Support pricing
-
మూటగట్టుకున్నారు..పరిహారాన్నీ!
పెదవేగి రూరల్: మద్దతు ధర లేక విలవిల్లాడిన రైతుకు దక్కాల్సిన పరిహారాన్ని అక్రమార్కులు మెక్కేశారు. రూ.కోట్లు పక్కదారి పట్టించారు. అధికారులు వంతపాడడంతో చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ఒక్కరూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న ధర వ్యత్యాస పథకం అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పెదవేగి, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఇతర మండలాల్లో ఈ సాగు ఎక్కువగా జరుగుతోంది. ఆయా మండలాల్లో సాగుద్వారా 30,80,870 క్వింటాళ్లు మొక్కజొన్న ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సాగులో నాలుగోవంతు జిల్లాలోనే జరుగుతోంది. ఇతర పంటల్లో ఎదురవుతున్న ఒడిదుడుకుల నేపథ్యంలో రైతులు ఈ సాగుపై మక్కువ చూపడంతో ఒక్కసారిగా సాగు విస్తీర్ణం పెరిగింది. దిగుబడీ బాగా వచ్చింది. 37లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. అసలేం జరిగిందంటే.. గతేడాది రబీ సీజన్లో అంచనాలకు మించి రైతులు మొక్కజొన్న సాగుచేశారు. ఫలితంగా ఉత్పత్తి భారీగా వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ ధర లభించింది. క్వింటాకు ప్రభుత్వం రూ. 1,425గా ప్రకటించినా గతేడాది రైతులకు దక్కింది మాత్రం రూ.1,000 నుంచి రూ.1100 మాత్రమే. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం రైతుల కోరిక మేరకు ధర వ్యత్యాస పథకం ద్వారా క్వింటాకు రూ.200 వంతున సొమ్ము మంజూరు చేసింది. ఈ విధంగా జిల్లాలోని రైతులకు రూ.61.61 కోట్లు మంజూరయ్యాయి. దీనిని అక్రమార్కులు అవకాశంగా మలుచుకున్నారు. పరిహారం పంపిణీలో జోక్యం చేసుకున్నారు. మొక్కజొన్న సాగు చేయని వారూ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అధికారులు వంతపాడటంతో అనర్హుల ఖాతాల్లోకి సొమ్ములు చేరాయి. అర్హులకు అన్యాయం జరిగింది. బయటపడింది ఇలా.. పెదవేగి మండలంలోని కొప్పాక, అంకన్నగూడెం, పెదకడిమి, అమ్మపాలెం పరిధిలో రైతులకు రూ. కోటి 36 లక్షల 49 వేలు మంజూరు కాగా అందులో 50 శాతం అనర్హులే సొమ్ము చేసుకున్నారు. అసలు సాగు చేసిన వారికి పరిహారం రాకపోగా ఇతర పంటలు వేసి పక్క రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ కావడంతో కడుపుమండిన పలువురు రైతులు మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సొమ్ము పక్కదారి పట్టిన పెదకడిమి గ్రామంలో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. వాస్తవాలు తెలుసుకున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే అక్రమాలు జరిగినట్టు సమాచారం. అనర్హులకు ఇచ్చేశారు గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా ధర లేకపోవడంతో వ్యత్యాస పథకంలో డబ్బులు ఇస్తున్నారంటే అందరితోపాటు కాగితాలను వ్యవసాయశాఖ సిబ్బందికి ఇచ్చాను. ప్రతి రైతుకు రూ.20 వేలు చొప్పున రావాల్సి ఉండగా, నాకు డబ్బు రానివ్వకుండా అనర్హులైన ఆయిల్‌పామ్, జామ పంటలు సాగు చేసిన రైతులకు డబ్బు రావడం దారుణం. – బాల నాగవరప్రసాద్, రైతు, పెదకడిమి అన్యాయంగా దోచేశారు ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.200 చెల్లిస్తామని ప్రకటించింది. గ్రామ నాయకులు, అగ్రికల్చర్ అధికారులు 60–70 పేర్లు అన్యాయంగా తిసేశారు. మొత్తం సొమ్మును గ్రామంలో కొందరు నాయకులు తినేశారు. ఆయిల్‌పామ్, జామ పంట పేరుతో మాకు 5 ఎకరాల పొలం ఉంటే.. మేం దరఖాస్తు చేయకపోయినా.. మా పొలాల సర్వేనంబర్లతో గ్రామానికి చెందిన మండవ ప్రసాద్, చళ్ళగొళ్ల గోపాలస్వామి మాకు తెలియకుండా సొమ్ము తీసుకున్నారు. – పర్వతనేని నాగయ్య, రైతు, పెదకడిమి -
మద్దతు ధరలా.. గిట్టుబాటు ధరలా?
పొలాల్లో నాగలి వెనుక నడిచి, నాగటి చాళ్ళల్లో పైరులా ఎదిగి, దేశానికి తిండిపెట్టే రైతు అప్పుల పాలై తిండికోసం ప్రభుత్వాల వైపు మోర ఎత్తుకొనే దుస్ధితికి నెట్టబడ్డాడు. పంట రాశులమీదుగా వ్యాపా రులు పదిమెట్లు పైకి ఎక్కితే అదే రాశుల మీద నుంచి పది మెట్లు క్రిందికి జారిపడి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ‘జైకిసాన్’ అంటూ తిరగాల్సిన రైతు నేడు తలను ఉరికి బిగించుకుంటు న్నాడు. పురుగుమందుల్ని పెరుగన్నంలా తిని ఆత్మా ర్పణ చేసుకుంటున్నాడు. ఈ దేశంలో రైతుకి రక్షణ ఉందా? రక్షణ కల్పించాలనే ధ్యాస మన పాలకులకు ఉందా? పండించిన పంటకు గిట్టుబాటుధర లభి స్తుందా? రైతు బతుక్కి భరోసా వుందా? సంవ త్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రహసనంగా మద్దతు ధరలు ప్రకటించడం తప్ప వాటి వలన రైతులకి ఒరిగేదేమిటి? రైతుకి మేలు జరగని మద్దతు ధరలు ఎవరి ప్రయోజనం కోసం? ఎవరి కన్నీళ్ళు తుడవడానికి ఈ మద్దతు ధరలు? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికలకు ముందు 2022 నాటికి రైతుల ఆదాయాల్ని రెట్టింపు చేస్తామని, రైతుల్ని తలెత్తుకొనే విధంగా చేస్తానని, మద్దతు ధర ప్రకటిస్తామని గొప్పలు చెప్పారు. ఈ రోజు దానికి భిన్నంగా నామమాత్రపు మద్దతు ధరలను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎన్ని కలకు ముందు 5వేల కోట్లు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరలను కల్పిస్తా నన్న చంద్రబాబు నాయుడు రాష్ర్టబడ్జెట్లో కనీసం వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదు. పాలకుల హామీలు నీటిమీద రాతలైనపుడు రైతులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉత్పత్తిని పెంచి, ధరలను అదుపు చేయడానికి 2016-17 ఖరీఫ్ సీజనుకు 14 రకాల పంటలకు మద్దతు ధరలను ప్రకటించానని కేంద్రం ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. పప్పు ధాన్యాలకు క్వింటా ల్కు రూ.425, వరికి రూ.60, నూనె గింజలకు రూ.100-200ల వరకు పెంచామన్నారు. 2015-16 తో పోల్చితే వరికి 4.3%, నూనె గింజలకు 9.3% ఇతర పంటలకు 7.5% పెంచి తన బాధ్యత తీరింద నుకోవడం తప్ప రైతుకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ధరని నిర్ణయిస్తే రైతుకు సరిపోతుందని ఆలోచించే స్థితిలో పాలకులు లేరు. తెలుగు రాష్ట్రాల్లో వరి క్వింటాలుకు రూ. 2,300 వరకు ఖర్చవుతుంటే ఏపీ ప్రభుత్వం 1,510 మద్దతు ధర ప్రకటించింది. మిగిలిన నష్టాన్ని రైతు ఎలా పూరించాలి? రైతులు బ్రతకడమంటే రైతు కుటుంబం ప్రాణంతో జీవించడమే కాదు వారి సంతానానికి మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా పంటల ద్వారానే రావాలి. ధరలు నిర్ణయించేటపుడు ఇవన్నీ పరిగణనలో ఉంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఏసీసీ సంస్థ ప్రతి పంటకు విత్తు నాటే సమయం నుంచి పంట మార్కెట్‌కు చేరేవరకు అయ్యే అన్ని రకాల ఖర్చులను, భూమి కౌలును కలిపి ఒక హెక్టారుకు అయ్యే ఖర్చును లెక్కిస్తుంది. ఉత్పత్తితో భాగించి ఒక క్వింటాల్ వ్యయాన్ని నిర్ణ యిస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తిని అధికం చేసి చూపి ఉత్పత్తి ఖర్చును తక్కువగా చూపుతుంది. సాగు ఖర్చులు వివిధ రాష్ట్రాలలో ఒకే విధంగా లేవు. అందువలన అన్ని రాష్ట్రాల సరాసరి ఖర్చును గణించడం వలన కూడా రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు. భారతదేశంలోకి ఇతర దేశాల వ్యవసా యోత్పత్తులను ప్రవహింపచేసి సంపన్న దేశాలకు మార్కెట్ కల్పించాలనేది ప్రపంచబ్యాంకు ఆలోచన. మద్దతు ధరలు అందించే విధానం ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకం కాబట్టి దీన్ని కూడా రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు బతుకు బాగుపడాలంటే, ఉత్పత్తి ఖర్చులతో పాటు రైతు కుటుంబ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని పంటకు ధరలను నిర్ణయించాలి. విద్య, వైద్యం 200 నుంచి 300 శాతం పెరిగిన నేపథ్యంలో ధరల నిర్ణయంలో కుటుంబ వ్యయాన్ని కలపాలి. ప్రతి రైతు కుటుం బానికి జీవన వ్యయానికి సరిపడే కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేసే వ్యవస్థ ఉండాలి. మెట్ట పంటలతో పాటు అన్ని పంటలకు లాభసాటి ధరలను కల్పించే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వాలే తీసుకోవాలి. మద్దతు ధరల కోసం కాకుండా రైతాంగం గిట్టుబాటు ధరలకోసం పోరాడకపోతే భవిష్యత్ మనుగడ అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనా లకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ రెండోవైపు ఆహార భద్రతను గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడలేం. - చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత రైతు కూలీ సంఘం మొబైల్ : 9989737776