నిబంధనలకు చెల్లు.. మందుబాబుల జేబుకు చిల్లు | Conditions Not Applying In Guntur Wine Shops | Sakshi
Sakshi News home page

నిబంధనలకు చెల్లు.. మందుబాబుల జేబుకు చిల్లు

Published Tue, Jun 19 2018 11:25 AM | Last Updated on Tue, Jun 19 2018 11:25 AM

Conditions Not Applying In Guntur Wine Shops - Sakshi

గుంటూరు రూరల్‌ మండలం నల్లపాడులో మద్యం దుకాణం పక్కన బార్‌ ఏర్పాట్లు

సాక్షి, గుంటూరు: వైన్‌ షాపుల ముందు ధరల పట్టిక ఉండాలి.. హోలో గ్రామ్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలి.. హోల్‌సేల్‌గా అమ్మకూడదు.. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించకూడదు.. ఇవన్నీ మద్యం వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు. అయితే, చాలాచోట్ల ఇవి నీటి మీద రాతల్లా మారాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి లాభాలే లక్ష్యంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుగుతున్నా ఎక్సైజ్‌ అధికారుల్లో చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బార్‌ కోడింగ్‌ అమలు, దుకాణాల ముందు సీసీ కెమేరాల ఏర్పాటు, ఆన్‌లైన్‌ బిల్లు వంటి నిబంధనలు తప్పనిసరి చేసినా చాలాచోట్ల అమలు అవి రికార్డులకే పరిమితంగా మారాయి.

మూన్నాళ్ల ముచ్చటగా హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానం
మ్యానువల్‌గా మద్యం అమ్మకాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం ఎక్సైజ్‌ శాఖ ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ అమ్మకాల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. హెడోనిక్‌ పార్ట్‌ ఫైండర్‌ సిస్టమ్‌ (హెచ్‌పీఎఫ్‌ఎస్‌) విధానం రాష్ట్రవ్యాప్తంగా  2015 జులై 1వ తేదీ నుంచి అన్ని వైన్‌ షాపులు, బార్‌లలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ఎమ్మార్పీ, బ్యాచ్‌ నంబర్, అమ్మకాలు పూర్తిగా నమోదు అవుతాయి. అయితే, ఈ విధానం నామమాత్రంగానే అమలవుతోంది. కొన్ని దుకాణాల్లో కంప్యూటర్‌ కూడా ఉండటం లేదు. హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానం సరిగా అమలు కాకపోవడం వల్ల కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. ఈ విధానం సరిగా అమలు జరిగితే ఉదయం 10 గంటల కన్నా ముందు, రాత్రి పది గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరిపితే అధికారులకు వెంటనే సమాచారం తెలిసిపోతుంది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ అమ్మడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు వినియోగదారులకు కంప్యూటర్‌ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధనలు అన్ని పాటిస్తే తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్‌ విధానాన్ని పాటించడం లేదు. దీనివల్ల కల్తీ మద్యం బాటిళ్లు పట్టుబడినప్పుడు అవి ఎక్కడి నుంచి తయారై వచ్చాయో గుర్తించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

నిలువుదోపిడీ
ఎక్సైజ్‌ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని బాటిల్స్‌లోనే విక్రయించాలి. కానీ జిల్లాలోని అన్ని   దుకాణాల్లో విరుద్ధంగా లూజుగా విక్రయిస్తున్నారు.దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం రాయుళ్లు ఖరీదైన మద్యం సీసాల్లో మధ్య రకం బ్రాండ్లను కలిపి మందుబాబులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బార్‌లలో ఎమ్మార్పీ రేట్లు వర్తించవన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని యజమానులు సర్వీసు చార్జీల పేరుతో వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. కొన్ని బార్లలో బీర్‌ బాటిల్‌ ధర రూ. 110 నుంచి రూ. 170 వరకు విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్, స్థానిక పోలీసు అధికారులు నెలానెలా మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదు. కొద్ది నెలల క్రితం ఎక్సైజ్‌ శాఖలో లోపాలు ఆసరాగా చేసుకుని సాక్షాత్తు ఆ శాఖ ఉద్యోగే కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

జిల్లాలో 185 బార్లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 4.25కోట్ల చొప్పున నెలకు రూ. 125 కోట్ల నుంచి 130 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతోంది. రోజురోజుకూ మద్యం విక్రయాలు పెరగడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అ«ధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇస్టానుసారంగా విక్రయాలు కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనండి.. లేకుంటే వెళ్లిపోండనే సమాధానం వస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తెనాలి, రేపల్లె, పల్నాడు  ప్రాంతాల్లో గ్రామానికి రెండు లేదా మూడు చొప్పున బెల్టు కొనసాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిలో దాదాపుగా అందరూ అధికారపార్టీకి చెందిన వారు కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం సాహసించలేక పోతున్నారు.

మా దృష్టికి వస్తేకఠినంగా వ్యవహరిస్తాం
సిగ్నల్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే బార్‌ కోడింగ్‌ విధానం అమలులో లేదు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం మాదృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాలతో త్వరలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకుంటాం.– శ్రీమన్నారాయణ, ఎక్సైజ్‌ డీసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement