=తహశీల్దార్లు, ఎంపీడీవోలకు కలెక్టర్ ఆదేశం
=కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : గత రెండు నెలలుగా ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు సూచించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమశాఖల ద్వారా అమలవుతున్న పథకాల లబ్ధిదారుల గుర్తింపు, యూనిట్ల మంజూరు తదితర విషయాలపై సమీక్షించారు.
బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారుల రుణాలు సత్వరమే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల్లో సాధారణ నిధుల వినియోగంలో నిర్ణయించిన లక్ష్యాలు సాధించాలని చెప్పారు. ప్రజాసమస్యలకు సంబంధించి ప్రతి కార్యాలయంలో పెండింగ్ ఫైళ్ల జాబితా తయారు చేసుకుని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలన్నీ పరిష్కరించినట్లు నివేదిక సమర్పించారని ఐకేపీకి సంబంధించి 6,881 అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు డీఆర్డీఏ అధికారులు చెప్పారని, వీటిని పరిశీలించాలని ఆదేశించారు. ప్రజావాణి, మీ-సేవ అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. ఇందిరమ్మ కలలు గ్రామసభల్లో గుర్తించిన ఆర్థికేతర ప్రజాసమస్యలు పరిష్కరించాలన్నారు. ఏడో విడత భూపంపిణీ కోసం 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు.
అర్హులైన లబ్ధిదారులకు భూపంపిణీ కోసం డి-ఫారం పట్టాలు, టైటిల్ డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకం, భూమి అప్పగింత పత్రాలు సిద్ధం చేయాలన్నారు. భూపంపిణీకి భూమి లేకుంటే తహశీల్దార్లు అసైన్డ్ భూములు తమ మండలంలో ఏమీ లేవని ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 45 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సూచించారు.
ఓటర్ల జాబితాల సవరణలపై వ్యక్తిగత శ్రద్ధ...
రాబోయే ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఓటర్ల జాబితాలో సవరణలు జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై తహశీల్దార్లు వ్యక్తిగత శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి పరిరక్షణకు తహశీల్దార్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ నమోదు విషయంలో జిల్లా లక్ష్యసాధన 96 శాతం కాగా దీని కంటే తక్కువగా ఉన్న మండలాల తహశీల్దార్లతో ఆయన సమీక్షించారు. 20 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. జేసీ పి.ఉషాకుమారి మాట్లాడుతూ కంప్యూటర్ అడంగల్స్ డౌన్‌లోడ్ చేసుకుని రెవెన్యూ రికార్డుల నవీకరణ పూర్తి చేయాలన్నారు.
అసైన్డ్, లీజు భూములు, ఎలిమినేటెడ్ భూములు, నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించి జాబి తాలు తయారు చేయాలని చెప్పారు. మీ-సేవ కేంద్రాల తనిఖీలు నిర్వహించి వాటి పనితీరు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఫెన్సింగ్ నిర్మించాలన్నారు. వీ ఆర్వోలకు సర్వీసు రిజిస్టర్లు ప్రారంభించి వారికి ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో విజయచందర్, ఇన్‌చార్జ్ జెడ్పీ సీఈవో కళావతి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు, డీఐవో శర్మ పాల్గొన్నారు.