కంప్యూటర్ మిథ్య | computer education in government schools | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ మిథ్య

Published Tue, Dec 24 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

computer education in government schools

 సాక్షి, ఒంగోలు:
 రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా...ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకుగాను కోట్లాది రూపాయలను ఖర్చు చేసింది. కానీ సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు తీరు అధ్వానంగా ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అందజేసిన వేలాది కంప్యూటర్లు నేడు నిరుపయోగంగా పడున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌ల తాళాలు తీసి ఎన్ని రోజులైందో. కారణం సంబంధిత ఇన్‌స్ట్రక్టర్లు లేకపోవడమే. ఇన్‌స్ట్రక్టర్ల కాంట్రాక్టు గడువు ముగియడంతో బోధించే వారు లేకుండాపోయారు. తొలుత ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు ఎందుకూ పనికిరాకుండా తయారయ్యాయి. జిల్లాలోని జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 కంప్యూటర్లను మూడు నెలల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు.
 
 కొనకనమిట్లలో 4 నెలల క్రితం 20 కంప్యూటర్లను, ఉప్పలపాడు, పొదిలిలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లు, సీపీయూలు సైతం దొంగలపాలయ్యాయి. దీన్ని బట్టి కంప్యూటర్ల వినియోగంలో .. వాటి భద్రతపై శ్రద్ధ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అనేక చోట్ల కంప్యూటర్లు బూజుపట్టి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. కంప్యూటర్ విద్యను బోధించాల్సిన ఇన్‌స్ట్రక్టర్లు చేయాల్సిన పనులను ప్రభుత్వం ఉపాధ్యాయులపై రుద్దింది.  ఉన్న బాధ్యతలే మోయలేకున్న తమపై మరొకటా అంటూ టీచర్లు పెదవి విరుస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమా అంటూ ఈ ఏడాది పాఠశాలల్లో చదువు కుంటుపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ పోర్షన్‌ను పూర్తి చేయాలనే లక్ష్యమే ప్రస్తుతం వారి ముందుంది. పదో తరగతి పరీక్షల టైంటేబుల్ సైతం అప్పుడే  వచ్చేసింది. కంప్యూటర్ విద్యలో నిష్ణాతులైన ఎందరో నిరుద్యోగులున్నప్పటికీ వారిని ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వానికి నిధుల కొరత అడ్డొస్తోంది. దీంతో ఉన్నత ఆశయం కాస్త నీరుగారుతోంది.
 
 ఒంగోలులో..
 ఒంగోలు నగర పరిధిలో ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు 11 కంప్యూటర్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ మూలనపడటంతో  సుమారు 7 వేల మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమయ్యారు.
 కొండపిలో..
 టంగుటూరు, కారుమంచి, తూర్పునాయుడుపాలెం హైస్కూళ్లలో కంప్యూటర్ విద్య నడుస్తుండగా మిగతా ఏడు హైస్కూల్స్‌లో బోధకులు లేరు. నర్సింగోలు, పీరాపురం యూపీ పాఠశాలలకు కంప్యూటర్‌లు ఇవ్వలేదు. పచ్చవ హైస్కూల్లో బోధకుడు లేకపోవడంతో ఇతర సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయుడే చెప్తున్నాడు.  జరుగుమల్లి ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధిస్తున్నారు. విద్యుత్ సౌకర్యంలేక పోతే ఉపయోగించుకోవటానికి ఏర్పాటు చేసిన జనరేటర్ మరమ్మతులకు గురై మూలనపడి ఉంది. కామేపల్లి హైస్కూల్లో వేరే సబ్జెక్ట్ టీచరే విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్పుతున్నారు.
 
 కనిగిరిలో..
 కనిగిరి మండలంలో మూడు పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ విద్య అందిస్తున్నారు. తాళ్లూరు ఉన్నత పాఠశాలలో కంప్యూటర్‌లు చోరీకి గురయ్యాయి. గురువాజిపేటలో ప్రత్యామ్నాయంగా హిందీ టీచర్‌తో కంప్యూటర్ కోర్సు నడుపుతున్నారు.  పామూరు మండలంలో  రెండు, మూడు పాఠశాలల్లో మాత్రమే ప్రత్యామ్నాయంగా వేరే సబ్జెక్టు టీచర్లతో కంప్యూటర్ విద్య బోధిస్తున్నారు. మార్కొండాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కంప్యూటర్లు ఆరంభం నుంచి అలంకారప్రాయంగా ఉన్నాయి. మొగళ్లూరు, పి నాగులవరం, ఇమ్మడిచెరువు పాఠశాలలకు కంప్యూటర్లు ఇవ్వలేదు. హనుమంతునిపాడు మండలంలో 7 పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మతులకు గురయ్యాయి.  సీఎస్‌పురంలోని జెడ్పీ ఉన్నత, చెన్నపునాయునిపల్లి, పెదగోగులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో కంప్యూటర్‌లు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి.   చెన్నపునాయునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోని 5 కంప్యూటర్‌లు  2011 నుంచి మరమ్మతులకు గురయ్యాయి.
 
 మార్కాపురంలో..
 పొదిలి మండలంలోని ఉప్పలపాడు, పొదిలి ప్రభుత్వ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో దొంగలు పడి కంప్యూటర్లను, సీపీయూలను ఎత్తుకెళ్లారు. పొదిలి బాలుర ఉన్నత పాఠశాలలో 2 కంప్యూటర్లతో విద్యను అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement