యూటీ చేయకుండా ఉమ్మడి రాజధాని సాధ్యమే: జైపాల్‌రెడ్డి
యూటీ చేయకుండా ఉమ్మడి రాజధాని సాధ్యమే: జైపాల్‌రెడ్డి
Published Mon, Nov 18 2013 2:37 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
కేంద్రపాలిత ప్రాంతంగా మార్చకుండానే హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయడం సాధ్యమేనని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పారు. కేంద్రం కూడా ఇదే నమ్మకంతో ఉందన్నారు. ఒకవేళ అలాంటి వెసులుబాటు లేకపోతే పార్లమెంటులో కొత్త చట్టం తెస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, జాతీయస్థాయిలో విభజనకు అపూర్వ మద్దతు ఉందని అన్నారు. రాష్ట్ర విభజన విషయమై కేంద్రం ప్రస్తావించిన 11 అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ నేతల తరఫున తమ అభిప్రాయాలను జీవోఎంకు వివరిస్తామని తెలిపారు. ఈ మేరకు అందరి అభిప్రాయాలతో దాదాపు ఉమ్మడిగా నివేదిక రూపొందించామన్నారు. ఆదివారం కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో అందుబాటులో ఉన్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో ఏది సాధ్యం? ఏది అసాధ్యం? ఏది న్యాయం? ఏది అన్యాయమనే అంశాలపై చర్చించి నివేదిక తయారు చేసినట్లు తెలిపారు.
ఇందులో కేంద్రానికి నిర్మాణాత్మక సూచనలు చేశామన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నివేదికలోని అంశాలకు, తామిచ్చే నివేదికకు పెద్దగా వ్యత్యాసమేమీ లేదన్నారు. జీవోఎం అభిప్రాయాల సేకరణ అనంతరం విభజన బంతి ప్రభుత్వ పరిధిలోకి వెళుతుందని, విభజన నిర్ణయం పార్లమెంటు పరిధిలోనిదే తప్ప ప్రభుత్వానిది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపైనే జీవోఎం అందరి అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విభజన బిల్లు ఆమోదం పొందేవరకు ఇలాగే వ్యవహరిస్తారని, ఆ తరువాత తమతో స్నేహపూర్వకంగానే ఉంటారని చెప్పారు.
బాబుది పలాయనవాదం
తొమ్మిదేళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు సమన్యాయం అంటే ఏమిటని తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తిరిగి తననే ప్రశ్నించడం పలాయనవాదమే అవుతుందన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారనేది కేంద్ర డాక్యుమెంట్‌లో ఉంటుందని తెలిపారు. సీమాంధ్ర నేతలు ఏయే వేషాలు వేస్తున్నారో అక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. రాష్ట్రాల విభజన విషయంలో ఆర్టికల్ (3) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పార్టీలకు చేసిన విజ్ఞప్తిని మీడియా ప్రస్తావించగా.. ‘రాజ్యాంగాన్నే తిరిగి రూపొందించాలనే గొప్ప మేధావులు వీళ్లు. అందరూ అభినవ అంబేద్కర్‌లు అయితే కష్టం. ఒక్క అంబేద్కర్‌తోనే ఇలా ప్రభావం ఉంది. ఇంతమంది అంబేద్కర్‌లు అయితే ఎలా పోతాం మనం?’’అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను కించపర్చినట్లుగా ఉన్నాయనే భావన కలుగుతోందని పొంగులేటి చెప్పడంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక్కరే ఉన్నారని, ఆయన అసాధారణ మేధావి అని, రాజ్యాంగాన్ని మార్చాలంటూ అందరూ అంబేద్కర్‌లా మారితే గందరగోళంగా మారుతుందన్నదే తమ ఉద్దేశమని జైపాల్‌రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జీవోఎంకు ఎంఐఎం ఇచ్చిన నివేదికతో స్థూలంగా అంగీకరిస్తున్నామని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానంలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అనే పదం లేనప్పటికీ కేబినెట్ నోట్‌లో మాత్రం ఈ ప్రస్తావన ఉందన్నారు. తాము రాయల తెలంగాణ కోరుకోవడం లేదని తెలిపారు. సీఎం పదవి కోసం తాము పోటీపడుతున్నామని జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదమని జానారెడ్డి పేర్కొన్నారు. మా అందరి లక్ష్యం తెలంగాణ ఏర్పాటేనని, సీఎం ఎవరో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.
Advertisement
Advertisement