కోల్డ్ వార్ !
సాక్షి, గుంటూరు : మద్యం దుకాణాల్లో బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలనే ప్రభుత్వం ఆదేశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య కోల్డ్ వార్‌కు దారితీసింది. మూడు నెలల కిందట జారీ చేసిన ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు, మద్యం దుకాణ నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ఆ శాఖ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో అధికారులు గుంటూరులో శుక్రవారం జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
మద్యం దుకాణంలో బార్‌కోడింగ్ మిషన్‌లు ఏర్పాటు చేయడం వల్ల అమ్మిన ప్రతి సీసాకు కంప్యూటర్ బిల్లు ఇవ్వాలి. తద్వారా ఎమ్మార్పీ ధరలకు అమ్మకాలు జరగడంతోపాటు, ఎంత వ్యాపారం జరిగిందనేది ఎక్సైజ్ శాఖకు పక్కాగా తెలిసిపోతోంది. అంతేకాక బె ల్టుషాపుల్లో మద్యం సీసాలు పట్టుబడితే అవి ఏ దుకాణం నుంచి వచ్చాయనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు.
ఈ నెల 15లోపు బార్‌కోడింగ్ విధానం అమలు చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. దీనిపై మద్యం వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసి సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
వ్యాపారానికి లెసైన్స్ గడువు ఇంకా ఐదు నెలల మాత్రమే ఉన్న సమయంలో రూ. 90 వేలు ఖర్చు చేసి బార్‌కోడింగ్ మిషన్ కొనలేమని నిర్వాహకులు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 15లోగా ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఎక్సైజ్ అధికారులు కరాఖండీగా చెప్పడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌కు తెరలేచింది. ఎక్సైజ్ కమిషనర్, మంత్రిని కలిసి విన్నవిస్తాం... మద్యం వ్యాపారులు
బార్‌కోడింగ్ విధానంపై మద్యం వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. మిగిలిన ఉన్న ఐదు నెలల కాలానికి మిషన్‌లు కొనలేమని చెబుతున్నారు. మొదట్లో కంప్యూటర్, మిషన్‌లు కొనుగోలు చేసుకుంటే సాఫ్ట్‌వేర్ ఇస్తామని చెప్పిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇప్పుడు మిషన్ కూడా తాము చెప్పినచోటే కొనుగోలు చేయాలంటూ మెలిక పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 40 వేలు అయ్యే మిషన్‌ను రూ. 90 వేలు పెట్టి కొనమంటే ఎలాగంటూ వాపోతున్నారు. తమ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎక్సైజ్ కమిషనర్, మంత్రులకు తమ సమస్యను విన్నవించుకుంటామని అంటున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సి వస్తుందనేనా..?
బార్‌కోడింగ్ విధానాన్ని అమలు చేస్తే ఇప్పటి మాదిరిగా అధిక ధరలు అమ్మలేమని, ఎమ్మార్పీ ధరలకు అమ్మాల్సి వస్తుందని మద్యం వ్యాపారులు మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చివరి ఐదు నెలల కాలంలో అధిక ధరలకు అమ్మకపోతే నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
ఓపక్క బెల్టుషాపులపై ఆంక్షలు, మరో వైపు బార్‌కోడింగ్ విధానంతో మద్యం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అధికారపార్టీకి చెందిన మద్యం సిండికేట్‌లు ఈ విషయాన్ని మంత్రుల వద్ద పెట్టి ఈ విధానం అమలు కాకుండా చూడాలని కోరుతున్నట్టు సమాచారం.