
కలెక్టరేట్ ముట్టడి భగ్నం
‘కడప కలెక్టరేట్ ముట్టడి’ భగ్నమైంది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యమించిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చుకెళ్లి తమ ప్రతాపం చూపారు. ఈ ఉదంతంలో పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు స్వల్పంగా గాయపడ్డారు. మొత్తం సంఘటనతో కడప కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది.
- కడప స్పోర్ట్స్
డీవైఎఫ్‌ఐ పిలుపు మేరకు క్రీడా పాఠశాల విద్యార్థులు కడప కలెక్టరేట్‌ను శనివారం ముట్టడించారు. తమ సమస్యలను కలెక్టర్‌తోనైనా చెప్పుకుందామని ఆశించిన వచ్చిన విద్యార్థులు సభా భవనంలో కలెక్టర్ కేవీ రమణను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన ఆ సమయంలో అధికారులతో సమావేశమైనట్లు తెలుసుకున్న విద్యార్థులు అక్కడే బైఠాయించి ‘కలెక్టర్ బయటికి రావాలంటూ’ నినాదాలు చేశారు.
కలెక్టర్‌ను కలిసేందుకు కొంత మంది విద్యార్థులను అనుమతించారు. క్రీడా పాఠశాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కలెక్టర్ నుంచి వచ్చిన సమాధానం విని విద్యార్థులు విస్తుపోయారు. ‘నాకు అంతా తెలుసు. మీరు వెళ్లి బుద్ధిగా చదువుకోండి. అనుమతి లేకుండా పాఠశాల నుంచి తరచూ వచ్చి ఇటువంటి ఆందోళనలకు దిగితే చర్యలు తప్పవని’ కలెక్టర్ తమను హెచ్చరించడంతో విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు.
కలెక్టర్‌ను అడ్డుకునే యత్నం
సభా భవనం నుంచి బయటికి వచ్చిన కలెక్టర్‌ను చుట్టుముట్టేందుకు ఆందోళనకారులు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆందోళనకారులు పట్టువిడవకపోవడంతో చేసేది లేక పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. సంఘటనలో కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు డీవైఎఫ్‌ఐ నాయకులు శివకుమార్, సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయం ఎదుట మళ్లీ బైఠాయించారు.
సూపర్‌వైజర్లపై చర్యకు డిమాండ్
విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడమే గాక వేధింపులకు గురి చేస్తున్న సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు శివకుమార్, భరత్ డిమాండ్ చేశారు. క్రీడా పాఠశాలలో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా విద్యార్థులు సుమారు నాలుగు గంటల వరకు బైఠాయించి నిరసన తెలిపారు.
అంతలోనే అక్కడికి విచ్చేసిన డీఆర్‌ఓ సులోచన ఆందోళనకారులతో సంప్రదించారు. ‘మీరు వెళ్లే సమయానికి అక్కడ హాస్టల్ సూపర్‌వైజర్లు లేకుండా చేస్తామని’ ఆమె ఇచ్చిన హామీతో వారు ఆందోళన విరమించారు.