- ఎన్టీఆర్ జలాశయం సప్లయ్ చానల్ పనులేమయ్యాయి ?
- పనుల జాప్యానికి నిరసనగా రేపు చిత్తూరులో దీక్ష
- మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి
చిత్తూరు (కొంగారెడ్డిపల్లె) న్యూస్‌లైన్: జిల్లాలో హంద్రీ - నీవా పనులు, ఎన్టీఆర్ జలాశయం సప్లయ్ చానల్ పనులు త్వరితగతిన చేపట్టాలని, ఏపీఎస్‌ఐడీసీ కార్యాలయాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి తెలిపారు. చిత్తూరులోని జెడ్పీ కార్యాలయం ఎదుట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష చేస్తానని చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి 20 ఏళ్లు పోరాడి హంద్రీ - నీవా ప్రాజెక్టును రైతులు సాధించుకున్నారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే దాదాపు 1.65 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుందన్నారు. హంద్రీ - నీవా పనులు ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదన్నారు. దీని కంతటికీ రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. పనులు ఆలస్యమవడంతో ప్రభుత్వంపై అధిక భారం పడుతోందన్నారు. కొత్తగా ఇచ్చిన జాబితాల ప్రకారం హంద్రీ - నీవా పనులను జిల్లాలోని గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం తదితర నియోజకవర్గాలకు రద్దు చేయడం దారుణమన్నారు.
ఎన్టీఆర్ జలాశయం సప్లయ్ చానల్ పనులేమయ్యాయి
కలవకుంట వద్దనున్న ఎన్టీఆర్ జలాశయం నుంచి వచ్చే మిగులు జలాల కోసం నిర్మించనున్న సప్లయ్‌చానల్ పనులేమయ్యాయని జ్ఞానేంద్రరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి సప్లయ్ చానల్స్ ఏర్పాటుచేసి పెనుమూరు, గంగాధరనెల్లూరు మండలాల్లోని చెరువులను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. దాదాపు 36 చెరువుల కింద ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే కాకుండా ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చన్నారు. అయితే జలాశయం కింద సప్లయ్ చానల్స్ పనులు చేపట్టేందుకు 10 ఏళ్లుగా టెండర్లు పిలవడం, రద్దు చేయడం పరిపాటి అయిందన్నారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితోనే పనులను రద్దు చేశారన్నారు.
జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఐడీసీ) కార్యాలయాన్ని పునఃప్రారంభించాలని జ్ఞానేంద్రరెడ్డి డిమాండ్ చేశారు.