‘హలో..ఏమండీ.. నేను క్యారెట్‌ను. ‘దీన్ని చూస్తే బాగుంటుంది...ధర మండుతుంది. దీంతో మనకెందుకులే అనుకుంటున్నారా..’ అబ్బే అదేం లేదులెండి. పేద, మధ్య తరగతి వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని అందరికీ అందుబాటులోకి వచ్చాను.
కిలో 12 రూపాయలే. నాలో బీటా కెరోటిన్ ఉంది. విటమిన్-ఏ అన్నమాట. కంటిచూపునకు, అందమైన చర్మం, జుట్టురాలకుండా నివారించడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలున్న నన్ను ఇప్పుడైనా ఇంటికి తీసుకెళ్లండి.
నాతో పులుసుకూర, తాళింపు చేసుకోవచ్చు. కీరా, హల్వా, జ్యూస్ చేసి పిల్లలకు ఇవ్వొచ్చు. పచ్చిగా తిన్నా తియ్యగా రుచిగానే ఉంటా. నా సోదరుడు బీట్‌రూట్‌నే తీసుకుంటే గుండెకు ఎంతో మంచిది. రక్తశుద్ధికి మరీ మంచిది.. మంచి శక్తిని ఇస్తుంది.. ఇంకో సోదరుడు బంగళాదుంప సంగతి చెప్పనక్కర్లేదనుకుంటా.. వాడిలో పిండి పదార్థాలు ఉంటాయి. ఏ విటమిన్‌ను కూడా ఇస్తాడు.. వాడితో తాళింపుతో పాటు చిప్స్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు సమీప బంధువులైన టమోటా, చిక్కుళ్లు, కొత్తిమీర కూడా భలే మేలు చేస్తాయి... మీ ఆరోగ్యమే మాకు మహా భాగ్యం..
నేడే మా ఇంటికి.. అదే మార్కెట్‌కు రండి.. మీ ఇంటికి తీసుకెళ్లండి.. హాయిగా వండుకుతినండి.. పది కాలాలపాటు జీవించండి...వస్తారు కదూ...
సాక్షి, కడప: ‘పచ్చగా నిగనిగలాడుతుంటాయి.. బీన్స్.. ఎంతబాగుంటాయో ... పదిరోజుల కిందట కిలో రూ. 30 ఉండొచ్చు.. ఇప్పుడు కిలో 8 రూపాయలే! నాలోని విత్తనాల్లో ‘ప్లాంట్ ఈస్ట్రోజన్’ ఉంది. ఇది ఆడవాళ్లకు రుతుచక్ర సంబంధ వ్యాధులను నివారిస్తుంది. ప్రొటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. మాంసకృత్తులు బోలెడు. మరి ఆలస్యం దేనికి.. రెండు కిలోలు తీసుకెళ్లండి. ఇదేంటి... మొన్నటి వరకూ తీసుకుందామని చేయిపెడితే భగ్గుమని మండిపోయి తగలకుండా చేసిన కూరగాయలు ఇంత బతిమలాడుతున్నాయి అనుకుంటున్నారా.. మొన్నటి వరకు వాటి టైం... ధనవంతుల ఇళ్లకు మినహా సామాన్యుల వద్దకు రానన్నాయి.. కాలం మారింది...మన టైం వచ్చింది. వాటిలోనూ మార్పు వచ్చింది. ఎంతో పోషక‘విలువ’లున్నవి కూడా పేదల ఇళ్లలోకి వచ్చి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సమష్టి నిర్ణయం తీసుకున్నాయి. అందుకే వాటి ధరలను తగ్గించుకుని మార్కెట్లో అందరినీ ఆహ్వానిస్తున్నాయి. వాటి ఉపయోగం చెప్పి ‘నన్ను వాడుకోండి...వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ’ అంటూ బతిమలాడుతున్నాయి. మనం కూడా తప్పక తీసుకోవాలి కదా.. వాటి కోసం కాదు..మన ఆరోగ్యం కోసం..
బీట్‌రూట్: కిలో రూ. 12.:
ఇందులో యాంటోసైనిన్ అనే పోషకవిలువలు ఉన్నాయి. చర్మరక్షణకు ఎంతో ఉపయోగం. గుండెకు మంచిది. రక్తశుద్ధికీ మంచిదే! పీచుపదార్థం ఉండటం వల్ల పేగుల శుభ్రతకు ఉపయోగపడుతుంది. మంచి శక్తిని ఇస్తుంది. కూరలు, తాళింపులతో పాటు మిఠాయిలు, హల్వా చేసుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలామంచిది.
టమోటా: కిలో రూ. 2
ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. శరీరరక్షణకు ఉపయోగం. ఫైట్ న్యూట్రిన్స్ కూడా ఉంటాయి. ఎండ నుంచి ఇంటికి వచ్చినపుడు ఒకగ్లాస్ టమోటా జ్యూస్ తాగి చూడండి.. ఎంత రిలీఫ్ ఉంటుందో.. మొన్నటి వరకూ ఏడిపించిన టమోటాలు ఇప్పుడు నవ్విస్తున్నాయి.
కాకర: కిలో రూ. 8
ఔషధ విలువలు కల్గిన కూరగాయలు. వీటిని తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం. జీర్ణక్రియకు కూడా బాగా దోహదపడుతుంది. తాళింపుతో పాటు చిప్స్ కూడా చేసుకోవచ్చు.
బంగళాదుంపలు : కిలో రూ. 12
అధికంగా పిండిపదార్థాలు ఉంటాయి. ‘ఏ’ విటమిన్ ఉంటుంది. కంటి చూపునకు మంచిది. మంచి శక్తినిచ్చే ఆహారం. వీటిని ఎంత తింటే కండపుష్టి అంత బాగుంటుంది. పులసుకూరతో పాటు ఆలుబజ్జీ, తాళింపుతో పాటు పలురకాల చిప్స్ చేసుకోవచ్చు.
చిక్కుళ్లు: కిలో రూ. 8 ర
ఇందులో మాంసపుకృత్తుల శాతం అధికం. చిక్కుడు గింజలు తింటే ఆరోగ్యానికి మంచిది. బీన్స్ తినడం వల్ల ఎంత ఉపయోగమో చిక్కుడు వల్ల కూడా అంతే ఉపయోగం.
క్యాప్సికం: కిలో రూ. 12
ఇందులో విటమిన్ ‘సీ’ ఉంది. క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థతో పాటు చిగుళ్ల గట్టితనానికి దోహదపడుతుంది.
క్యాలిఫ్లవర్: ఒక్కటి రూ. 10
రుచికరమైన ఆహారం. ఇందులో యాంటీసైనిన్ ఉంటుంది. చర్మరక్షణకు, గుండెకు మంచి చేస్తుంది. పీచుపదార్థం కావడంతో పేగులను శుభ్రపరుస్తుంది. పులుసుకూరతో పాటు తాళింపు, వేపుడు, గోబి మంజూరియా చేసుకోవచ్చు.
ఉల్లి
ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదంటారు. ఉల్లిపాయ అనేక గుణాలను కలిగి ఉంటుంది. బలాన్ని కలుగ జేస్తుంది. రుచిని కలిగిస్తుంది. శుక్రవృద్ధిని చేస్తుంది. మంచినిద్ర వచ్చేటట్లు చేస్తుంది.
కాయగూరలతోనే ఆరోగ్యం
కాయగూరలతోనే మంచి ఆరోగ్యం. మొన్నటి వరకూ విపరీతమైన ధరలు ఉండటంతో చాలామంది మంచికూరలు చేసుకోలేకపోయారు. ఇప్పుడు ధరలు బాగా తగ్గాయి. అందరికీ అందుబాటులోకి వచ్చాయి. వీలైనంత వరకూ కూరలు వాడాలి. పప్పులో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండాలి. కూరగాయలన్నిటిలో పీచుపదార్థాలు ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పిల్లలు తినేలా చూడాలి. కూరలు తినకపోతే చిప్స్, కీరా, హల్వా, జ్యూస్ చేసి అందించాలి
స్వర్ణలత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త. కృషి విజ్ఞాన కేంద్రం.
రండి... కొనండి.. తినండి..
Published Sat, Jan 25 2014 3:34 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
Advertisement
Advertisement