
రుణ మాఫీపై ఆంక్షలు!
ఆర్ధిక భారం తగ్గించుకునే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన మొదటిరోజే వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామంటూ నమ్మబలికిన చంద్రబాబు ఆ మేరకు తొలి సంతకం చేయకపోగా.. కమిటీ పేరుతో నెలన్నర సాగదీసి చివరకు పలు ఆంక్షలతో రుణమాఫీని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్క రుణం మాత్రమే మాఫీ చేయాలని, అది కూడా ఒక కుటుంబానికి చెందిన లక్షన్నర వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించిన విధివిధానాల ఖరారు, అందుకు అవసరమైన ఆర్ధిక వనరుల సమీకరణపై కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై చర్చించింది. రుణ మాఫీకి పరిమితులు విధించాలని, ఈ వారంలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూత్రప్రాయంగా నిర్ణరుుంచింది. రాష్ర్టంలో మొత్తం పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రూ.60 వేల కోట్ల మేరకు ఉండగా.. పరిమితులతో దాన్ని రూ.25 వేల కోట్లకు కుదించవచ్చని కమిటీ భావిస్తోంది. వ్యవసాయ టర్మ్ రుణాలు, వాణిజ్య పంటల రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై తీసుకున్న రుణాలు, గతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట రుణాలు వ్యవసాయ టర్మ్ రుణాలుగా మారిన వాటికి మాఫీ అసలుకే వర్తింపజేయరాదని నివేదికలో సూచించనున్నట్టు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. బంగారం కుదవ పెట్టి తీసుకున్న రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బీఐ అంగీకరించలేదని భేటీలో పాల్గొన్న ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. రీ షెడ్యూల్‌పై మంగళవారం ఆదేశాలు జారీ కావచ్చన్నారు.
రైతు రుణ ఖాతాకు ఆధార్ లింక్ చేయండి
అన్ని బ్యాంకులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని లెక్కలేసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం రైతుల రుణ ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయాల్సిందిగా అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వంపై వీలైనంతవరకు రుణ భారం తగ్గుతుందని, రైతుల మీద రుణ భారం పెంచడానికి దోహదపడుతుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆధార్ ఉంటేనే రుణ మాఫీ అవుతుందని, లేదంటే కాదని కూడా స్పష్టం చేయాలని బ్యాంకర్లకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు.
మాఫీపై వెంటనే స్పష్టత ఇవ్వండి
ఏపీ సర్కారుకు బ్యాంకర్ల కమిటీ లేఖ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పంట రుణాల రైతులే కాకుండా వ్యవసాయ టర్మ్ రుణాలు, వాణిజ్య పంటలకు తీసుకున్న రుణాలను కూడా చెల్లించడం లేదని.. ఆ రుణాల రెన్యువల్‌కు కూడా ముందుకు రావడం లేదని పేర్కొంది. ఫలితంగా ఆయా రుణాలు బకాయిలుగా మారడమే కాకుండా నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ)లు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితుల్లో ఎప్పటివరకు తీసుకున్న రుణాలను, ఏ రంగానికి చెందిన రుణాలను మాఫీ చేస్తారో స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ సి.దొరస్వామి లేఖ రాశారు.
రుణ మాఫీపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్ : రైతు రుణ మాఫీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యన్ని హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రుణ మాఫీపై ప్రభుత్వాలు అధికారికంగా ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోనందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.