పీఏ ద్వారా లంచాలు సేకరిస్తున్నట్టు నిర్ధారణకొచ్చిన ఏసీబీ!
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో మళ్లీ ఏసీబీ కలకలం రేగుతోంది. కమిషనర్ తరువాత అత్యున్నత స్థానంలో ఉన్న ఒక అధికారిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. మూడు నెలలక్రితం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎక్సైజ్ అధికారులు ఓ మద్యం దుకాణంపై దాడి చేసి ఎమ్మార్పీ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. రూ.లక్ష జరిమానా వేసి కేసును మూసేశారు. దీంతో ఆ దుకాణాన్ని తిరిగి తెరిచారు. అయితే ఇదే దుకాణం యజ మానిని స్థానిక ఎక్సైజ్ సీఐ రూ.30 వేలు డిమాండ్ చేశారు.
దీంతో సదరు దుకాణం యజమాని ఎక్సైజ్ సీఐని ఏసీబీకి పట్టించారు. ఏసీబీకి పట్టుబడిన ఎక్సైజ్ సీఐ ఆసక్తికర వివరాలను వెల్లడించినట్లు సమాచారం. ఎమ్మార్పీ కేసును మూసేసినందుకుగాను ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి పేరుతో ఆయన పీఏ రూ.15 వేలు డిమాండ్ చేసినట్లు, ఆ మేరకే తాను మద్యం దుకాణం యజమానిని ఒత్తిడి చేసి.. డబ్బు అడిగానని చెప్పినట్లు తెలిసింది. దీనిపై దర్యాఫ్తు చేసిన అధికారులు మరిన్ని మద్యం దుకాణాలపైనా దృష్టి సారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే సదరు అధికారి ఎమ్మార్పీ కేసులపై దుకాణానికి రూ.15 వేలు చొప్పున తన పీఏ ద్వారా సేకరించినట్లు ఏసీబీ అంచనాకు వచ్చినట్టు తెలిసింది.