మూటగట్టుకున్నారు..పరిహారాన్నీ! | Compensations Are In Back Door | Sakshi
Sakshi News home page

మూటగట్టుకున్నారు..పరిహారాన్నీ!

Published Mon, Dec 3 2018 3:06 PM | Last Updated on Mon, Dec 3 2018 3:06 PM

Compensations Are In Back Door - Sakshi

పెదకడిమిలో మొక్కజొన్న సాగు పేరుతో పరిహారం చేసుకున్న ఆయిల్‌పామ్‌ తోట

పెదవేగి రూరల్‌: మద్దతు ధర లేక విలవిల్లాడిన రైతుకు దక్కాల్సిన పరిహారాన్ని అక్రమార్కులు మెక్కేశారు. రూ.కోట్లు పక్కదారి పట్టించారు. అధికారులు వంతపాడడంతో చాలామంది అర్హులకు  అన్యాయం జరిగింది. ఒక్కరూపాయి పరిహారం అందలేదు.  ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న ధర వ్యత్యాస పథకం అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పెదవేగి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఇతర మండలాల్లో ఈ సాగు ఎక్కువగా జరుగుతోంది. ఆయా మండలాల్లో సాగుద్వారా 30,80,870 క్వింటాళ్లు మొక్కజొన్న ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాగులో నాలుగోవంతు జిల్లాలోనే జరుగుతోంది. ఇతర పంటల్లో ఎదురవుతున్న ఒడిదుడుకుల నేపథ్యంలో రైతులు ఈ సాగుపై మక్కువ చూపడంతో ఒక్కసారిగా సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడీ బాగా వచ్చింది. 37లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది.
 
అసలేం జరిగిందంటే..
గతేడాది రబీ సీజన్‌లో అంచనాలకు మించి రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఫలితంగా ఉత్పత్తి భారీగా వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ ధర లభించింది. క్వింటాకు ప్రభుత్వం రూ. 1,425గా ప్రకటించినా గతేడాది రైతులకు దక్కింది మాత్రం రూ.1,000 నుంచి రూ.1100 మాత్రమే. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం రైతుల కోరిక మేరకు ధర వ్యత్యాస పథకం ద్వారా క్వింటాకు రూ.200 వంతున సొమ్ము మంజూరు చేసింది. ఈ విధంగా జిల్లాలోని రైతులకు రూ.61.61 కోట్లు మంజూరయ్యాయి.  దీనిని అక్రమార్కులు అవకాశంగా మలుచుకున్నారు. పరిహారం పంపిణీలో జోక్యం చేసుకున్నారు. మొక్కజొన్న సాగు చేయని వారూ  పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అధికారులు వంతపాడటంతో అనర్హుల ఖాతాల్లోకి సొమ్ములు చేరాయి. అర్హులకు అన్యాయం జరిగింది.
 
బయటపడింది ఇలా..    
పెదవేగి మండలంలోని కొప్పాక, అంకన్నగూడెం, పెదకడిమి, అమ్మపాలెం పరిధిలో రైతులకు రూ. కోటి 36 లక్షల 49 వేలు మంజూరు కాగా అందులో 50 శాతం అనర్హులే సొమ్ము చేసుకున్నారు.  అసలు సాగు చేసిన వారికి పరిహారం రాకపోగా ఇతర పంటలు వేసి పక్క రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ కావడంతో  కడుపుమండిన పలువురు రైతులు మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సొమ్ము పక్కదారి పట్టిన పెదకడిమి గ్రామంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవాలు తెలుసుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే అక్రమాలు జరిగినట్టు సమాచారం.

అనర్హులకు ఇచ్చేశారు
గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా ధర లేకపోవడంతో వ్యత్యాస పథకంలో డబ్బులు ఇస్తున్నారంటే అందరితోపాటు కాగితాలను వ్యవసాయశాఖ సిబ్బందికి ఇచ్చాను.  ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున రావాల్సి ఉండగా, నాకు డబ్బు రానివ్వకుండా అనర్హులైన ఆయిల్‌పామ్, జామ పంటలు సాగు చేసిన రైతులకు డబ్బు రావడం దారుణం. – బాల నాగవరప్రసాద్, రైతు, పెదకడిమి

అన్యాయంగా దోచేశారు
ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.200 చెల్లిస్తామని ప్రకటించింది.  గ్రామ నాయకులు, అగ్రికల్చర్‌ అధికారులు 60–70 పేర్లు అన్యాయంగా తిసేశారు. మొత్తం సొమ్మును గ్రామంలో కొందరు నాయకులు తినేశారు. ఆయిల్‌పామ్, జామ పంట పేరుతో మాకు 5 ఎకరాల పొలం ఉంటే.. మేం దరఖాస్తు చేయకపోయినా.. మా పొలాల సర్వేనంబర్లతో గ్రామానికి చెందిన  మండవ ప్రసాద్, చళ్ళగొళ్ల గోపాలస్వామి మాకు తెలియకుండా సొమ్ము తీసుకున్నారు.   – పర్వతనేని నాగయ్య, రైతు, పెదకడిమి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement