ఉమ్మడి రాజధానిగా జీహెచ్‌ఎంసీ? | Common capital in GHMC limits? | Sakshi
Sakshi News home page

ఉమ్మడి రాజధానిగా జీహెచ్‌ఎంసీ?

Published Thu, Nov 21 2013 1:27 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఉమ్మడి రాజధానిగా జీహెచ్‌ఎంసీ? - Sakshi

ఉమ్మడి రాజధానిగా జీహెచ్‌ఎంసీ?

  • శాంతిభద్రతలు గవర్నర్ చేతికి.. జీవోఎం నివేదికలో సిఫారసులు
  •  ఆంటోనీ నివాసంలో అర్ధరాత్రి భేటీలో కాంగ్రెస్ పెద్దల ఖరారు
  •  రెండు రాష్ట్రాల్లోనూ ‘371డీ’ కొనసాగింపు 
  •  జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపిణీ
  •  సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి ప్యాకేజీలు 
  •  సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థల ఏర్పాటు..
  • ‘భద్రాచలం, రాయల తెలంగాణల’పై అసెంబ్లీ అభిప్రాయం ప్రకారం ముందుకు
  •  
     న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన జీవోఎం.. జీహెచ్‌ఎంసీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్‌కు అప్పగించాలని కూడా జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్ర మంత్రుల బృందం నివేదికకు, విభజన బిల్లు ముసాయిదాను కూడా బుధవారం రాత్రి రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నివాసంలో జరిగిన సమావేశంలో తుది రూపమిచ్చారు. జీవోఎం సభ్యుడు ఆంటోనీతో మరో సభ్యుడు జైరాం రమేశ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు సమావేశమై అర్ధరాత్రి దాటేవరకూ నివేదికపై చర్చించారు. పది పేజీలతో రూపొందించిన నివేదికలో పలు అంశాలను చేర్చారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అందులో కీలకమైన అంశాలపై పలు సిఫారసులను చేర్చారు. గురువారం సోనియాగాంధీని కలిసి ఆమె సూచనల మేరకు ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదికను కేబినెట్‌కు సమర్పిస్తారు. ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించిన మేరకు జీవోఎం నివేదికలో పొందు పరిచిన ముఖ్యాంశాలివీ... 
     
    •  - హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర నేతల డిమాండ్‌ను తిరస్కరించారు. 
    •  - జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉమ్మడి రాజధాని చేస్తూ, శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగిస్తారు. 
    •  - విభజన బిల్లుతో పాటే ఆర్టికల్ 371డీని కూడా పార్లమెంటులో సాధారణ మెజారిటీతో సవరించవచ్చని, దానిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించవచ్చని జీవోఎం పేర్కొంది. ‘ఈ 371డీ ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది’ అని నివేదికలో చేర్చారు. 
    •  - తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఎదురవుతుందన్న వాదనలను జీవోఎం కొట్టివేసింది. అలాంటిదేమీ ఉండదని, రాబోయే 25 నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయని, అందులో తెలంగాణకు 56 శాతం, సీమాంధ్రకు 44 శాతం విద్యుత్ సరఫరా అయ్యేట్లు జెన్‌కో సహా ప్రయివేటు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు విద్యుత్ కొరత ఉండదని పేర్కొంది. 
    •  - జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాలని జీవోఎం సిఫారసు చేసింది.  
    •  - వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచిత ప్యాకేజీలు ప్రకటించాలని చెప్పింది. 
    •  - సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. 
    •  - సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్రీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. 
    •  - భద్రాచలం, రాయల తెలంగాణ అంశాలపై సస్పెన్స్‌ను జీవోఎం కొనసాగించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement