిస్తే అదే 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పండి. ఈ నంబర్‌ ఎప్పటికీ యాక్టివేషన్‌లోనే ఉంటుంది. ఉన్నత విద్యా శాఖలో ఆ కాల్‌ సెంటర్‌ పెట్టాం. దీన్ని సీఎం ఆఫీస్‌ కూడా పర్యవేక్షిస్తుంది కాబట్టి తల్లులు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం యాక్టివేట్‌ అవుతుంది. 
► కాలేజీ యాజమాన్యాలు ఆ పరిస్థితులను ఇంప్రూవ్‌ చేసే విధంగా కూడా అడుగులు వేస్తాం. అప్పుడు కాలేజీలో పరిస్థితులు, వ్యవస్థ కూడా బాగు పడుతుంది. తల్లులకు జవాబుదారీతనం కూడా వస్తుంది.  చదవండి: నేటి నుంచి ఉచిత రేషన్‌ 

ఇక కొత్త ఒరవడి
► ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టకుండా కాలేజీ యాజమాన్యాలకు కట్టాల్సిన ఫీజులన్నీ కట్టేశాం. కాబట్టి ఈ ప్రభుత్వం పిల్లల చదువులకు కట్టుబడి ఉందని, ఫీజుల్లో ఎటువంటి జాప్యం చేయదని కాలేజీ యాజమాన్యాలకు కూడా నమ్మకం కలిగేలా చేస్తున్నాం. ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. 
► పిల్లల కోసం ‘వసతి దీవెన’ జనవరిలో ప్రారంభించాం. సంవత్సరానికి రెండు దఫాల్లో కలిపి.. జనవరి, ఫిబ్రవరిలో ఒకసారి, మళ్లీ జూలై, ఆగస్టులో రెండో సారి.. పిల్లలకు వసతి, భోజన ఖర్చుల కోసం ప్రతి పిల్లవాడికి రూ.20 వేలు ఇస్తాం. ఇప్పటికే ఒక దఫా రూ.10 వేలు ఇచ్చాం. మళ్లీ జూలై, ఆగస్టులో మిగిలిన రూ.10 వేలు తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తాం. 

కరోనా కష్టాలున్నా మాట నిలుపుకున్నాం
► వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు పథకాల వల్ల ప్రతి తల్లి తన పిల్లలను చదివించడం కోసం అప్పులపాలు కాకుండా ఉంటుంది. 
► కష్టపడకుండా తన పిల్లలను గొప్పగా చదివించగలుగుతామన్న నమ్మకం, విశ్వాసం వస్తుంది. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.   చదవండి: ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

ఆ ఘటన ఏనాటికీ మరచిపోలేను..
నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్‌ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొడుకు ఫొటో పెట్టి, ఫ్లెక్సీ కట్టాడు. ఆయన నా దగ్గరకు వస్తే, ఈ ఫ్లెక్సీ ఎందుకు కట్టారు.. ఏమిటి.. అని అడిగాను. అప్పుడు ఆయన బాధ పడుతూ చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మరచిపోలేను. ‘నా కొడుకు బాగా చదివాడు. ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్‌ చదువుతానంటే కాలేజీలో చేర్పించాను. కానీ అక్కడ ఫీజులు చూస్తే, బోర్డింగ్, మెస్‌ చార్జీలు దాదాపు లక్ష రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం రూ.30 వేలు లేక రూ.35 వేలు మాత్రమే ఇస్తోంది. మరి మిగిలిన ఫీజు ఎలా కడతారని పిల్లవాడు అడిగితే, ఏదో ఒక విధంగా కడతానని చెప్పాను. కాలేజీలో చేరిన పిల్లవాడు మొదటి ఏడాది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. మళ్లీ రెండో సంవత్సరం చాలీచాలని ఫీజులు మాత్రమే ప్రభుత్వం ఇస్తా ఉంది. మిగిలిన ఫీజు పరిస్థితి ఏమిటి అని చెప్పి మళ్లీ అడిగాడు. ఏదో ఒకటి చేస్తాను. నువ్వైతే బాగా చదువు అని చెప్పి పంపించాను. తర్వాత ఆ పిల్లవాడు కాలేజీకి వెళ్లాడు. ఫీజు కోసం నేను పడుతున్న పాట్లు చూసి, అప్పుల పాలవ్వడం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి నాతో చెప్పి బాధపడ్డాడు. 

ఏ తల్లిదండ్రికీ కడుపు కోత ఉండదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన అంకమ్మ రావు 2016లో ఇంజినీరింగ్‌లో చేరాడు. ఇష్టమైన మెకానికల్‌ గ్రూపు ఎంచుకున్నాడు. ఫీజు కోసం తండ్రి పడుతున్న కష్టాలు చూశాడు. తల్లడిల్లిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. 2018 ఫిబ్రవరి 14న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడుములదిన్నె గ్రామం మీదుగా సాగింది. గోపాల్‌ ఇంటి ముందు అంకమ్మరావు ఫొటోను జగన్‌ చూశారు. ఏమైందన్నా అని గోపాల్‌ను ప్రశ్నించారు. ఫీజు కట్టలేక తమ బిడ్డ ఎలా బలైపోయిందీ వివరించి గోపాల్‌ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మనం అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూస్తానని ఆయన వారికి చెప్పారు ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని అంకమ్మరావు తండ్రి గోపాల్‌ హర్షం వ్యక్తం చేశారు.

సీఎం నూరేళ్లు చల్లగా ఉండాలి
తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని, వారి పిల్లల భవిష్యత్‌ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి. 2018లో ప్రజాసంకల్ప యాత్ర మా ఉరు వచ్చినప్పుడు మా ఆవేదనను ఆయనకు చెప్పుకున్నాం. అప్పుడే మాకు ఒక మాట చెప్పారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు వచ్చిన కష్టం ఏ తల్లిదండ్రులకూ రానివ్వనమ్మా.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే ఇచ్చి పిల్లల్ని గొప్పగొప్ప చదువులు చదువుకునేలా చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాటను మర్చిపోకుండా చేసి చూపారు. అందరి భవిష్యత్తుకు మేలు జరిగేలా సీఎం చూడడం మాకు ఎంతో ఆనందం వేసింది.    
– అంకమ్మరావు తల్లి వరమ్మ
 

మా పిల్లలందరికీ మీ వల్లే మేలు
మా కుటుంబాల్లో ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. మాకు ముగ్గురు పిల్లలు. నా భర్త వెన్నెముకకు ఆపరేషన్‌ జరిగింది. ఇప్పుడు పూర్తిగా బెడ్‌ రెస్ట్‌. చాలా ఇబ్బందులు పడ్డాను. ట్యూషన్లు చెబుతూ నెట్టుకొస్తున్నా. నేను ఏడవని రోజు లేదు. ఇప్పుడు నా పిల్లలు అందరికీ మీ వల్ల మేలు జరుగుతుంది. కరోనా వంటి ఆపద సమయంలో కూడా వలంటీర్లు ఇంటింటికీ వస్తున్నారు. రూ. 1,000  ఇచ్చారు. ఇందుకు మీకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా.. మీరు కాల్‌ సెంటర్‌ పెట్టి నంబర్‌ కూడా ఇచ్చారు కాబట్టి, ఇక ఏ సమస్యలూ ఉండవు.  
– రత్నకుమారి, విద్యార్థిని (అపర్ణ) తల్లి, విజయవాడ

మా లాంటి పేదోళ్లకు వరం
మాకు ఏడాదికి రూ.60 వేల ఆదాయం మాత్రమే ఉంది. నేను చదువుకోవాలంటే ఎన్నో సమస్యలు. ముఖ్యమంత్రి గారు  ఇచ్చిన పథకాలతో నేను బాగా చదువుకోగలుగుతున్నాను. మీరు మాకు ఎంతో భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని చాలా గట్టిగా కోరుతున్నాం. మీరు ఇచ్చే వసతి దీవెన కూడా మాకు వచ్చింది. మా వంటి పేద కుటుంబాలకు చాలా సహాయం లభిస్తోంది. 
– జీవిత, డిగ్రీ విద్యార్థిని, శ్రీకాకుళం

మీ చలవతోనే ఉన్నత చదువు
కాలేజీ యాజమాన్యాలకు నా విజ్ఞప్తి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మంచి ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే విద్యా సంవత్సరం త్రైమాసికం నుంచి తల్లులు నేరుగా వచ్చి చూసి.. ఫీజు చెల్లిస్తారు. కాబట్టి, వారికి సంతృప్తి కలిగేలా మౌలిక సదుపాయాలు మెరుగు పరుచుకోండి.    

ఇంత మంది విద్యార్థుల మనసుల్లో స్థానం సంపాదించుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రారంభిస్తున్నందుకు నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఆర్థిక పరిస్థితులు బాగో లేకపోయినా.. నాకున్న సమస్యల కంటే మీ సమస్యలు పెద్దవి అని భావించి, తల్లిదండ్రులకు ఊరటగా ఇది చేస్తున్నా.
– సీఎం వైఎస్‌ జగన్‌

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో తాము ఉన్నత చదువులు పూర్తి చేస్తామనే నమ్మకం పెరిగిందని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం సూచనలు.. విద్యార్థులు, తల్లిదండ్రుల మనోగతాలు ఇలా ఉన్నాయి. 

మీ పథకాలే మాకు అండ
మీరు ప్రవేశ పెట్టిన పథకాలు మా కుటుంబాలను కాపాడుతున్నాయి. మా అమ్మాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల మేలు జరుగుతుంది. జగనన్న మమ్మల్ని దీవిస్తారులే అని మా అమ్మాయి చెబుతూ ఉంటుంది. మహిళల పట్ల మీకు అమితమైన గౌరవం ఉంది. మీరు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, గోరుముద్ద కూడా చాలా మంచి పథకాలు.    
– పద్మావతి, విద్యార్థిని తల్లి, విశాఖపట్నం

మిగతా రాష్ట్రాలకు ఆదర్శం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇబ్బందులను పాదయాత్రలో మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరు స్పష్టమైన హామీ ఇచ్చారు. కరోనా లాంటి సమయంలో కూడా మీరు ధైర్యం చేసి ఇంత పెద్ద మొత్తాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇస్తున్నారు. విద్యకు మీరు ఇచ్చే ప్రాధాన్యత దీని ద్వారా తెలుస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయక పోవడం వల్ల చాలా కాలేజీలు మూతబడే పరిస్థితి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూపంలో కూడా మీరు కొత్త సంస్కరణలు తీసుకు వస్తున్నారు.     – ఉమాశంకర్‌రెడ్డి, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రతినిధి, గుంటూరు

ఇక మేమూ కలలు కంటాం..
కొత్తవలసలో డిగ్రీ చదువుతున్నాను. విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా నేను లబ్ధి పొందుతున్నాను. నేను కూడా రైతు బిడ్డనే. బడుగు, బలహీన వర్గాల వారు కలలు కనవచ్చు అని మాకు నమ్మకం వచ్చింది. మా బాగు కోరి, తల్లి అకౌంట్‌లో ఈ డబ్బులు వేయడం మంచి ఆలోచన.  ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఎవ్వరూ ప్రశ్నించకపోయినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి విద్యార్థులకు మేలు చేశారు.  ఆరోగ్యం, వ్యవసాయ రంగాలతో పాటు విద్యా రంగానికీ చక్కటి ప్రాధాన్యత ఇస్తున్నారు.    
 – మౌనిక, విద్యార్థిని, కొత్తవలస, విజయనగరం జిల్లా

కాలేజీ వాళ్లతో మాట్లాడే ధైర్యం వచ్చింది
నాకు ఇద్దరు పిల్లలు. పెద బాబు ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. వసతి దీవెన డబ్బులు వచ్చాయి. విద్యా దీవెన డబ్బులు కూడా నా అకౌంట్లో ఇప్పుడు పడతాయి. ఒక తల్లిగా కాలేజీకి వెళ్లి.. మా అబ్బాయి చదువుల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. కాలేజీ వాళ్లతో మాట్లాడే ధైర్యం వచ్చింది. మీరు ముఖ్యమంత్రిగా కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
    – ఫరీదా బేగం, విద్యార్థి తల్లి, చిత్తూరు జిల్లా 

మాకు భరోసా కల్పించారు
వైఎస్సార్‌ బాటలో నడుస్తున్న మీరు విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మాకు భరోసాను ఇస్తున్నాయి. కరోనా లాంటి సమయంలో, ఆర్థిక సంక్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే.. మీరు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం గొప్ప విషయం. విద్యా రంగం అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం.  
  – ప్రియాంక, విద్యార్థిని, కడప

మాకంటే ముందు మీరే స్పందిస్తున్నారు.. 
మా అమ్మ టైలర్‌. అమ్మా, నాన్న కష్టపడితేనే కానీ మాకు పూట గడవదు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాలో ఆనందం నింపింది. గతంలో ఫీజు కింద ప్రభుత్వం కొంత ఇస్తే, మిగతా డబ్బును అప్పు చేసి కట్టే వాళ్లం. దీంతో చాలా ఇబ్బందులు పడే వాళ్లం. వసతి దీవెన, విద్యా దీవెనలతో మాకు చాలా లబ్ధి చేకూరింది. మాకు ఏం కావాలన్నా.. మా కన్నా ముందు మీరే స్పందించి ఇస్తున్నారు.     
– చైతన్య, విద్యార్థిని, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement