సాక్షి, నల్లగొండ : కేజీబీవీల్లో అక్రమ నియామకాలు... బాలికల పట్ల వేధింపులకు పాల్పడుతున్న వైనంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ఆర్వీఎం పీఓ బాబు భూక్యా పొంతనలేని వివరణ ఇచ్చారు. ‘కేజీబీవీల్లో వెలుగుచూడని ఉదంతాలెన్నో?’ శీర్షికన ఈ నెల 11వ తేదీన సాక్షి ప్రచురించిన కథనంలో విద్యార్థుల సంఖ్య మినహా, మిగిలిన సమాచారమంతా అక్షర సత్యాలే. ఇదే వివరణ ప్రతులనూ ఆయన కలెక్టర్‌కూ పంపారు. పీఓ వివరణను ఓసారి పరిశీలిస్తే.....
పీఓ : బడిబయటి బాలికలను కేజీబీవీలో చేర్పించడంలో కృషి చేసినందుకుగాను.. గతంలో అర్వపల్లిలో పనిచేసిన ఎస్‌ఓ (ప్రత్యేకాధికారి) ఓ అకౌంటెంట్‌ని నియమించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. ఇందులో జిల్లా అధికారులకు ఎలాంటి ప్రమేయం లేదు.
సాక్షి : ప్రత్యేక అధికారికి ఓ వ్యక్తిని స్వతంత్రంగా విధుల్లోకి తీసుకునే అధికారం ఉందా? ఇలా నిబంధనలు ఉన్నాయా? ఉన్నతాధికారులకు చెప్పకుండా ఇటువంటి నిర్ణయం తీసుకునే ధైర్యం ఆయన చేశారా? ఇలా ఇంకెంతమందిని తీసుకున్నారు? ఏ ప్రాతిపదికన పోస్టింగ్ ఇచ్చారు? ఇది తెలిసి ఉన్నతాధికారులు ఏం జేశారు? పోని తెలియదనుకుంటే... మరి 2008 డిసెంబర్ నుంచి సదరు అకౌంటెంట్‌కు వేతనం ఎలా చెల్లిస్తూ వస్తున్నారు?.. ఒకవేళ అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నా రిక్రూట్‌మెంట్ కమిటీ కన్వీనర్, మెంబర్ హోదాలో సపోర్టింగ్ ఆర్డర్ ఇచ్చేది కూడా పీఓనే కదా!. అంతేగాక అభ్యర్థుల నియామకం కోసం ఏజె న్సీకి బాధ్యత అప్పగించేది కూడా ఆయనే.
పీఓ : ‘ఓ కేజీబీవీలో ఓ ఉన్నతాధికారి బంధువే అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను స్థానికేతరుడు. వరంగల్ జిల్లాకు చెందినవాడు’ అని సాక్షి పేర్కొంది. ‘అవాస్తవం. ఎవరికి ఎవరు రక్త సంబంధీకులు కారు.. అని పీఓ వివరణ.సాక్షి : అకౌంటెంట్, సోషల్ సీఆర్‌టీ భార్యాభర్త. వీరిద్దరూ ఓ ఉన్నతాధికారికి బంధువులు. స్థానికేతరులు. వీరు స్థానికులు కాదనడానికి ‘సాక్షి’ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి.
పీఓ : బాలికల విద్యాలయంలో పురుష అభ్యర్థులు ఉండవద్దని అవుట్ సోర్సింగ్ అకౌంటెంట్లను ఈఏడాది జూలైలో తొలగించాం. వారు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. అయినా వారిని విధుల నుంచి తొలగిస్తున్నాం. గత ఆగస్టు నెల నుంచి వేతనాలు చెల్లించడం లేదు.
సాక్షి : వాస్తవంగా పురుష అకౌంటెంట్లను తొలగించాలని 2012లోనే ఉత్తర్వులు వచ్చాయి. ఈక్రమంలో అకౌంటెంట్లను అప్పుడే తొలగించాల్సి ఉంది. కానీ ఆర్వీఎం అధికారులు దీన్ని పెడచెవిన పెట్టారు. తిరిగి ఈ ఏడాది జూన్ 20వ తేదీన ఎస్‌పీడీ నుంచి సర్క్యులర్ జారీ అయ్యింది. కచ్చితంగా వారిని తొలగించాలని దీని సారాంశం. అప్పుడు మేల్కొన్న అధికారులు తప్పించే యత్నం చేశారు. ఈ క్రమంలో వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయినా తొలగిస్తున్నామని పీఓ చెబుతున్నారు.. కానీ రెండు రోజులుగా అకౌంటెంట్లు విధులకు హాజరుకావడం గమనార్హం. అయితే ఇంతవరకు వారికి వేతనాలు నిలిపివేసిన దాఖలాలు లేవు. బడ్జెట్ రాకపోవడంతో కేజీబీవీ సిబ్బందికి మొత్తం వేతనాలు అందలేదు.
పీఓ : కేజీబీవీల్లో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనలు ఏ పాఠశాలలో చోటుచేసుకోవడం లేదు. అర్వపల్లి ఘటనపై విచారణ చేశాం. ఆ వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటనను అన్ని పాఠశాలలకు ఆపాదించడం సరికాదు. సాక్షి : తుంగతుర్తి ఘటన అధికారులకు తెలియనట్లుంది. గతంలో అక్కడ బాలికల పట్ల అకౌంటెంట్ ప్రవర్తన సక్రమంగా లేకుంటేనే విధుల నుంచి తొలగించారు. తాజాగా అర్వపల్లిలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం బయటకు పొక్కింది కాబట్టి.. చర్యలు తీసుకున్నారు.
పీఓ : మఠంపల్లి కేజీబీవీ ఆర్వీఎం పరిధిలో లేదు
సాక్షి : తన పరిధిలో ఏ మండలాల్లో కేజీబీవీలు ఉన్నాయో ఆర్వీఎం అధికారులకు తెలియకపోవడం గమనార్హం. పీఓ తన వివరణలో చెప్పినట్లు.. మఠంపల్లి కేజీబీవీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ పరిధిలో లేదు. ఆర్వీఎం పరిధికి సంబంధించినదే.
పీఓ : ‘సదరు అకౌంటెంట్ భార్య అదే కేజీబీవీలో గతేడాది గెస్ట్ టీచర్‌గా పనిచేసింది. ఈ ఏడాది ఆమెను అక్కడే సీఆర్‌టీగా నియమించారు. అది కూడా నోటిఫికేషన్ సమయంలో అక్కడ ఖాళీ పోస్టు చూపించకుండా’ అని కథనంలో సాక్షి పేర్కొనగా.. అవాస్తవం అని పీఓ వివరణ ఇచ్చారు.
సాక్షి : కేజీబీవీలో నోటిఫికేషన్ ద్వారానే సోషల్ సీఆర్‌టీని నియమించినట్లు ఎటువంటి ఆధారమూ చూపించలేకపోయారు. అంతేగాక మాజీసైనికుల కోటా కింద ఆమెను సీఆర్‌టీగా నియమించడం గమనార్హం. ఈ మేరకు ఆర్వీఎం పీఓ నుంచి ధ్రువపత్రం కూడా జారీకావడం విశేషం. అందులో స్థానికురాలుగా పేర్కొన్నారు. వాస్తవంగా వరంగల్ జిల్లాకు చె ందిన ఆమెది వ్యవసాయ కుటుంబం. 2012-13 ఏడాదిలో సీఆర్‌టీగా అపాయింట్‌మెంట్ ఇవ్వగా.... సదరు వ్యక్తి తిరుమలగిరి కేజీబీవీలో ఈ ఏడాది 13 ఏప్రిల్‌లో విధుల్లో చేరారు. మరోపక్క 2012-13లో సీఆర్‌టీగా పనిచేశానని, తిరిగి ఈ ఏడాది కూడా కొనసాగించాలని, ఇంకోసారి సీఆర్‌టీగా సెలక్టయ్యాను, విధుల్లో చేర్చుకోవాలని ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన వేర్వేరు లేఖలు రాసి సదరు కేజీబీవీ ఎస్‌ఓకి ఇచ్చారు. అంతేగాక విధుల్లో చేరిన తే దీని హాజరు రిజిస్టర్‌లోనూ దిద్దారు. ఇలా పొంతన లేని లేఖలు రాయడం, తేదీ మార్చడం అక్రమ నియామకాలేనని స్పష్టం చేస్తోంది.
మసిపూసి...మారేడు కాయ
Published Sat, Sep 14 2013 2:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement