సమస్యలపై సమర శంఖం | Cone fighters issues | Sakshi
Sakshi News home page

సమస్యలపై సమర శంఖం

Published Sun, Nov 30 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

సమస్యలపై సమర శంఖం

సమస్యలపై సమర శంఖం

ఆయన ప్రముఖ ఎముకల వైద్యనిపుణుడు.. మొన్ననే ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు సాక్షి కోసం వీఐపీ రిపోర్టర్‌గా మారారు. నిరుపేదల కాలనీలో పర్యటించి, కష్టాలు విన్నారు.

ఆయన ప్రముఖ ఎముకల వైద్యనిపుణుడు.. మొన్ననే ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు సాక్షి కోసం వీఐపీ రిపోర్టర్‌గా మారారు. నిరుపేదల కాలనీలో పర్యటించి, కష్టాలు విన్నారు. వారి సాదకబాధలు స్వయంగా చూశారు. ఒక్కొక్కరిని పలుకరించి ప్రభుత్వ పథకాలు వారికెలా అందుతున్నాయో తెలుసుకున్నారు. చౌక డిపోల్లో సరుకులు అందడం లేదని ఓ మహిళ.. మొన్నటి వరకు అందిన రూ.200 పింఛను కూడా లేకుండా చేశారని ఓ తాత.

అపరిశుభ్రతతో రోగాల బారిన పడుతున్నామని ఓ అన్న.. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశించి భంగపడ్డామని డ్వాక్రా సభ్యురాలు ఇలా.. కాలనీవాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారందరి సమస్యలను సావధానంగా ఆలకించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
సాక్షి, గుంటూరు: నరసరావుపేట పట్టణంలోని బీసీ కాలనీవాసులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సుమారు 200 కుటుంబాలు జీవించే ఈ కాలనీలో చినుకు పడిందంటే చాలు ఇళ్లల్లోకి నీరు చేరిపోతుంది. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద ప్రజలు జీవనం సాగించే ఈ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక దోమలు విజృంభించటంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు.

అనేక మంది నిరుపేద వృద్ధులకు ఇప్పటివరకు వచ్చిన పింఛన్లు నిల్చిపోయాయి. చౌకధరల దుకాణాల ద్వారా వచ్చే నిత్యావసర వస్తువులు సక్రమంగా అందటం లేదు. రుణమాఫీ జరుగుతుందని ఆశించిన మహిళా సంఘాల వారు ఇన్నాళ్ళు ఆశగా ఎదురుచూసి ఇక నమ్మకం లేక నిరాశతో ఉన్నారు.

వీరి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డిశ్రీనివాసరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. అధికారులు సరిగా సహకరించకపోయినప్పటికీ సాధ్యమైనంత వరకు పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ఆయన శనివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా కాలనీకి వెళ్లి ప్రజల్ని పలుకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాలనీవాసులు పడుతున్న బాధలు, వారి సమస్యలు వారిమాటల్లోనే...
 ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి: చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా...?
 సంపూర్ణ : రెండు నెలల క్రితం వరకు బాగానే అందాయి. ఇప్పుడు సరిగ్గా ఇవ్వటంలేదు. రేషన్ కార్డులో నలుగురు కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే ఇద్దరికే బియ్యం ఇస్తున్నారు.  
 ఎమ్మెల్యే: రేషన్ సమయానికి ఇస్తున్నారా.. కార్డులు ఏమైనా తొలగిస్తున్నారా..?
 మల్లీశ్వరి:  20 ఏళ్లుగా మాకు రేషన్ ఇస్తున్నారు. ఇటీవల అనర్హులమంటూ రేషన్ నిలిపివేశారు. కార్డులన్నీ ఏదోవంకతో తొలగిస్తున్నారు. ఈనెల ఇంతవరకు సరుకులివ్వ లేదు. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
 ఎమ్మెల్యే : తాతా.. పింఛన్ అందుతుందా..ఎంత ఇస్తున్నారు..?
 షేక్ మాబు: అయ్యా గతంలో నాకు రూ.200 ఫించన్ వచ్చేది. ఇప్పుడు పెంచారట, కానీ నాపేరును తొలగిం చారు. గతంలో ఒకటో తేదీనే పింఛన్ మా చేతుల్లో పడేది. ఇప్పుడు 30వ తేదీ వచ్చినా ఇవ్వడంలేదు.
 ఎమ్మెల్యే: మీ రుణాలు మాఫీ అయ్యాయా?
 షాకీరా: మేము డ్వాక్రా గ్రూపులో రుణాలు తీసుకున్నాం. మాఫీ చేస్తామంటే ఆనందించాం. ఇప్పటివరకు అప్పు చెల్లించకుండా ఉండిపోయాం. వడ్డీభారం పెరిగిపోతుందే తప్ప రుణమాఫీ జరగటంలేదు. జరుగుతుందన్న నమ్మకం కూడా పోయింది.
 ఎమ్మెల్యే : ఏమ్మా.. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలావుంది ?
 షేక్ కరీమూన్: మురుగు కాల్వలు సక్రమంగా లేవు. రోడ్లపై నుంచి మురుగు ప్రవహిస్తోంది. చిన్న వర్షం పడినా మురుగునీరంతా ఇళ్లల్లోకి చేరుకుంటోంది. దోమల బాధ ఎక్కువైంది. కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నా అధికారులు  స్పందించటం లేదు.
 ఎమ్మెల్యే: అవ్వా.. నెల నెలా ఫించన్ సక్రమంగా అందుతోందా..?
 ఏమైనా సమస్యలు ఉన్నాయా...?
 విజయలక్ష్మి: పింఛన్ తీసుకునేందుకు అర్హత ఉందంటూ ఎన్‌టీఆర్ భరోసా బాండు కూడా ఇచ్చారు. అదేతో మిషన్లో వేలిముద్రలు సక్రమంగా పడలేదని పింఛన్ ఆపేశారయ్యూ. అదేమని అడిగితే ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు.
 ఎమ్మెల్యే: మీకేమైనా రుణమాఫీ జరిగిందా?
 బీబీజాన్: అయ్యా.. బంగారం పెట్టి ఏడాది క్రితం రు.1.5 లక్షల రుణం తీసుకున్నా. రూ.50 వేలు చెల్లించా. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో రూ.లక్ష బ్యాంకుకు కట్టకుండా ఉండిపోయా. బంగారం వేలం వేస్తున్నామంటూ బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు.
 ఎమ్మెల్యే : కౌన్సిలర్ గారూ... మీ వార్డులో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులేమైనా స్పందిస్తున్నారా..?
 కౌన్సిలర్ మహబూబి: సార్, మా వార్డులో జన్మభూమి కార్యక్రమాలు ఆర్భాటంగా పెట్టారుకాని ప్రజలకు మాత్రం ఎటువంటి ప్రయోజనం కలగలేదు. జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్న ఫించన్లు, కార్డులు, ఏ ఒక్కటి వారికి రాలేదు. రోడ్లు, డ్రైనేజ్ అధ్వానంగా ఉన్నాయి. వర్షం కురిస్తే కాలనీ మొత్తం జలమయం అవుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం కాలువ పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించాలి. అధికారులకు చెప్పినా నిధులు లేవంటున్నారు.
 ఎమ్మెల్యే: రాజధాని నిర్మాణానికి పచ్చని పంట పొలాలు సేకరించ డాన్ని మీరెలా భావిస్తున్నారు..?
 షేక్ మహబూబ్‌బీ:  బంజరు భూములు, ప్రభుత్వ భూములు అనేక ఉన్నప్పటికీ పంట పొలాలను నాశనం చేయాలనే చూడటం బాధాకరం. ఆ పొలాలపై ఆధారపడి రైతులే కాకుండా మాలాంటి కూలీలు ఎందరో బతుకుతున్నారు. మాకు ఆ పనికూడా లేకుండా చేస్తున్నారు.  
 హిదాయత్‌ఖాన్: రాజధాని నిర్మాణానికి మూడు పంటలు పండే భూములను లాక్కొని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కౌలురైతులు, రైతు కూలీల జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు.
 
 ప్రజెంటేషన్ : నక్కా మాధవరెడ్డి,
 ఫొటోలు: వి.రూబెన్‌బెసాలియేల్
 
 ఎమ్మెల్యే ఇచ్చిన హామీలివీ..
 
 కాలనీ వాసులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఖత్వావాగు సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.
 రిటైనింగ్ వాల్ నిర్మించేలా ఇప్పటికే కౌన్సి ల్ సమావేశంలో ఆమోదింపజేశాం.. త్వరి తగతిన దీని నిర్మాణం చేపట్టేలా చూస్తా.

 కాలనీలో చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర వస్తువులు సక్రమంగా అందేలా జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడతా.

 కాలనీలో అనేకమంది అర్హులైన వృద్ధులకు పించన్లు నిలిపివేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టిలో పెట్టి వారికి పింఛన్లు వచ్చేలా చూస్తా.

 పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి డ్రైనేజ్ వ్యవస్థ గాడిలో పెట్టేలా ప్రజారోగ్య శాఖాధికారులకు ఆదేశాలు జారీచేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement