సీపీఎస్‌ అంతం..మా పంతం | Collectorate siege CPSE policy Teacher | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ అంతం..మా పంతం

Published Sun, Sep 2 2018 9:03 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM

Collectorate siege CPSE policy Teacher  - Sakshi

ఒంగోలు: ఫ్యాప్టో (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంద్రప్రదేశ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సీపీఎస్‌ విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపునకు స్పందించి ఉద్యోగ జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది. మరో వైపు వేలాదిమంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సెలవులు పెట్టుకొని ముట్టడి కార్యక్రమానికి  పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో సివిల్‌ పోలీసులతోపాటు  స్పెషల్‌ పార్టీ పోలీసులు కూడా ప్రకాశం భవనం వద్ద పెద్ద ఎత్తున మొహరించారు. మహిళా ఉపాధ్యాయినులు ఎక్కువగా హాజరుకావడంతో పోలీసులు సైతం ఏం చేయాలో అర్థంకాక ఒక వైపు బ్యారికేడ్లు ఏర్పాటుచేసి ప్రకాశం భవనం ముందు ఉన్న రెండు రోడ్లలో ఒక రోడ్డును పూర్తిగా బ్లాక్‌ చేశారు. దీంతో ఉపాధ్యాయులు చేపట్టిన ముట్టడి కార్యక్రమం విజయవంతం అయింది. 

9 గంటలకే తరలి వచ్చిన ఉపాధ్యాయులు:
ఉద్యోగులు 10 గంటలకల్లా ప్రకాశం భవనంలోకి చేరుకుంటారని, అందుకు అనుగుణంగా 9 గంటలకే పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు చేరుకున్నారు.  ప్రకాశం భవనం రెండు గేట్ల వద్ద బైఠాయించి సీపీఎస్‌ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. పదిగంటలైనా ఒక్క ఉద్యోగి కూడా కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా ప్రకాశం భవనం అన్ని గేట్ల ముందు ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఆందోళనకు ఉద్యోగ జేఏసీ కూడా సంఘీభావం ప్రకటించింది.

 ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మికుల భద్రతకు సవాల్‌గా మారిందన్నారు. పెన్షన్‌ అనేది ప్రభుత్వం భిక్ష కాదని, అది ఉద్యోగుల  సామాజిక హక్కు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల్‌రెడ్డి ఇచ్చిన తీర్పును ఉదహరించారు. కాంగ్రెస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ సీపీఎస్‌ కొనసాగించేందుకు మొగ్గు చూపుతూ ఉద్యోగులను దగా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. 5వ తేదీ చలో పార్లమెంట్‌ కార్యక్రమం ద్వారా సీపీఎస్‌ రద్దుకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు మిక్కిలిగా కదలిరావాలన్నారు.

 22వ తేదీ తరువాత దశలవారీ కార్యాచరణ కూడా ప్రకటిస్తారని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్‌ను రద్దుచేస్తే సరి..లేదంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్‌జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శరత్‌బాబు మాట్లాడుతూ ఎంఎల్‌ఏ, ఎంపీలుగా ఒక్కసారి ఎన్నికైన వారికి జీవితాంతం పెన్షన్, ఆరోగ్య భద్రతతోపాటు అనేక రకాలైన ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుందని, కానీ 30 నుంచి 40 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసులో కొనసాగిన వారికి మాత్రం పెన్షన్‌ ఇవ్వకపోవడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వాలు స్పష్టం చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దుకు ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు అయితే ముందుకు వస్తాయో వారికే భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 

మూడు గంటలపాటు ప్రకాశం భవనం గేట్ల వద్దే బైఠాయింపు:
ప్రాథమిక సమాచారం ప్రకారం 14 వేల మంది ఉపాధ్యాయులకుగాను దాదాపు 5 వేల మందికిపైగా ఉపాధ్యాయులు శనివారం సెలవు పెట్టారు. అందులో దాదాపు మూడు వేలమంది  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. మూడు గంటలు దాటినా ఉపాధ్యాయులు ఆందోళన విరమించకపోవడంతో ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు, టూటౌన్‌ సీఐ సురేష్‌రెడ్డి, రూరల్‌ సీఐ మురళీకృష్ణలు ఫ్యాప్టో నాయకులతో చర్చించారు. ఆందోళన విరమించాలని సూచించారు.

 ఈ క్రమంలో అరెస్టులకైనా సిద్ధమే అని, అంతే తప్ప ఆందోళన విరమించేది లేదంటూ టీచర్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆందోళనలో పాల్గొన్న సగం మంది ఉపాధ్యాయులు చర్చిసెంటర్‌లో మానవహారం  చేపట్టారు. సీపీఎస్‌ వ్యవస్థకు పాడె కట్టడమే తమ లక్ష్యం  అంటూ శవం మాదిరిగా ఒక ఉపాధ్యాయుడ్ని మోస్తూ ప్రదర్శన నిర్వహించారు. సీపీఎస్‌ అంతం ...మా పంతం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో చర్చిసెంటర్‌లో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ క్రమంలో పోలీసుల సూచనతో ఫ్యాప్టో నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరి ఆందోళన విరమించేందుకు ఉపాద్యాయులతో మాట్లాడారు. 

అయితే ఉపాధ్యాయులు ఎక్కువ మంది వారి ప్రతిపాదనను తిరస్కరించారు.  కలెక్టర్‌ వచ్చి తమతో మాట్లాడాలని పట్టుబడితే మరికొంతమంది అయితే మాత్రం సీపీఎస్‌పై స్పష్టమైన హామీ కావాలని, లేదా అరెస్టులకైనా సిద్ధమే అంటూ ప్రకటించారు. ఈ క్రమంలో కొద్దిసేపు వారి మధ్యనే కొంత వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన విరమించేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్టులకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పలువురు నాయకులను అరెస్టుచేసి పోలీసు వాహనంలో స్టేషన్లకు తరలిస్తుండగా పెద్ద ఎత్తున ఉద్యోగులు అడ్డంపడ్డారు. చివరకు పోలీసులు బలవంతంగా పలువురిని టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.  

మా ధర్నా సీసీఎస్‌ రద్దు కోసమే:
ఇదిలా ఉంటే రెండోవిడత మరికొంతమంది నాయకులను అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా మహిళా ఉపాధ్యాయినులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. వారిని బలవంతంగా మహిళా పోలీసులు తొలగించేందుకు చేసిన యత్నం ఫలించలేదు. దీంతో టూటౌన్‌ సీఐ జోక్యం చేసుకుంటూ మహిళా ఉపాధ్యాయినులతో మాట్లాడారు. సీపీఎస్‌ «ఆందోళన ఇందాకే ముగిసింది. ఇప్పుడు మీరు చేస్తున్న ఆందోళన పోలీసులకు వ్యతిరేకంగా అంటూ మండిపడ్డారు. అయితే ఈ సమయంలో మహిళా ఉపాధ్యాయినులు కూడా ఏమాత్రం బెదరకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసుల ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసుల్లో కూడా సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారని, వారి సంక్షేమం కూడా తమకు ముఖ్యమే అంటూ తిరుగు సమాధానం ఇచ్చారు.

దీంతో పోలీసులు నిరసనకారులను తాలూకా పోలీసుస్టేషన్‌కు, అనంతరం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ ధర్నాలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాసరావు, పిల్లి రమణారెడ్డి, ఫ్యాప్టో నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి, రవిచంద్ర, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శీనయ్య, ఏపీటీఎఫ్‌ నాయకులు విజయసారథి, రఘుబాబు, మంజుల, బీటీఏ నాయకులు పర్రె వెంకట్రావు, శరత్‌చంద్ర, స్కూల్‌ అసిస్టెంట్స్‌ యూనియన్‌ నాయకులు శరత్‌బాబు, సాయి, రమణకుమార్, ఎస్‌టీయూ నాయకులు ప్రసాద్, ఎర్రయ్య, హెడ్మాస్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు వై.వెంకట్రావు, తెలుగు పండిట్స్‌ అసోసియేషన్‌ నాయకులు రమేష్, వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ యూనియన్‌ నాయకులు చిరంజీవి, ఏపీటీఎఫ్‌ 1938 నాయకులు కీర్తి, మాధవరెడ్డి, పి.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement