నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ | Jagananna Vidya Deevena will release on Friday | Sakshi
Sakshi News home page

నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ

Published Fri, Mar 1 2024 4:49 AM | Last Updated on Fri, Mar 1 2024 7:15 AM

Jagananna Vidya Deevena will release on Friday - Sakshi

పామర్రులో బటన్‌ నొక్కి జమచేయనున్న సీఎం జగన్‌

గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి రూ.708.68 కోట్లు విడుదల

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మందికి లబ్ధి

సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది.

పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది.

ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. 

నేడు పామర్రుకు సీఎం వైఎస్‌ జగన్‌ రాక..
జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్‌ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు.

శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement