
లెక్కల్లో చిక్కులు
‘అనంత’లో రైతు ఆత్మహత్యలే జరగలేదని ఇన్నాళ్లూ బుకాయించిన ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ చూపిన సాక్ష్యాలకు సమాధానం చెప్పలేకపోయింది.
‘అనంత’లో రైతు ఆత్మహత్యలే జరగలేదని ఇన్నాళ్లూ బుకాయించిన ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ చూపిన సాక్ష్యాలకు సమాధానం చెప్పలేకపోయింది. వాస్తవాలు కళ్లెదుట కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకడుగు వెనక్కు తగ్గారు. ఆత్మహత్యలపై విచారణ చేయించి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇప్పటి వరకు ‘ఆత్మహత్య’ల లెక్క తేలలేదు. ఈ క్రమంలో కుంటిసాకులతో రైతు కుటుంబాలకు పరిహారం దూరం చేయకుండా, వారికి దన్నుగా నిలిచేలా అధికారుల విచారణ సాగాలని సామాజికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షిప్రతినిధి, అనంతపురం : రుణమాఫీపై ప్రభుత్వం అవలంభించిన అసంబద్ధమైన నిర్ణయాలతో జిల్లాలోని రైతన్నకు భరోసా కరువైంది. మూడేళ్లుగా పంట నష్టంతో మోయలేని భారంగా పరిణమించిన అప్పులు, బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలు చెల్లించాలని నోటీసులు.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు.. తాళలేక కుటుంబ పోషణ కూడా భారమై జిల్లాలో నవంబర్ 17వరకూ 40 మంది రైతులు ఆత్మహత్యలకు తెగించారు.
ఆపై మరో ఐదుగరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు చేనేత కార్మికులు ఉన్నారు. 421 జీవో ప్రకారం ఈ 45 కుటుంబాలకు 1.50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందాలి. ఆత్మహత్యలపై ‘సాక్షి’లో కథనాలు రాగానే జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ స్పందించి ఏడు కుటుంబాలకు పరిహారం అందించారు. తక్కిన వాటిపై ఆర్డీవోలతో విచారణ చేయించారు. జిల్లాలో 18 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆర్డీవోలు తేల్చారు. పరిగణలోకి తీసుకోని ఆత్మహత్యలపై కలెక్టర్ ఆరా తీశారు.
ఆర్డీవోలు చెప్పిన కారణాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 421 జీవో ప్రకారం అప్పుల బాధతో రైతు కుటుంబంలో జరిగిన ఏ ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగా భావించాలని ఉందని, ఈ క్రమంలో మరీ పట్టుదలకు పోకుండా రైతు కుటుంబాలను అండగా నిలచేలా విచారణ చేయండని కలెక్టర్ మరోసారి పునఃవిచారణకు ఆదేశించారు. ఇప్పటికీ ఇంకా నివేదిక సిద్ధం కాలేదు. నేడో, రేపో అధికారులు పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నారు.
ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం
రైతు ఆత్మహత్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి తీవ్రంగా స్పందిస్తోంది. ‘అనంత’లో రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమించడం లేదని ఈ నెల 4న రుణమాఫీపై విధాన ప్రకటనసమయంలో చంద్రబాబు చేసిన ప్రకటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. సంక్రాంతి తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను స్వయంగా వచ్చి పరామర్శిస్తానని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో మంగవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘అనంత’ ఆత్మహత్యలపై తీవ్ర చర్చ జరిగింది.
ఆత్మహత్య చేసుకున్న రైతు పేరు, చిరునామా, ఎలా ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలతో కూడిన జాబితాను జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మంగళవారం అసెంబ్లీలో సీఎంకు చూపారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ప్రతిపక్షాలు ఇచ్చిన ఆత్మహత్యల జాబితాతో పాటు సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చివరకు తలొగ్గి ‘అనంత’లో ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకున్నారు. అధికారులతో విచారణ చేయించి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు.
ఆదుకుంటారా.. చేయిస్తారా
421 జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 1.50 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. జిల్లాలో ఇప్పటికే ఏడు కుటుంబాలకు పరిహారం అందింది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వీరికి అదనంగా మరో 3.50 లక్షల రూపాయల పరిహారం దక్కాలి. ఈ ఏడుగురు కాకుండా మరో 11మంది మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ఆర్డీవోలు లెక్కతేల్చారు. వీరికి మాత్రమే పరిహారం ఇచ్చి చేయి దులుపుకుంటారా.. లేక కలెక్టర్ ఆదేశించిన పునఃవిచారణను పరిగణలోకి తీసుకుని నిజంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేస్తారా.. అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.
మళ్లీ విచారణ చేస్తున్నాం
‘సాక్షి’లో ప్రచురితమైన 45 మంది రైతుల ఆత్మహత్యల జాబితాపై విచారణ చేశాం. 18 మంది రైతు ఆత్మహత్యలని ఆర్డీవోల విచారణలో తేలింది. వీరిలో ఇప్పటికే ఏడుగురికి పరిహారం అందించాం. సాంకేతిక కారణాలతో తక్కిన వాటిని తోసిపుచ్చారు. మళ్లీ వీటిపై పునఃవిచారణకు కలెక్టర్ ఆదేశించారు. నేడో, రేపో తుది నివేదిక అందుతుంది. నివేదిక రాగానే పరిహారం అందిస్తాం.
- హేమసాగర్, డీఆర్వో