- విభజన బిల్లుకు ఎంఐఎం 15 సవరణలు
తాత్కాలిక రాజధానిగా రెండేళ్లు చాలు: ఎంఐఎం
Published Sat, Jan 11 2014 1:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
రాష్ట్ర విభజన అనంతరం మిగిలిపోయే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులోనే పొందుపరచాలంటూ ఎంఐఎం శాసనసభ్యులు బిల్లుకు సవరణ ప్రతిపాదించారు కోరారు. ఖైరతాబాద్ రెవెన్యూ మండల పరిధినే తాత్కాలిక రాజధానిగా పేర్కొనాలని సూచించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆధ్వర్యంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు మొత్తం 15 సవరణలను ప్రతిపాదిస్తూ శాసనసభ స్పీకర్‌కు లేఖను సమర్పించారు. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటుకు ఈ ఏడాది రానున్న నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014’గా మార్చాలని సూచించారు.
విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే తెలంగాణకు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని, హైదరాబాద్ శాంతిభద్రతల అంశంతో పాటు 8వ క్లాజులోని 1, 2, 3, 4 అంశాలను రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న హైకోర్టు న్యాయమూర్తులను స్థానికత ఆధారంగా తెలంగాణ, మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నియమించాలనే అంశాలను చేర్చాలని కూడా సవరణలను పొందుపర్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బార్‌కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న వారంతా రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో కొనసాగాలనే విషయంలో వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు.
Advertisement
Advertisement