పొలాల్లో నాగలి వెనుక నడిచి, నాగటి చాళ్ళల్లో పైరులా ఎదిగి, దేశానికి తిండిపెట్టే రైతు అప్పుల పాలై తిండికోసం ప్రభుత్వాల వైపు మోర ఎత్తుకొనే దుస్ధితికి నెట్టబడ్డాడు. పంట రాశులమీదుగా వ్యాపా రులు పదిమెట్లు పైకి ఎక్కితే అదే రాశుల మీద నుంచి పది మెట్లు క్రిందికి జారిపడి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ‘జైకిసాన్’ అంటూ తిరగాల్సిన రైతు నేడు తలను ఉరికి బిగించుకుంటు న్నాడు. పురుగుమందుల్ని పెరుగన్నంలా తిని ఆత్మా ర్పణ చేసుకుంటున్నాడు. ఈ దేశంలో రైతుకి రక్షణ ఉందా? రక్షణ కల్పించాలనే ధ్యాస మన పాలకులకు ఉందా? పండించిన పంటకు గిట్టుబాటుధర లభి స్తుందా? రైతు బతుక్కి భరోసా వుందా? సంవ త్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ప్రహసనంగా మద్దతు ధరలు ప్రకటించడం తప్ప వాటి వలన రైతులకి ఒరిగేదేమిటి? రైతుకి మేలు జరగని మద్దతు ధరలు ఎవరి ప్రయోజనం కోసం? ఎవరి కన్నీళ్ళు తుడవడానికి ఈ మద్దతు ధరలు?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికలకు ముందు 2022 నాటికి రైతుల ఆదాయాల్ని రెట్టింపు చేస్తామని, రైతుల్ని తలెత్తుకొనే విధంగా చేస్తానని, మద్దతు ధర ప్రకటిస్తామని గొప్పలు చెప్పారు. ఈ రోజు దానికి భిన్నంగా నామమాత్రపు మద్దతు ధరలను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎన్ని కలకు ముందు 5వేల కోట్లు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరలను కల్పిస్తా నన్న చంద్రబాబు నాయుడు రాష్ర్టబడ్జెట్‌లో కనీసం వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదు. పాలకుల హామీలు నీటిమీద రాతలైనపుడు రైతులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఉత్పత్తిని పెంచి, ధరలను అదుపు చేయడానికి 2016-17 ఖరీఫ్ సీజనుకు 14 రకాల పంటలకు మద్దతు ధరలను ప్రకటించానని కేంద్రం ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. పప్పు ధాన్యాలకు క్వింటా ల్‌కు రూ.425, వరికి రూ.60, నూనె గింజలకు రూ.100-200ల వరకు పెంచామన్నారు. 2015-16 తో పోల్చితే వరికి 4.3%, నూనె గింజలకు 9.3% ఇతర పంటలకు 7.5% పెంచి తన బాధ్యత తీరింద నుకోవడం తప్ప రైతుకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ధరని నిర్ణయిస్తే రైతుకు సరిపోతుందని ఆలోచించే స్థితిలో పాలకులు లేరు. తెలుగు రాష్ట్రాల్లో వరి క్వింటాలుకు రూ. 2,300 వరకు ఖర్చవుతుంటే ఏపీ ప్రభుత్వం 1,510 మద్దతు ధర ప్రకటించింది. మిగిలిన నష్టాన్ని రైతు ఎలా పూరించాలి?
రైతులు బ్రతకడమంటే రైతు కుటుంబం ప్రాణంతో జీవించడమే కాదు వారి సంతానానికి మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా పంటల ద్వారానే రావాలి. ధరలు నిర్ణయించేటపుడు ఇవన్నీ పరిగణనలో ఉంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఏసీసీ సంస్థ ప్రతి పంటకు విత్తు నాటే సమయం నుంచి పంట మార్కెట్‌కు చేరేవరకు అయ్యే అన్ని రకాల ఖర్చులను, భూమి కౌలును కలిపి ఒక హెక్టారుకు అయ్యే ఖర్చును లెక్కిస్తుంది. ఉత్పత్తితో భాగించి ఒక క్వింటాల్ వ్యయాన్ని నిర్ణ యిస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తిని అధికం చేసి చూపి ఉత్పత్తి ఖర్చును తక్కువగా చూపుతుంది. సాగు ఖర్చులు వివిధ రాష్ట్రాలలో ఒకే విధంగా లేవు. అందువలన అన్ని రాష్ట్రాల సరాసరి ఖర్చును గణించడం వలన కూడా రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు. భారతదేశంలోకి ఇతర దేశాల వ్యవసా యోత్పత్తులను ప్రవహింపచేసి సంపన్న దేశాలకు మార్కెట్ కల్పించాలనేది ప్రపంచబ్యాంకు ఆలోచన. మద్దతు ధరలు అందించే విధానం ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకం కాబట్టి దీన్ని కూడా రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైతు బతుకు బాగుపడాలంటే, ఉత్పత్తి ఖర్చులతో పాటు రైతు కుటుంబ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని పంటకు ధరలను నిర్ణయించాలి. విద్య, వైద్యం 200 నుంచి 300 శాతం పెరిగిన నేపథ్యంలో ధరల నిర్ణయంలో కుటుంబ వ్యయాన్ని కలపాలి. ప్రతి రైతు కుటుం బానికి జీవన వ్యయానికి సరిపడే కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేసే వ్యవస్థ ఉండాలి. మెట్ట పంటలతో పాటు అన్ని పంటలకు లాభసాటి ధరలను కల్పించే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వాలే తీసుకోవాలి. మద్దతు ధరల కోసం కాకుండా రైతాంగం గిట్టుబాటు ధరలకోసం పోరాడకపోతే భవిష్యత్ మనుగడ అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనా లకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ రెండోవైపు ఆహార భద్రతను గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడలేం.
- చిట్టిపాటి వెంకటేశ్వర్లు,
ప్రధాన కార్యదర్శి అఖిల భారత రైతు కూలీ సంఘం
మొబైల్ : 9989737776