సాక్షి, హైదరాబాద్: టీడీపీలో చేరిన పార్టీ ఎమ్మెల్సీలపై చర్యలకు కాంగ్రెస్ రంగం సిద్ధంచేస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారితోపాటు పార్టీకి అనుబంధంగా కొనసాగి పార్టీ మారిన ఎమ్మెల్సీలకూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఈ నోటీసులు ఇవ్వనున్నారు. షోకాజ్ నోటీసులకు ఆయా ఎమ్మెల్సీలు వారం రోజుల్లో సమాధానమివ్వాలని కోరనున్నారు. ఎమ్మెల్సీల సమాధానాలు అందిన తదుపరి పార్టీ మండలిలో కాంగ్రెస్ పక్షం ద్వారా ఆ ఎమ్మెల్సీలపై అనర్హత చర్యలకోసం చైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఛైర్మన్‌కు సమర్పించనున్నారు.
లక్ష్మీ శివకుమారి, బలశాలి ఇందిర, షేక్ హుస్సేన్, రవి కిరణ్‌వర్మ, చైతన్యరాజు, శ్రీనివాసులునాయుడు, బచ్చల పుల్లయ్యలు సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారు కాగా మరికొందరు ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగారు. వారు పార్టీ కండువాలు కప్పుకోవడంతో పాటు తాము తెలుగుదేశంలో చేరినట్లు బహిరంగంగా కూడా ప్రకటించారు. మరో ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఇంతకుముందే టీడీపీలో చేరి మండలి సమావేశాలకు టీడీపీ కండువా వేసుకొని హాజరవుతున్నారు. సోమవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భేటీ అయినప్పుడు ఈ ఎమ్మెల్సీల వ్యవహారం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మండలిలో బలం పెంచుకొనేందుకు టీడీపీ ఇతర పార్టీల ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేస్తోందని రఘువీరా చెప్పారు. పార్టీ మారిన వారికి షోకాజ్ నోటీసులివ్వడంతోపాటు, టీడీపీలో చేరినట్లు సాక్ష్యాధారాలతో సహా మండలి ఛైర్మన్‌కు అనర్హత ఫిర్యాదు అందించాలని అధిష్టానం నిర్ణయించింది.
కాంగ్రెస్‌లో మిగిలింది వీరే: ఇటీవల టీడీపీలోకి ఫిరాయించినవారు పోగా కాంగ్రెస్ పార్టీకి మండలిలో మిగిలిన సభ్యులు కొందరే. ఎమ్మెల్యే కోటాలో రుద్రరాజు పద్మరాజు, సింగం బసవపున్నయ్య, బి.చెంగల్రాయుడు, పాలడుగు వెంకటరావు, మహ్మద్ జానీ, సి.రామచంద్రయ్య, ఎం సుధాకర్‌బాబులున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఐలాపురపు వెంక య్య, డీవీ సూర్యనారాయణరాజు, పీరుకట్ల విశ్వప్రసాదరావు, వాకాటి నారాయణరెడ్డి ఉన్నారు. వీరుకాకుండా గవర్నర్ నామినేటెడ్ కోటాలో కంతే టి సత్యనారాయణరాజు, రత్నాబాయి, జూపూడి ప్రభాకర్‌రావు, షేక్ హుస్సేన్, బలశాలి ఇందిర, డాక్టర్ ఎ.చక్రపాణి, ఆర్ రెడ్డపరెడ్డిలు కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులైనవారే కావడంతో కాంగ్రెస్ సభ్యులుగానే పరిగణనలోకి వస్తున్నారు.