విడవలూరు: పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందే పరిస్థితి కనిపించడం లేదు. మారుమూల గ్రామాల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు కంప్యూటర్‌పై కనీస అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న కంప్యూటర్ విద్యా మిధ్యాగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో 5,000 స్కూల్, ,1300 స్కూల్ పథకాలు కింద కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించే విధంగా ఒక్కొక్క పాఠశాలకు ఇద్దరు చొప్పున ఫ్యాకల్టీలను నియమించారు.
అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మరణాంతరం రాష్ట్రంలో కంప్యూటర్ విద్య అటకెక్కింది. మన జిల్లాలో 2008లో 5,000 స్కూల్ పథకం కింద, 2009లో 1,300 స్కూల్ పథకం కింద సుమారు 250 ప్రభుత్వ పాఠశాల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. వీటిలో నిట్ ద్వారా ప్రభుత్వం కంప్యూటర్ విద్యను అమలుచేస్తుంది. నిట్ ద్వారా ఒక్కొక్క పాఠశాలలో 10 అధునాతన కంప్యూటర్లు, వాటికి సంబంధించి టేబుల్స్, కుర్చీలను అందించారు. పాఠశాలకు ఇద్దరు చొప్పున ప్యాకల్టీ(ఉపాధ్యాయులు)లను ఏర్పాటు చేశారు.
అయితే 5,000 స్కూల్ పథకం కింద ప్యాకల్టీలు కుదుర్చుకున్న ఒప్పందం గతేడాదితో పూర్తయ్యంది. దీంతో జిల్లాలోని 200 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య విద్యార్థులకు దూరమైంది. ఈ కారణంగా ఆయా పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆ పాఠశాల్లోనే ఉన్న ఉపాధ్యాయులే కంప్యూటర్ తరగతులను కూడా నిర్వహించాల్సి వచ్చింది. అయితే వారికి ఈ కంప్యూటర్ విద్యపై అవగాహన లేకపోవటంతో పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లు మూలనపడ్డాయి.
రూ. 500 కోట్లు వృథా..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లతో ఈ పథకాన్ని అమలుపరచింది. ప్రస్తుతం అది అటకెక్కడంతో దాదాపు ఆ నిధులు వృథా కానున్నాయి. ఒక్కొక్క పాఠశాలకు రూ.2 లక్షలు విలువ చేసే కంప్యూటర్లు వాటి సంబంధిత పరికరాలు, జనరేటర్‌తో పాటు ఒక ఫ్యాకల్టీకి నెలకు రూ.2,600 వేతనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం కంప్యూటర్ విద్య నడుస్తున్న పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్యాకల్టీలకు ఇప్పటికి 4 నెలలు జీతాలు అందలేదు. దీంతో వారు అవస్థలు పడుతున్నారు.
నేటితో ముగిసిన ఒప్పందం
కాగా జిల్లాలో 1,300 స్కూల్ పథకం ఉన్న సుమారు 23 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య నడుస్తోంది. అయితే ఇవి కూడా జులై 4 వరకు మాత్రమే నడవనున్నాయి. తర్వాత నిట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పదం రద్దుకానుంది. దీంతో జిల్లా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఇక మిధ్యగా మారనుంది.
ఇప్పటికే చాలా పాఠశాలల్లో కంప్యూటర్లు మరమ్మతులకు గురైతే మాత్రం వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇప్పటికైన పాఠశాలల్లో కంప్యూటర్ విద్య నిర్వహణను చేపట్టిన సంబంధిత సంస్థ వారు కంప్యూటర్లను సకాలంలో విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.
కంప్యూటర్ విద్య.. మిథ్యే!
Published Sat, Jul 4 2015 1:45 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement